మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Oct 18, 2020 , 10:17:02

ఓదార్చి..

ఓదార్చి..

  • రాజేంద్రనగర్‌, పీర్జాదిగూడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 
  • సర్వం కోల్పోయామంటూ.. కన్నీరు పెట్టిన బాధితులు 
  • అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి 
  • ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని స్పష్టీకరణ 
  • ముంపు సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ 

‘ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం.. భవిష్యత్‌లో ముంపు ముప్పు తప్పిస్తాం. ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. అన్ని విధాల ఆదుకుంటాం’ అని బాధితులకు మంత్రి కేటీఆర్‌  భరోసా ఇచ్చారు. శనివారం రాజేంద్రనగర్‌, పీర్జాదిగూడ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. సర్వం కోల్పోయి కన్నీరుపెట్టుకున్న వారిని ఓదార్చి..ధైర్యం చెప్పారు. ఇండ్లు కోల్పోయిన వారికి గృహాలు నిర్మించి ఇస్తామని అభయమిచ్చారు. ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ,  ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, హైదరాబాద్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ మేయర్లు బొంతు రామ్మోహన్‌, బుచ్చిరెడ్డి, వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, సీపీ సజ్జనార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఉన్నారు. 

పకడ్బందీ చర్యలు

పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ముంపునకు గురైన సుమా రెసిడెన్సీ, ప్రగతినగర్‌ కాలనీలో  మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. చెంగిచర్ల చింతల చెరువు మీదుగా, పర్వతాపూర్‌ చెరువు నుంచి వచ్చే వరద నీటిని భూగర్భ డ్రైనేజీ ద్వారా నేరుగా మూసీలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి విపత్తు ఎదురైనా తట్టుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంటురోగాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, రేషన్‌ , మందులు ఉచితంగా అందిస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి వసతి కల్పించాలని, కాలనీలో అడ్డుగా ఉన్న ప్రహరీలను  తొలగించి వర్షపు నీటిని వెంటనే తరలించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు

రాజేంద్రనగర్‌, గగన్‌పహాడ్‌, శంషాబాద్‌ తదితర వరద ప్రభావిత  ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గండిపడిన పల్లె, అప్ప చెరువులను పరిశీలించారు. ముంపునకు గురైన ప్రదేశాలను, కొట్టుకుపోయిన జాతీయ రహదారి, చెరువుల కరకట్టలను సందర్శించారు.  వరద ముంపు, చెరువుల కట్టలు తెగడంపై ఆరా తీశారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొట్టుకుపోయిన జాతీయ రహదారి, అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీలను పునరుద్ధరించాలన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. 10 కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఇండ్లు కోల్పోయిన వారికి గృహాలు నిర్మించి ఇస్తామన్నారు.  క్షతగాత్రులకు సరైన వైద్యం అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు.  జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌ గౌడ్‌, పీర్జాదిగూడ నగరపాలక పార్టీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు మద్ది యుగేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, స్వాతి కృష్ణగౌడ్‌, హరిశంకర్‌రెఢ్డి,  అనంతరెడ్డి, అమర్‌సింగ్‌, శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ యాదవ్‌, ఎంపీపీ జయమ్మ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. 

బోరున విలపించిన బాధితులు 

పీర్జాదిగూడ ప్రగతినగర్‌లో బాధితులు బోరున విలపించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు గోడు వెల్లబోసుకున్నారు. చెంగిచర్ల చింతల చెరువులోని వరద నీరు అర్ధరాత్రి ఇండ్ల నిండా చేరిందని, ఉండేందుకు వీలు లేకుండా పోవడంతో రోడ్లపైనే గడుపుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు.  అధైర్యపడొద్దని,  ఆదుకుంటామని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. కాలనీల్లోకి వరద నీరు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పర్వతాపూర్‌ పోచమ్మకుంట చెరువు పరిశీలన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రమాదపుటంచుకు చేరిన పోచమ్మకుంట చెరువును మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి పరిశీలించారు. చెరువు నిండి నీటి ముంపునకు గురైన ప్రాంతాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన మల్లికార్జున్‌నగర్‌ ఫేస్‌-1, ఫేస్‌-2 కాలనీవాసులు వరద నీటి ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు వెనుకాడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి వరద నీరు నేరుగా మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.


logo