మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 03, 2020 , 23:41:17

లబ్ధిదారులందరికీ రేషన్‌ బియ్యం

లబ్ధిదారులందరికీ రేషన్‌ బియ్యం

రెండు రోజుల్లో అన్ని దుకాణాలు తెరుస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ చేస్తామని  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు.  రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో రేషన్‌ దుకాణాలను తెరుస్తామన్నారు. నగరంలోని 674 రేషన్‌ షాపుల ద్వారా 5.80 లక్షల తెల్లరేషన్‌కార్డు దారులకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు.  లబ్ధిదారులు ఒకేసారి  పెద్ద ఎత్తున రేషన్‌ దుకాణాల వద్దకు వస్తే అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  21.77 లక్షల మంది లబ్ధిదారులకు ఒకొక్కరికీ 12 కిలోల చొప్పున 26,377 మెట్రిక్‌ టన్నుల బియ్యం సిద్ధంగా ఉంచిన్నట్లు వెల్లడించారు.  ఇప్పటివరకు 20 వేల కార్డు దారులకు బియ్యం పంపిణీ చేశామని తెలిపారు.  శుక్రవారం సర్వర్‌ డౌన్‌ కావడంతో కొన్ని కేంద్రాల్లో  బియ్యం పంపిణీ  మధ్యాహ్నం వరకు నిలిచిపోయింది.

వలస కూలీలను ఆదుకుంటాం 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.  శుక్రవారం మంత్రి తూంకుంట మున్సిపాలిటీలో 900 మంది పేదలకు 100 క్వింటాళ్ల బియ్యం,  కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కారింగుల రాజేశ్వర్‌రావు, జెడ్పీటీసీ అనితాలాలయ్య, కమిషనర్‌ గోవర్దన్‌  పాల్గొన్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ముప్పిడి గోపాల్‌, బేగంపేట సీఐ శ్రీనివాస్‌రావు, శ్యాంసన్‌రాజు సహకారంతో సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు.   


logo