శనివారం 27 ఫిబ్రవరి 2021
Hyderabad - Oct 22, 2020 , 06:46:17

బస్తీలకు వెళ్లి బాధితుల్లో భరోసా నింపారు...

బస్తీలకు వెళ్లి బాధితుల్లో భరోసా నింపారు...

వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్కారు ఆర్థిక సాయం పంపిణీ రెండో రోజూ కొనసాగింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం పలు బస్తీలకు వెళ్లి బాధితుల్లో భరోసా నింపారు. ఉప్పల్‌, బోడుప్పల్‌ ప్రజలకు బాసటగా నిలిచారు. భారీ వానలకు వణికిన లష్కర్‌ కన్నీళ్లు తుడిచాడు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ అంబర్‌పేట రత్నానగర్‌కు అభయమిచ్చారు. మోకాళ్లలోతు నీటిలో నడుచుకుంటూ బాధితుల ఇండ్లకు చేరుకున్నారు. సమస్యలు తెలుసుకుంటూ.. నగదు సాయం అందిస్తూ ముందుకుసాగారు. పలుచోట్ల మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పాల్గొన్నారు.

‘వరద వల్ల ఇల్లు నీటిలో మునిగిపోయింది. నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకరణాలూ కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వెళ్లి పునరావాస కేంద్రంలో ఉంటున్నాం. చేతిలో ఒక్క పైసా లేక అల్లాడుతున్న సమయంలో రూ. 10 వేలు ఇచ్చారు. కష్టకాలంలో కొన్ని కోట్ల విలువ చేసే సహాయమిది. ప్రభుత్వం మేలు మరువలేం’.. మన్సూరాబాద్‌లోని అయ్యప్పకాలనీకి చెందిన సంధ్యారాణి ఆనందమిది.  ‘చుట్టాలు కూడా ఆదుకోలే.. కానీ సర్కారు పైసలు ఇచ్చి.. అన్నం పెట్టి కడుపునింపుతున్నది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ’ అని బోడుప్పల్‌కు చెందిన బుచ్చమ్మ ఆనందభాష్పాలు రాల్చారు. ఆపద వేళ.. ప్రభుత్వం అందించిన చేయూతతో ముంపు బాధితులు  భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వాదించారు. సీఎం కేసీఆర్‌ సార్‌ సల్లంగా ఉండాలని దీవెనలు 

అందించారు. 

అంబర్‌పేట, అక్టోబర్‌ 21: నల్లకుంట డివిజన్‌లో వరద ముంపునకు గురైన రత్నానగర్‌ బస్తీవాసుల్లో మంత్రి కేటీఆర్‌ గట్టి భరోసా నింపారు. ప్రతి ఇంటికీ వారి బాధలు విన్నారు. ఎక్కువమంది బస్తీకి అనుకుని ప్రవహిస్తున్న నాలాకు రెండువైపులా రిటైనింగ్‌ వాల్‌ కట్టించాలని కోరగా, ఎన్ని నిధులైనా కేటాయించి నిర్మిస్తామని హామీనిచ్చారు. మంత్రి మాటలతో బస్తీవాసులు సంతోషం వ్యక్తంచేశారు. ఇంటింటికీ వచ్చి తమ గోడు వినడం, ప్రభుత్వ సాయంగా 10వేల రూపాయలు ఇవ్వడం ఇంతవరకూ చూడలేదని కొనియాడారు.

పర్యటన సాగిందిలా...

బుధవారం మధ్యాహ్నం 1.40గంటలకు రత్నానగర్‌ బస్తీకి మంత్రి కేటీఆర్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవీరమేశ్‌, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి ముంపుకు గురైన ఇండ్ల దగ్గరకు వెళ్లారు. ముంపు సమస్యకు పరిష్కారంగా ఇండ్లకు ఇబ్బంది కలగకుండా నాలాకు రిటైనింగ్‌ వాల్‌ కట్టించాలని బస్తీ అధ్యక్షుడు ఈశ్వర్‌, కార్యదర్శి కిశోర్‌, లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులు కోరారు. మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “బస్తీవాసులంతా కూర్చొని రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ఎలా జరగాలో చర్చించి నిర్ణయం తీసుకోండి. నిధులు నేను ఇస్తా. సమన్వయంతో మీరే కట్టుకోండి. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో ఎవరివైనా ఇండ్లు పోతే వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టిస్తా”మన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ బస్తీలోని రజియాబేగం ఇంటి దగ్గరకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. “సార్‌.. ఇంటికొచ్చి మా బాధలు విని, డబ్బులిచ్చే ప్రభుత్వాన్ని నేనిప్పటివరకు చూడలేదు”అని ఆమె సంతోషంగా చెప్పారు. ఆమెకు ఆర్థిక సాయం చేసి.. ముందుకెళ్తూ ఓ వృద్దురాలు కనిపిస్తే ఆగి పలుకరించారు. ‘అమ్మా, నీ పేరేంటి?” అని అడగ్గా, నర్సవ్వ అని చెప్పింది. నెలనెలా పింఛన్‌ వస్తున్నదా అంటే, “మీ దయ. వస్తున్నదని నాయనా” బదులిచ్చింది. పక్కనే వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరిశీలించారు. ఈ నెల 15 నుంచి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నామని, రోజుకు మూడు బస్తీల్లో ఏర్పాటుచేస్తున్నామని డిప్యూటీ డీఎంఓహెచ్‌వో డాక్టర్‌ పద్మజ తెలిపారు. అక్కడే మందులు తీసుకుంటున్న ఓ వృద్ధురాలిని “అవ్వా, ఆరోగ్యం ఎట్లుంది? ఇక్కడే మందులు తీసుకొని వేసుకో” అంటూ కేటీఆర్‌ పలుకరించారు. గరిఫాబేగం అనే మహిళ ఇంటిని రెండువైపులా వరద చుట్టుముట్టడంతో అక్కడి వెళ్లి ఆమెను పరామర్శించారు. అధికారులకు చెప్పి రూ.10వేలు ఆర్థిక సాయం చేయించారు. దెబ్బతిన్న ఇంటికి మిగతా 40వేలు ఇవ్వాలని సూచించారు.

