శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 18, 2020 , 23:49:41

మురుగు శుద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

మురుగు శుద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

  • సీవరేజీ వ్యవస్థ బలోపేతమవ్వాలి
  • కూకట్‌పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ నిర్మిద్దాం 
  • మూసీ కలుషితం కావొద్దు 
  • వంద ఫ్లాట్స్‌ దాటిన అపార్టుమెంట్లలోఎస్టీపీ తప్పనిసరి 
  • జలమండలి సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 
హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మురుగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధానకార్యాలయంలో నగర సీవరేజీ వ్యవస్థ, ఎస్టీపీలపై ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆర్వింద్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌లతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సీవరేజీ వ్యవస్థ, ఎస్టీపీలు, రానున్న రోజుల్లో నిర్మించే మురుగునీటి శుద్ధి కేంద్రాల సమగ్ర వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేసి మూసీ నదిలోకి వదులుతున్నట్లు అధికారులు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగునీరు మొత్తం శుద్ధిచేయాలనే లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

కూకట్‌పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ 

నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో సీవరేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. నూతన ఎస్టీపీల నిర్మాణానికి స్థలం కోసం అన్వేషించకుండా ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో నూతన ఎస్టీపీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిధులు సేకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేసి, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. నూతన ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే నదిలోకి శుద్ధి చేసిన నీరు వదలడం ద్వారా మూసీనది కలుషితం కాకుండా సంరక్షించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఓఆర్‌ఆర్‌ లోపల సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా ఎఫ్‌ఎస్టీపీల (ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌) నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా భూగర్భజలాలు, చెరువులు, కుంటలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. సిల్ట్‌ ఛాంబర్లు లేని ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు, హాస్టళ్లు, దవాఖాన లాంటి వాణిజ్య భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎన్ని అపార్టుమెంట్లలో ఎస్టీపీలు ఉన్నాయి?

 నగరంతోపాటు ఓఆర్‌ఆర్‌ లోపల 100కంటే ఎక్కువ ప్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లు తప్పనిసరిగా ఎస్టీపీ నిర్మించుకోవాలనే నిబంధన మున్సిపల్‌ చట్టంలో ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ అపార్ట్‌మెంట్లలో ఎస్టీపీలు నిర్మించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వందకు మించి ప్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లు ఎన్ని ఉన్నాయి? అందులో ఎన్ని ఎస్టీపీలు నిర్మించుకున్నాయనే నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఎస్టీపీలు నిర్మించుకోని అపార్ట్‌మెంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, రవి, వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌లతోపాటు ఎస్టీపీ సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.


logo