మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Nov 30, 2020 , 06:26:19

పిచ్చోళ్లకు ఓటేస్తే..అమ్మేస్తరు

పిచ్చోళ్లకు ఓటేస్తే..అమ్మేస్తరు

  • అయితే జుమ్లా..లేకపోతే హమ్లా బీజేపీ నాయకులకు తెల్సిందిందే..
  • ప్రశాంతతను దెబ్బతీయడమే వాళ్ల లక్ష్యం
  • కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆశీర్వదించండి
  • ప్రచారం ముగింపులో మంత్రి కేటీఆర్‌

“హైదరాబాద్‌ ప్రజలారా... తస్మాత్‌ జాగ్రత్త! మోదీ ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ  వస్తున్నది. వాళ్ల చేతిలో పెడితే జీహెచ్‌ఎంసీని కూడా అమ్మేస్తరు” అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆదివారం గోషామహల్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌   నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఆరేండ్లుగా అందరి సంక్షేమం, బాగోగులను చూసుకుంటూ నగరాన్ని ప్రగతి పథాన తీసుకెళ్తున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. 

“దయచేసి అందరూ ఓటు వేయండి. మత పిచ్చోళ్ల నడుమ నగరం నలిగి  పోకుండా ఉండాలంటే బయటకి రండి. ఓటు అనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పండి. హైదరాబాద్‌ ప్రశాంతతను కాపాడండి.”

తెలంగాణ బీజేపీలో కొన్ని కొత్త కార్టూన్లు వచ్చినయ్‌. వాళ్ల ఉద్దేశం ఒక్కటే. ఏదన్నచేసి హిందూ-ముస్లిం ఫీలింగ్‌ తేవాలె.. హైదరాబాద్‌  ప్రశాంతతను నాశనం చెయ్యాలె. విషయం ఉండదు. ఉన్నదల్లా విషమొక్కటే. నాలుగు ఓట్ల కోసం నగరంలో చిచ్చు పెట్టాలనుకుం టున్నరు. అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా. వాళ్లకి తెల్సింది ఈ రెండే. 

మేమేమో డ్రైనేజీలు కడ్తం.. రోడ్లు వేస్తం. చెరువులు బాగు చేస్తం. సీసీ కెమెరాలు పెడ్తం. పిల్లలకు కొలువులు వచ్చేట్లు చేస్తం. నిర్మాణాత్మకంగా పని చేస్తమని చెప్తున్నం. వాళ్లేమో అది కూలగొడ్తం, ఇది కూలగొడ్తమని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కూలగొట్టుడేనా? కట్టుడేం లేదా? హైదరాబాద్‌ను పిచ్చోళ్ల చేతిలో రాయిని చేయొద్దు. ఆలోచించండి! పురోగతి కావాల్నా.. అధోగతి కావాల్నా?  - కేటీఆర్‌

సూటిగా..  ఏకధాటిగా..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి కేటీఆర్‌ అన్నీ తానై ప్రచారం చేశారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 15 నియోజకవర్గాల్లోని ఆయన పర్యటించారు. వంద డివిజన్లలో పర్యటించిన కేటీఆర్‌.. శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, గోషామహల్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్‌ పర్యటించారు. ఆరేండ్ల అభివృద్ధిని వివరిస్తూనే.. విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భవిష్యత్‌ హైదరాబాద్‌పై భరోసాను నింపేలా ఆయన ప్రచారం సాగింది. మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలకు అన్నిచోట్లా భారీగా జనం తరలివచ్చారు. అవి ప్రచార సభలా?.. విజయోత్సవ ర్యాలీలా.. అన్నట్లుగా రోడ్‌షోలు సూపర్‌హిట్‌ అయ్యాయి. రోడ్‌షోలకు హాజరైనవారిలో యువకులు, మహిళలే ఎక్కువగా ఉండడం విశేషం. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా జనం వెల్లువలా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. బీజేపీ తరపున యూపీ సీఎం యోగి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీసూర్య, కేంద్ర మంత్రులు అమిత్‌షా, స్మృతిఇరానీ లాంటి నేతలు రోడ్‌ షోలు చేపడితే.. వారికి దీటుగా టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి కేటీఆర్‌ ఒక్కరే అన్నీతానై ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. 