పెద్ద దిక్కులేని కుటుంబానికి ఆసరా..

అదే బస్తీలో ఉండే సౌమ్య డిగ్రీ చదువుతున్నది. తండ్రి లేడు. తల్లితో కలిసి ఉంటున్న ఇండ్లు ముంపునకు గురైంది. వారికి ఆధారమేదీ లేకపోవడంతో సౌమ్యతోపాటు బస్తీవాసులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ సౌమ్య డీటెయిల్స్‌ తీసుకోవాలని అధికారులకు సూచించారు. తక్ష ణ సాయం కింద రూ.10వేలు అం దించారు. ఆ కు టుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు.

ఉప్పల్‌: ఇంటింటికీ వెళ్లి.. ఆప్యాయంగా పలుకరిస్తూ.. బాధపడొద్దంటూ..ముంపు బాధితులకు ధైర్యం చెప్పారు మంత్రి కేటీఆర్‌. ‘మీ కోసమే వచ్చాను.... సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా’నంటూ.. అభయమిచ్చారు. రామంతాపూర్‌ నేతాజీనగర్‌లోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించి, నష్టపోయిన వారిని ఓదార్చి.. నగదును అందజేశారు. ‘జాగ్రత్తగా ఉండండి... ఆరోగ్యంగా ఉండండి.. కాచి చల్లార్చి..నీళ్లు తాగండి. బ్లీచింగ్‌ పౌడర్‌ ఇస్తారు తీసుకోండి.. దోమల మందు కూడా స్ప్రే చేయిస్తాం.. ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం... మీ ఎమ్మెల్యేకు  చెప్పాం.. వంద ఏండ్లలో ఇంత వర్షం ఎప్పుడైనా పండిందా’ అంటూ బాధితులను అడిగారు. ఎవరూ అధైర్యపడొద్దని, భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తామన్నారు. 

ఇంటింటికీ వెళ్లిన మంత్రి కేటీఆర్‌..  

బాధితులను ఆప్యాయంగా పలకరించారు.. ఆ సంభాషణ సాగింది ఇలా.. 

మంత్రి కేటీఆర్‌ : మీ పేరు ?

ఇంటి యాజమాని : నర్సింహ సారు...

కేటీఆర్‌ :  ఏం పని చేస్తారు...

నర్సింహ: పెయింటింగ్‌ పని చేస్తాం సార్‌ 

కేటీఆర్‌ : ఎంతమంది ఉంటారు ఇంట్లో..

ఇంటి యాజమాని : రెండు ఫ్యామిలీలు ఉంటాయి సార్‌..

కేటీఆర్‌ :  ఇంకో ఫ్యామిలీ ఎవరూ..  మీరా ఒకే .. వందేండ్లలో కొట్టని వర్షాలు ఇవి.. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. చెరువు పక్కనే ఉన్నారు.. నీళ్లు వచ్చాయి.. కొంత సహాయం చేద్దామని వచ్చాం. కుటుంబానికి పదివేల చొప్పున సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భవిష్యత్‌లో వర్షం పడినా.. రామంతాపూర్‌ చిన్న చెరువు నుంచి మూసీ వరకు నీళ్లు పోయే విధంగా చేస్తాం.  

బాధితులు : మమ్మల్ని ఆదుకోండి సారూ..

కేటీఆర్‌ :అందుకే వచ్చాం... ఇండ్లు చెరువు పక్కనే ఉన్నాయి. ఇంటికి పదివేల చొప్పున ఇస్తున్నాం. శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టి..ఇబ్బందులు తొలగిస్తాం..

కేటీఆర్‌ : అవ్వ ఏం పేరు?  వృద్ధురాలు : వెంకటమ్మ

కేటీఆర్‌ : పింఛన్‌ వస్తుందా...  

వెంకటమ్మ : వస్తుంది.. 

కేటీఆర్‌ : ఎంత వస్తుంది...   

వెంకటమ్మ : 2 వేలు

కేటీఆర్‌ : 2 వేలు వస్తుందా... సంతోషమేనా...   

వెంకటమ్మ : సంతోషమే సారూ...

కేటీఆర్‌ : ఇల్లు కూలిందా.. ఎక్కడ కూలింది...

వెంకటమ్మ : అవును సార్‌..

కేటీఆర్‌ : కూలిపోయింది ఎక్కడ...

వెంకటమ్మ : పోచన్నపేటలో...

కేటీఆర్‌ : ఎక్కడ, జనగాం పోచన్నపేటలోనా... ఫ్యామిలీ ఎవరు ఇక్కడ అంటూ.. అడిగారు.. కుటుంబసభ్యులకు పదివేలు అందజేశారు. 

గట్టిగా తిను..   ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి పిల్లలతో సరదాగా మాట్లాడారు.  ‘బాబు.. ఏ క్లాస్‌..’ అంటూ అడిగారు. సెవెన్త్‌ క్లాస్‌ అని.. 

సమాధానం ఇవ్వగా, నవ్వుతూ.. 

‘చిన్నగా ఉన్నావు.. సెవెన్త్‌ క్లాస్‌ అంటావు.. తింటలేవా.. గట్టిగా తిను’ అంటూ భుజం తట్టి ముందుకు సాగారు. 

VIDEOS

logo