e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ సమన్వయంతో సమర్ధవంతంగా కట్టడి చేద్దాం

సమన్వయంతో సమర్ధవంతంగా కట్టడి చేద్దాం

సమన్వయంతో సమర్ధవంతంగా కట్టడి చేద్దాం
  • నగరంలో నియంత్రణలోనే.. కరోనా
  • సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాలు
  • తగ్గుముఖం పడుతున్న పాజిటివ్‌ కేసులు
  • పలు శాఖల సమన్వయంతో అదుపులో వైరస్‌
  • నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • అవసరమైతే.. బస్తీ దవాఖానల్లో ఆక్సిజన్‌ సేవలు
  • ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని

సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): నగరంలో కొవిడ్‌ నివారణకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతాశోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతామహంతి, నగర అడిషనల్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, నగరంలోని ప్రధాన దవాఖానల సూపరింటెండెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఫీవర్‌ సర్వేతో అదుపులో కరోనా

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా నగరంలో చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వే, అన్ని ప్రభుత్వ దవాఖానలు, బస్తీ దవాఖానలు, ఏరియా దవాఖానల్లో నిర్వహిస్తున్న పరీక్షలు, పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, వివిధ శాఖల అధికార యంత్రాంగం అందిస్తున్న నిర్విరామ సేవల వల్ల కరోనా నియంత్రణలో ఉన్నదని మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ వెల్లడించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో పడకల లభ్యత, వ్యాక్సినేషన్‌, రెమ్‌డెసివిర్‌ మందులు, ఆక్సిజన్‌ అందుబాటు తదితర అంశాలను వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. నగరంలో కొవిడ్‌ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ కంట్రోల్‌ రూంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్‌ రూంలో 040-2111 1111 ప్రజలకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అన్ని విభాగాలు కలిసికట్టుగా శ్రమించి వైరస్‌ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు.

సేవలు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమీక్ష

నగరంలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, కొవిడ్‌ కంట్రోల్‌ రూం ద్వారా అందజేస్తున్న సేవలను జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేశ్‌కుమార్‌ వివరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన దవాఖానల్లో ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందుల లభ్యత, బెడ్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి నగరవాసులకు సమాచారాన్ని అందిస్తున్నామని కలెక్టర్‌ శ్వేతామహంతి వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నామని నగర పోలీస్‌ విభాగం అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న 35 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన దవాఖానల్లో మొత్తం బెడ్‌ల సంఖ్య, దవాఖానల్లో చేరిన పాజిటివ్‌ రోగుల సంఖ్య , ఆక్సిజన్‌ నిల్వలు, రెమ్‌డెసివర్‌ మందుల అందుబాటు తదితర వివరాలను గాంధీ, ఫీవర్‌, కింగ్‌కోఠి, ఉస్మానియా, నిమ్స్‌, సరోజినిదేవి, ఎర్రగడ్డ తదితర దవాఖానల సూపరింటెండెంట్లు వివరించారు.

అవసరమైతే..బస్తీ దవాఖానల్లో ఆక్సిజన్‌

కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు హెల్ప్‌లైన్‌, కంట్రోల్‌ రూంల గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మంత్రి మహమూద్‌ అలీ సూచించారు. నగరంలో ఉన్న బస్తీ దవాఖానల పనితీరు సంతృప్తికరంగా ఉందని, ఈ బస్తీ దవాఖానల్లో అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా ఆక్సిజన్‌ లాంటి సదుపాయాలను కూడా కల్పించాలని అన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శవంతంగా ఉన్నాయని తెలిపారు.

స్వచ్ఛంద సేవలకు పోలీసుల అనుమతి తీసుకోండి: తలసాని

మరో నెలరోజుల్లో రుతు పవనాలు ప్రవేశిస్తున్నందున నగరంలోని నాలాల పూడిక తీత పనులను ముమ్మరంగా చేపట్టాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజి, ఈవీడీఎంల ఆధ్వర్యంలో కరోనా నివారణకు హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారీ పెద్ద ఎత్తున జరుగుతున్నదని చెప్పారు. దీంతో పాటు ఫైర్‌ సర్వీసుల సహకారాన్ని కూడా పొందాలని ఆదేశించినట్టు మంత్రి తలసాని చెప్పారు. లాక్‌డౌన్‌ సడలించిన సమయంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయని, అయితే లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఉచిత, ఇతర సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తమ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.

పారిశుధ్య కార్యక్రమాలు మరింత ముమ్మరం: మేయర్‌

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. నగరంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను ముందస్తుగా సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు క్షేత్రస్థాయి తనిఖీలను తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమన్వయంతో సమర్ధవంతంగా కట్టడి చేద్దాం

ట్రెండింగ్‌

Advertisement