గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 09:18:27

సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది

సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది

అబిడ్స్‌  : దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేసి అందజేయడంతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్‌ పరిధిలోని కట్టెలమండిలో నిర్మితమైన డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులకు  కలెక్టర్‌ శ్వేతా మహంతి, హైదరాబాద్‌ ఆర్‌డీఓ అనిల్‌,  నాంపల్లి తహసీల్దార్‌ రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌లతో కలిసి చిన్నారుల ద్వారా డ్రా తీయించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, తాళం చేతులను అందజేశారు.  ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి తలసాని  మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి  పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి  చేపడుతున్న  పథకాలను ఇతర రాష్ర్టాల వారు ఆదర్శంగా తీసుకుని వారి రాష్ర్టాల్లో ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో 103 మంది లబ్ధిదారురులున్నారని వారందరికీ ఇండ్లను కేటాయించామన్నారు. మిగిలిన వాటిని నిరుపేదలకు అందజేస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ మాట్లాడుతూ..  కట్టెలమండిలో లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను కేటాయించాలని ఆందోళనకు దిగేలా కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. తమకు తెలియగానే మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌, పి.అనిత, సంతోషి, పి.నరేందర్‌ యాదవ్‌లతో అక్కడకు చేరుకుని వారిని సముదాయించి మంత్రి   దృష్టికి తీసుకువెళ్లగా ఆయన, కలెక్టర్‌ శ్వేతా మహంతి చేరుకున్న తర్వాత పారదర్శకంగా లబ్ధిదారులందరికీ ఇండ్ల పట్టాలు, తాళం చేతులను అందజేశామన్నారు.  గృహ ప్రవేశం చేసిన తర్వాత మంత్రి తలసాని,   కలెక్టర్‌ శ్వేతా మహంతి, ఆర్‌డీఓ అనిల్‌, తహసీల్దార్‌ రామకృష్ణలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సునీల్‌ సాహు, రాము, సాంబ   పాల్గొన్నారు.