ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 21, 2020 , 06:32:46

చెదిరిన గూడుకు చేదోడు...

చెదిరిన గూడుకు చేదోడు...

వరద బాధితులకు సర్కారు సాయం

బాధితుల ఇండ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

వానలో తడుస్తూ.. వరదలోనడుస్తూ ముందుకు

అవసరమైతే సాయం పెంచుతామన్న మంత్రి కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనం దీవెనలు

జల విలయానికి గూడు చెదిరి, గుండె పగిలిన బాధితులకు సర్కారు బాసటగా నిలిచింది. మాటల్లో గాక చేతల్లో భరోసానిచ్చింది. ప్రభుత్వం పంపిన తక్షణ ఆర్థిక సాయం వేల మందిలో ధైర్యం నింపింది. భవిష్యత్‌పైనా ధీమాను పెంచింది. వరద విపత్తుతో దెబ్బతిన్న ఇండ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా మంగళవారం నగదు పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు కేటీఆర్‌, తలసాని, మల్లారెడ్డి, సబిత, మహమూద్‌ అలీతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నేరుగా బాధితుల ఇంటి వద్దకే వెళ్లి డబ్బు అందించారు. మొదటి రోజు వర్షం కారణంగా 744మందికి ఆర్థిక సాయం చేరింది.

ఎల్బీనగర్‌/మన్సూరాబాద్‌, అక్టోబర్‌ 20 : వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఎల్బీనగర్‌ నియోజకర్గంలో పర్యటించారు. ముంపునకు గురైన నాగోలు అయ్యప్ప కాలనీ, లింగోజిగూడ డివిజన్‌లోని కామేశ్వర్‌రావు కాలనీ, సాయినగర్‌, జనప్రియ కాలనీలోని ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. దారులన్నీ బురదమయంగా ఉన్నా.. అలాగే ముందుకు సాగి నేనున్నానంటూ బాధితులకు బాసటగా నిలిచారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, నాగోలు కార్పొరేటర్‌ చెరుకు సంగీతాప్రశాంత్‌గౌడ్‌తో కలిసి ముంపు ప్రాంతాల్లో కలియదిరిగారు. సాయినగర్‌ కాలనీ పూర్తిగా మురుగు ప్రవాహం, బురదతో నిండి ఉన్నా వెనక్కి మళ్లకుండా వెళ్లి బాధితులను కలుసుకున్నారు. జనప్రియ కాలనీలో ప్రతి అపార్ట్‌మెంట్‌ వాసులను పలుకరిస్తూ, వారి బాధలు విన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. 

శాశ్వత పరిష్కారం..

వరద బాధితులకు ప్రస్తుతం అందిస్తున్నది తాత్కాలిక సహాయమేనని, అవసరమైతే మరింత చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ భరోసానిచ్చారు. ముంపునకు గురైన ప్రతి ఇంటినీ అధికారులు పరీక్షించి నివేదిక తయారు చేస్తారని, ఆ మేరకు దసరా పండుగ తర్వాత శాశ్వత పరిష్కరాలను చూపుతామని తెలిపారు. బండ్లగూడ చెరువు పరిసరాల్లోని కాలనీలు ముంపునకు గురవకుండా వరద నీరు నేరుగా చెరువులోకి, అక్కడి నుంచి మూసీలోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించి నివేదిక ఇవ్వాలని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి సూచించారు. ఆ పనులకు రూ.10 కోట్లయినా, 15 కోట్లయినా మంజూరు చేస్తానని తెలిపారు. ముంపు ప్రాంతాల వారు జీహెచ్‌ఎంసీ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. ఏ సమస్యలున్నా కార్పొరేటర్‌, డిప్యూటీ కమిషనర్‌ దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించారు. మంత్రి వెంట మేయర్‌ రామ్మోహన్‌, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, ఉప కమిషనర్లు మారుతీ దివాకర్‌, విజయకృష్ణ, హరి కృష్ణయ్య ఉన్నారు. 

నదీం కాలనీలో ఇంటింటికీ...

వరద విధ్వంసానికి గురైన కార్వాన్‌ నియోజకవర్గం టోలీచౌకి నదీం కాలనీలో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పర్యటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే కౌసర్‌మోయినుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జీలు జీవన్‌సింగ్‌, సీహెచ్‌.ఆనంద్‌కుమార్‌గౌడ్‌, నానల్‌నగర్‌, మెహిదీపట్నం కార్పొరేటర్లు ఎండీ.నసీరుద్దీన్‌, బి.ప్రకాశ్‌తో కలిసి  ఇంటింటికీ వెళ్లారు. బాధితులకు 10వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. నదీం కాలనీలో చురుగ్గా సహాయక చర్యలు అందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ సహాయక చర్యలు చేపట్టే విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు వేగంగా స్పందించారన్నారు. నదీం కాలనీవాసులకు ముంపు బారి నుంచి రక్షించడంలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఎంఐఎం నాయకులు బాగా పని చేశారని పేర్కొన్నారు.