శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 06:58:01

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

  • నాలా విస్తరణకు మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదన
  • ప్రభుత్వానికి అంతా సహకరించాలి
  • ఓకే చెప్పిన ఎస్పీ నగర్‌ కాలనీవాసులు
  • ఎస్పీనగర్‌లో రెండు గంటల పాటు పర్యటన

మల్కాజిగిరి, అక్టోబర్‌ 16 : మల్కాజిగిరి నియోజకవర్గంలో నీట మునిగిన ఎస్పీనగర్‌ కాలనీని మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. అక్కడ మంత్రికి, స్థానికుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వరద సమస్యకు శాశ్వత పరిష్కారమూ దొరికింది. బండ చెరువు నుంచి ఎన్‌ఎండీసీ కాలనీ, ఎస్పీనగర్‌ మీదుగా లాలాపేటకు నాలా వెళ్తుంది. 12 మీటర్లు ఉండాల్సిన నాలా స్థానికులు ఇండ్లు కట్టుకోవడంతో మూడు మీటర్లకు తగ్గిపోయింది. దాంతో ఏటా వానాకాలం ఎస్పీనగర్‌ను వరద ముంచెత్తుతున్నది. తాజాగా కురిసిన భారీ వానకు కాలనీ మొత్తం జలమయమైంది. మూడ్రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెలే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి అక్కడికి వెళ్లారు. రెండు గంటలపాటు కాలనీలో తిరిగి భరోసా నింపారు. ప్రతి వానాకాలం వరద తమ ఇండ్లను ముంచెత్తుతున్నది స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. శాశ్వత పరిష్కారం దిశగా ఓ ప్రతిపాదనను వారి ముందుంచారు. “నాలా పెద్దగ చేస్తే తప్ప ఇక్కడ ముంపు సమస్య తీరదు. నాలా మీద ఇండ్లు కట్టుకున్న మీ అందరికీ ప్రభుత్వమే మరొకచోట ఇండ్లు కట్టిచ్చి ఇస్తుంది. ఏ మాత్రమూ నష్టం జరగకుండా చూసుకుంటాం. పనులు జరిగేప్పుడు ఎవ రూ అడ్డం పడకుండా కూడా మీరే చూసుకోవాలి” అని మంత్రి చెప్పడంతో కాలనీవాసులు సానుకూలంగా స్పందించి ఓకే చెప్పారు.

నెలకు సరిపడా రేషన్‌ నేరుగా ఇంటికే..

వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న బాధితులందరికీ నెల రోజులకు సరిపడా రేషన్‌ ఇవ్వాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. “అక్కడ ఇస్తం, ఇక్కడ ఇస్తం” అంటూ అధికారులు తిప్పుతరని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా.. నేరుగా మీ ఇంటికే తీసుకొస్తారు, రంది పడొద్దని చెప్పారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మంత్రి వెంట కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్‌, ఆకుల నర్సింగ్‌రావు, శ్రీదేవి, శిరీషాజితేందర్‌రెడ్డి, రాజ్‌జితేంద్రనాథ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఉప కమిషనర్‌ దశరథ్‌, ఎస్‌ఈ అనిల్‌రాజ్‌, స్థానిక నాయకులు పరశురాంరెడ్డి, ప్రేమ్‌కుమార్‌, సతీశ్‌ కుమార్‌, రాముయాదవ్‌, మోహన్‌రెడ్డి, పిట్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

అవ్వా పింఛన్‌ వస్తున్నదా!

ఎస్పీనగర్‌లో తిరిగేప్పుడు ఓ ఇంటి ముందున్న వృద్ధురాలిని మంత్రి కేటీఆర్‌ ఆప్యాయంగా పలుకరించారు. “అవ్వా పింఛన్‌ వస్తున్నదా” అని అడగ్గా.. “వస్తున్నది బిడ్డా. మీరు సల్లంగుండాలె” అని ఆమె దీవెనలందించారు.

ప్యాట్నీ నాలా ప్రక్షాళన

కంటోన్మెంట్‌ : భవిష్యత్‌లో వరద ముంపు సమస్య లేకుండా ప్యాట్నీ నాలాను తొందర్లోనే ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రసూల్‌పురాలోని నాలా ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులు సదాకేశవరెడ్డి, అనితాప్రభాకర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు భోజన, వైద్య సదుపాయాలు సరిగ్గా అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. నాలా పరిధిలో వరద తగ్గిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్‌, అధికారులు దేవేందర్‌, కృష్ణసాగర్‌, స్థానిక నేతలు ఆశోక్‌, జబ్బార్‌, తౌఫిక్‌, నాగరాజు పాల్గొన్నారు.