గులాబీ శ్రేణుల్లో జోష్‌ 

రోడ్‌షోలకు వచ్చిన జనస్పందన చూసి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. పోలింగ్‌ ముగిసే వరకు మరింత కష్టపడి పనిచేయాలనే పట్టుదల వారిలో కనబడుతున్నది. కాలనీలు, బస్తీల్లో కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీల వంచనను వివరించాలన్న ఉత్సాహం వారిలో నెలకొన్నది. ఇదే స్ఫూర్తితో ఎన్నికలు అయిపోయేంతవరకు అవిశ్రాంతంగా పనిచేస్తామని కార్యకర్తలు, నాయకులు ప్రకటిస్తుండడం విశేషం.

అన్నివర్గాలను సమానంగా చూస్తూ అభివృద్ధిలో నడిపిస్తున్న గులాబీ పార్టీకి అండగా నిలవాలని, తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు కోరారు. ఓటు అనే పవర్‌ఫుల్‌ ఆయుధంతో.. పేదల కోసం, మన నగరం కోసం పనిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ కావాలంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని మంత్రి నగరవాసులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన ఆదివారం.. గోషామహల్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో కేటీఆర్‌ రోడ్‌షో చేపట్టారు. అభ్యర్థులు ఎం.మమతాగుప్తా (గన్‌ఫౌండ్రీ), ఆనంద్‌ గౌడ్‌ (జాంబాగ్‌), పరమేశ్వరీసింగ్‌ (మంగళ్‌హాట్‌), ముఖేశ్‌సింగ్‌ (గోషామహల్‌), పూజావ్యాస్‌ బిలాల్‌ (బేగంబజార్‌), కొలను లక్ష్మీబాల్‌రెడ్డి (సనత్‌నగర్‌), ఎన్‌ శేషుకుమారి, (ఆమీర్‌పేట), కే హేమలత (బన్సీలాల్‌పేట), కే అరుణ (రాంగోపాల్‌పేట), మహేశ్వరి శ్రీహరి (బేగంపేట), ఆకుల రూప (మోండా మార్కెట్‌), మోతె శ్రీలత (తార్నాక), రసూరి సునీత (మెట్టుగూడ), సామల హేమ (సీతాఫల్‌మండి),కంది శైలజ (బౌద్ధనగర్‌)లను భారీ మెజార్టీతో గెలిపించాలని రోడ్‌షోల్లో కేటీఆర్‌ కోరారు.

 ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా ఉన్నదని అన్నారు. ’ఆంధ్రా-తెలంగాణ పంచాయతీల్లేవు.. మత ఘర్షణలు, కర్ఫ్యూల్లేవు. ఆరేండ్లుగా నగరం ప్రశాంతంగా ఉన్నది. ఇది అందరి హైదరాబాద్‌. కానీ కొందరు విద్వేష విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి’ అని మంత్రి కోరారు. చిల్లరమల్లర రాజకీయం చేసే దుర్మార్గపు రాజకీయ పార్టీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. వరద బాధితుల్లో ఇప్పటికే ఆరు లక్షల 64 వేల కుటుంబాలకు సాయం అందించామని, మిగతావారిని డిసెంబరు 7 నుంచి ఆదుకుంటామని కేటీఆర్‌ చెప్పారు. ‘మేం డ్రైనేజీలు, ఫ్లై ఓవర్లు కడుతున్నం.. నగరాభివృద్ధికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నం.. కొత్తగా వచ్చిన కొందరు అది కూలగొడతం.. ఇది కూలగొడతమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నరు.. కూలగొట్టుడేనా..! కట్టుడేమీ లేదా..? హైదరాబాద్‌ను అలాంటి పిచ్చోళ్ల చేతిల పెట్టొద్దు. ఆలోచించండి..’ అని కేటీఆర్‌ ప్రజల్ని కోరారు. ప్రజాస్వామ్యంలో  ఓటు అత్యంత బలమైన ఆయుధమని, హైదరాబాద్‌ భవిష్యత్తును  దృష్టిలో పెట్టుకుని దానిని వాడాలని ఆయన సూచించారు.VIDEOS

logo