శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 06:49:47

ఇంటింటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరి బాధలూ విన్న మంత్రి కేటీఆర్‌

ఇంటింటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరి బాధలూ విన్న మంత్రి కేటీఆర్‌

  • మూడో రోజూ ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన
  • శాశ్వత పరిష్కారాల దిశగా స్పష్టమైన హామీలు
  • బస్తీలు, కాలనీల్లో సహాయక చర్యల పర్యవేక్షణ
  • కాచి వడబోసిన నీటినే తాగాలని సూచన

వరద విపత్తుతో ధైర్యం చెడ్డ బాధితుల్లో మంత్రి కేటీఆర్‌ భరోసా నింపుతున్నారు.ముంపు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలు ఆలకిస్తూ, అభయమిస్తున్నారు. మూడో రోజు శుక్రవారం ఖైరతాబాద్‌,సనత్‌నగర్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారి మంచీచెడులు తెలుసుకున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో నగర ప్రజలంతా కాచివడబోసిన నీటినే తాగాలని కోరారు.

ముంపు సమస్య తప్పిస్తం

“నాకు తెలుసు. మీరంతా గరీబోళ్లే. మీకు నష్టం జరిగే ఏ పనీ ప్రభుత్వం చెయ్యదు. మీకే కాదు.. కింది ప్రాంతాలకూ వరద ముంపు తప్పాలంటే నాలాను విస్తరించడమే మార్గం. ఆ పని చెయ్యాలంటే ఈ నాలా మీదున్న 350 ఇండ్లను తీసెయ్యాలి. ఇండ్లు కోల్పోయే వారందరికీ వేరొక చోట ఇండ్లు కట్టిస్తం. కొత్త ఇండ్లు ఇచ్చినంకనే ఇక్కడి నుంచి  జరుపుతం. మీరు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తే వరద సమస్య అన్నదే ఉండదు. ఇంక మీరే చెప్పాలి” అంటూ మంత్రి కేటీఆర్‌ శాశ్వత పరిష్కారాన్ని ముందుంచారు. స్థానికుల సందేహాలనూ నివృత్తి చేయడంతో అంతా సంతృప్తి చెంది, ఓకే చెప్పారు.

అమ్మా.. అంతా ఓకేనా!

“అమ్మా... షెల్టర్‌ బాగుందా. టైమ్‌కు భోజనం పెడుతున్నరా. మందులవీ సరిగ్గా ఇస్తున్నరా. మీ కష్టాలు తొందర్లనే తీరుతయి. దేనికీ బాధపడొద్దు. మీకు అండగా ప్రభుత్వం ఉంది” అంటూ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలికి మంత్రి కేటీ రామారావు అభయమిచ్చారు.

ప్రైవేట్‌ స్థలాల వారితో మాట్లాడుతా..

“పోలీసువారు... కాస్త పక్కకు జరగండి. వారి గోడు వినేందుకే ఇక్కడికి వచ్చిన. దగ్గరికి రానివ్వండి” అంటూ మంత్రి కేటీఆర్‌ వరద బాధితులను దగ్గరికి తీసుకుని సమస్యలు విన్నారు. “అయ్యా, మా బస్తీ మునిగిపోయింది” అని ఒకరు, “నాలా నీళ్లు మా ఇంటిని ముంచెత్తినయి సారూ” అంటూ మరొకరు.. తమ బాధలు చెప్పుకొని గుండెల్లోని బరువు దింపుకొన్నారు. అక్కడ నాలా విస్తరణకు ఏండ్ల తరబడి సమస్యగా ఉన్న ప్రైవేట్‌ స్థలాల వారితో మాట్లాడి పరిష్కారం చూపుతానని మంత్రి హామీనిచ్చారు. 

బేగంపేట అక్టోబర్‌ 16: బేగంపేట డివిజన్‌లో భారీ వర్షానికి నీట మునిగిన ప్రకాశ్‌నగర్‌, మయూరి మార్గ్‌, అల్లంతోటబావి ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కలెక్టర్‌ శ్వేతామహంతి, స్థానిక కార్పొరేటర్‌ ఉప్పల తరుణితో కలిసి బస్తీలు, కాలనీలను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి, బాధితుల సమస్యలు వింటూనే, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మయూరి మార్గ్‌, అల్లంతోటబావి కాలనీల్లో ప్రైవేట్‌ స్థలాల వివాదాలు ఏండ్ల తరబడి కోర్టులో ఉండటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని, దాంతో నాలాల వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ స్థలాల వారితో మాట్లాడి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్‌ స్థానికులకు హామీనిచ్చారు. వర్షం నీరు నిలిచి రెండ్రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ముస్లిం బస్తీవాసులు చెప్పడంతో.. రూ.50లక్షలతో వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణారావుకు సూచించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ శాఖల అధికారులతోపాటు టీఆర్‌ఎస్‌ బేగంపేట డివిజన్‌ నాయకులు నరేందర్‌రావు, కూన వెంకటేశంగౌడ్‌, శ్రీహరి, డివిజన్‌ అధ్యక్షుడు తాళ్ల రాజయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, అఖిల్‌ హమ్మద్‌, నేరేళ్ల శేఖర్‌, రాజు, నాని, నాగరాజు, కాంచనమాల పాల్గొన్నారు.

ఆహార పొట్లాల పంపిణీ

ముంపు బాధితుల కోసం బ్రాహ్మణవాడీలో ఏర్పాటుచేసిన దుప్పట్లు, నిత్యావసరాలు, ఫుడ్‌ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అక్కడా బాధితుల సమస్యలు వింటూ ఓదార్చారు. “నేనున్నాను.. ధైర్యంగా ఉండండి” అంటూ ఆహార పొట్లాలు అందించారు. ఎంత ఖర్చయినా సరే, ముంపు ప్రాంతాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ వైద్య విభాగం అధ్వర్యంలో సిబ్బంది కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు అందించారు.