గురువారం 21 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 07:29:44

వరదలొచ్చినప్పుడు..బీజేపోళ్లు ఏడున్నరు?

వరదలొచ్చినప్పుడు..బీజేపోళ్లు ఏడున్నరు?

  • శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి ఆగమే
  • ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలె 
  • నగర ప్రజలు ఆలోచించి ఓటేయాలి  
  • రోడ్‌షోల్లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌

 ‘పొలిటికల్‌ టూరిస్టులతో హైదరాబాద్‌ నగరానికి ఒరిగేది ఏమిలేదు.. ఎన్నికలు అనగానే పరిగెత్తుకుని వస్తున్న ఢిల్లీ బీజేపీ నాయకులు, మొన్న వరదలొచ్చినప్పుడు ఏడున్నరు?’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మొన్నటి వరదల్లో నగర ప్రజలు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు  చూసే సాహసం కూడా చేయలేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన రూ.1350 కోట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. తొలుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అల్వాల్‌-చింతల విజయశాంతి, మచ్చబొల్లారం-ఈఎస్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌, వెంకటాపురం-సబితా కిశోర్‌, నేరేడ్‌మెట్‌-మీనా ఉపేందర్‌ రెడ్డి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌-వై ప్రేమ్‌ కుమార్‌, వినాయక్‌నగర్‌- బి పుష్పలతారెడ్డి, మౌలాలీ-ఫాతిమా, గౌతంనగర్‌-మేకల సునీతా రాముయాదవ్‌ తరపున మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆనంతరం రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి చౌరస్తాలో రాజేంద్రనగర్‌-కె.శ్రీలత, అత్తాపూర్‌- మాధవీఅమరేందర్‌, మైలార్‌దేవ్‌పల్లి-టీ ప్రేమ్‌దాస్‌గౌడ్‌ల తరపున ప్రచారం చేపట్టారు.

అక్కడి నుంచి శేరిలింగంపల్లిలోని కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ చౌరస్తా వద్ద కొండాపూర్‌-షేక్‌ హమీద్‌పటేల్‌,  మాదాపూర్‌-జగదీశ్వర్‌గౌడ్‌, హఫీజ్‌పేట-వి.పూజిత జగదీశ్వర్‌, శేరిలింగంపల్లి-రాగం నాగేందర్‌యాదవ్‌, గచ్చిబౌలి- కె.సాయిబాబ, హైదర్‌నగర్‌-నార్నే శ్రీనివాసరావు, చందానగర్‌-మంజుల రఘునాథ్‌రెడ్డి,  మియాపూర్‌-ఉప్పలపాటి శ్రీకాంత్‌, అల్వీన్‌ కాలనీ-డీ వెంకటేశ్‌గౌడ్‌, వివేకానంద నగర్‌ కాలనీ-మాధవరం రోజా రంగారావును గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. మంత్రి రోడ్‌షో విజయాత్రను తలపించింది. ప్రతి చోట జనం వెల్లువలా తరలివచ్చారు. నేరేడ్‌మెట్‌లో మంత్రి కేటీఆర్‌ తమిళంలో మాట్లాడి అక్కడ స్థిరపడిన తమిళవాసులను ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో తీసుకుపోతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుచుకుందామని పిలుపునిచ్చారు.  పెట్టుబడులకు గమ్యస్థానంగా నగరాన్ని మార్చుకున్నామని.. ఇదే స్ఫూర్తిని, అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. కేశవాపురం రిజర్వాయర్‌ పూర్తి చేసి రోజూ నీళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మన బిడ్డలకు కావాల్సినవి ఉద్వేగాలు కావనీ, ఉద్యోగాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రజలంతా ఆలోచించి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కేటీఆర్‌ కోరారు.


logo