శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 08:30:21

మీ భద్రత.. మా బాధ్యత

మీ భద్రత.. మా బాధ్యత

  • పునరావాస కేంద్రాలకు తరలిరండి
  • అన్ని వసతులు కల్పిస్తున్నాం
  • రిస్క్‌ తీసుకోవద్దు.. ప్రాణాలు ముఖ్యం
  • ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం
  • బోట్లు, హెలీకాప్టర్లను ఏర్పాటుచేశాం
  • సహాయక చర్యల పర్యవేక్షణకు 80మంది ప్రత్యేక అధికారులు 
  • మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌

వరద ముంపు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు తరలిరావాలి. ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి బోట్లు, హెలీ కాప్టర్లను సిద్ధంగా ఉంచాం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయి. నీళ్లు వెళ్లిపోయిన తరువాత మళ్లీ వారిని వారి ఇండ్లకు పంపుతాం. అప్పటివరకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్నిరకాల వసతులు సమకూరుస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. - కేటీ.రామారావు, పురపాలక శాఖ మంత్రి 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున సహాయక చర్యల పర్యవేక్షణకు 80మంది ప్రత్యేక అధికారులను నియమించామని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వర్షాల సందర్భంగా పాటించాల్సినవి ప్రీ-డిజాస్టర్‌, డిజాస్టర్‌, రిలీఫ్‌ మెజర్స్‌ అనే మూడు అంశాలు ప్రధానమైనవని వీటి ఆధారంగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆస్తినష్టం జరిగినా పర్వాలేదు.. ప్రాణనష్టం జరుగకుండా చూడండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకే శిథిల భవనాలను ఖాళీ చేయించడంతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశాం. అక్కడ భోజనం, మంచినీరు, బట్టలు, దుప్పట్లు, మందులు పంపిణీ చేస్తున్నాం. కరోనా పరీక్షలు కూడా చేయిస్తున్నాం. ఇప్పటివరకు 18,700మందికి సీఎం రిలీఫ్‌ కిట్‌లను అందించాం. మొత్తం 3,700కిట్లు సిద్ధంగా ఉన్నాయి. అందులో నెలకు సరిపడా సరుకులు ఉన్నాయని మంత్రి తెలిపారు.

ప్రాణాలను పణంగా పెట్టవద్దు

కొందరు మొదటి అంతస్తులో, రెండవ అంతస్తులో ఉంటాం. మాకు ఏమీ కాదు అని కొందరు అంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టవద్దు. వర్షానికి నానిన ఇండ్లు ప్రమాదకరం. వాటిలో ఉండేవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. దీనికి ప్రజలు దయచేసి సహకరించాలని మంత్రి కోరారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. పాతబస్తీలో గుర్రంచెరువు, పల్లెచెరువు, అప్పా చెరు వు తదితర చెరువులు తెగి నదీంకాలనీ, హఫీజ్‌బాబా నగర్‌, జుబైల్‌ కాలనీ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి. దయచేసి అక్కడ ఉండేవారు ఇండ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. 

వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 80కాలనీలు నీట మునిగాయి. 54అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. సహాయక చర్యల్లో భాగంగా నీటిని తొలగిస్తున్నాం. 17కాలనీలు ఇంకా నీటిలో ఉన్నాయి. నీళ్లు ఉండగానే రెండోసారి మళ్లీ వర్షం రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 540 శిథిల భవనాలను గుర్తించాం. అందులో 180భవనాలు ఇదివరకే కూల్చివేయగా, ఇటీవల మరో 59 భవనాలు కూల్చివేశాం. కొన్నింటికి నోటీసులు ఇచ్చాం. ప్రమాదాన్ని నివారించేందుకు బలవంతంగా ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. 920విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పాడవగా, అందులో 160మినహా అన్నింటికీ మరమ్మతు చేయించాం. ఇవి చార్మినార్‌, ఎల్బీనగర్‌ జోన్లలో ఎక్కువగా ఉన్నాయి. బురదను తొలగించేందుకు అదనపు సిబ్బంది. అదనపు యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించాం. పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్‌కు ఇప్పటివరకు రూ.60కోట్లు ఖర్చుచేశాం. రూ.670కోట్లు ఇంకా ఖర్చుచేస్తామని మంత్రి ప్రకటించారు.

ముంపులో 37వేల కుటుంబాలు

వరదల కారణంగా 37వేల కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. వారిలో చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. ప్రస్తుతం 2వేల పైచిలుకు మంది ఇంకా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాతావరణ శాఖ నేడు, రేపు భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీచేసింది. అందుకే ముంపు ప్రాంతాల్లో ఉంటున్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సహాయక సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఖాళీ చేయిస్తున్నారు. జేఎన్‌టీయూ, ఐఐఐటీ హైదరాబాద్‌, ఆస్కీల సహకారం తీసుకుంటున్నాం. ఇటీవల వర్షాలకు నగరంలో 33మంది చనిపోయారు. అందులో 29మందికి ఇప్పటివరకు రూ.5లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాం. నలుగురికి ఇంకా చెల్లించాల్సి ఉంది. మరో ముగ్గురు మిస్సింగ్‌లో ఉన్నారు.

ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్ధం

జీహెచ్‌ఎంసీ వద్ద 18బోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఏపీ నుంచి 15, కర్నాటక నుంచి 15బోట్లను తెప్పిస్తున్నాం. సోమవారం  సాయంత్రానికి అవి నగరానికి చేరుకుంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉండమని కోరాం. అవసరమైతే హెలీకాప్టర్‌ను కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచాం. వరద సహాయక చర్యల పర్యవేక్షణకోసం 80మంది ప్రత్యేక అధికారులను నియమించాం. వేలమంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

చెరువు కట్టలు కావాలని తెంపితే చర్యలు

కొన్నిచోట్ల కావాలనే కొందరు చెరువు కట్టలు తెంపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అప్పా చెరువుకట్టను కావాలనే తెంపినట్లు అక్కడివారు చెప్పారు. దీంతో వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు పెట్టమని చెప్పాను. వరద సహాయం విషయంలో ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానికి వివరించారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సైతం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడారు. వారు తగిన సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం. 

సోషల్‌ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకండి

సోషల్‌ మీడియాలో వచ్చే విషయాలను నమ్మి అపోహలకు గురికాకండి. మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. సమస్య ఉంటే మా దృష్టికి తేవాలి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. మీరు కూడా రిపోర్టింగ్‌ సందర్భంగా జాగ్రత్తగా ఉండండి. నీటిలోకి వెళ్లి రిపోర్టింగ్‌ చేసే సందర్భంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని మంత్రి కేటీఆర్‌ సూచించారు.