ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 25, 2020 , 06:38:23

ఎందుకు చేస్తరు సర్జికల్‌ స్ట్రైక్‌

ఎందుకు చేస్తరు సర్జికల్‌ స్ట్రైక్‌

ప్రశాంత నగరాన్ని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తరా? సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యడానికి హైదరాబాద్‌ ఏమీ దేశ సరిహద్దులో లేదు. శత్రు దేశంలో అంతకన్నా లేదు. ఎందుకు చేస్తరు మా హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌? ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలి తీసుకుంటరా? మీ అసమర్థ పాలనపై హైదరాబాద్‌ ప్రజలు చేస్తరు సర్జికల్‌ స్ట్రైక్‌. - మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్  : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతం పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్న వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మేం గెలిస్తే హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ సోయిలేని మాటలు చెబుతున్న బీజేపీ నాయకులపై మంత్రి విరుచుకుపడ్డారు. జీహెచ్‌ఎంసీ ప్రచారంలో భాగంగా మంగళవారం గాంధీనగర్‌, రాంనగర్‌, బాగ్‌లింగంపల్లి చౌరస్తా, పటేల్‌నగర్‌ చౌరస్తాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. జీహెచ్‌ఎంసీ గల్లీ ఎన్నికలైనా సరే.. టీఆర్‌ఎస్‌కు భయపడి ఢిల్లీ నుంచి బీజేపీ దార్‌కార్‌లంతా వస్తున్నరని ఎద్దేవా చేశారు. ప్రశాంత నగరంలో సర్జికల్‌ స్ట్రైక్‌లు మాని.. దేశంలోని పేదరికం, అరాచకాలపైనా చేయాలని బీజేపీ ప్రభుత్వానికి హితవు పలికారు. దమ్మున్ననాయకుడు కేసీఆర్‌ పాలనలోనే రాష్ట్రంలో శాంతియుతమైన హైదరాబాద్‌ సాధ్యమన్నారు. మతం కాదని.. తమకు జనహితం ముఖ్యమని చెప్పారు. మతరాజకీయాలు చేసేవారిని చూసి ఆగం కాకుండా.. ఆలోచించి డిసెంబర్‌ ఒకటిన కారుగుర్తుపై ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

గల్లీ ఎలక్షన్‌కు ఢిల్లీ పెద్దలు వస్తున్నరు... 

గల్లీలో జరిగే ఈ ఎలక్షన్స్‌కు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిన్న ప్రకాశ్‌ జవదేకర్‌ వచ్చిండు.. రేపు అమిత్‌ షా వస్తుండటా.. ఆ తర్వాత నడ్డా.. యోగి ఆదిత్యనాథ్‌ .. ఇట్లా దార్‌కార్‌లంతా దిగుతుండ్రు. అంత భయమెందుకు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అని ప్రధానమంత్రి చెపుతున్నరు.. నేను అదే చెబుతున్న మరి.. పక్కా లోకల్‌ పార్టీ టీఆర్‌ఎస్‌. లోకల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కావాలా? ఢిల్లీ పార్టీ కావాలా? మీకు గుజరాత్‌ గులాంలు కావాలా?.. హైదరాబాద్‌ గులాబీలు కావాల్నా ఆలోచించుకోవాలని ప్రజల్ని కోరారు. 

ప్రతిరోజు నీళ్లిచ్చే బాధ్యత మాది... 

నాడు నీళ్ల గోస అంతా ఇంతా కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బోలక్‌పూర్‌లో మోరీ నీళ్లు, మంచి నీళ్లు కలిసిపోయి 9 మంది చనిపోయిన విషయం మర్చిపోవద్దు. తెలంగాణ వచ్చాక కొత్త పైపులైన్లు వేసి నీళ్ల గోస తీర్చినం. 14 రోజులకోసారి,  వారం రోజులకు నీళ్లు వచ్చే దుస్థితి నుంచి ఇప్పుడు రోజు విడిచి రోజైన నీళ్లు వస్తున్నాయి. ఇకపై రోజు విడిచి రోజు కాదు.. ప్రతిరోజు నీళ్లిచ్చే బాధ్యత మాది. హైదరాబాద్‌ ఎంత పెరిగినా.. జనాభా ఎంత పెరిగినా మరో 30 ఏళ్ల వరకు హైదరాబాద్‌కు నీటిఆ సమస్య ఉండదు. 

కిషనన్న, లక్ష్మణన్న ఏం చెప్పినా బోగసే.. 

మనం కేంద్రానికి 2.72 లక్షల కోట్లు పన్నులు కడితే వాళ్లు ఇచ్చింది 1.40 లక్షల కోట్లు మాత్రమే మనకు ఇచ్చారు. మన నుంచి రుపాయి పోతే ఆఠాణా వాపస్‌ వచ్చింది. అమిత్‌ షా తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చాను అంటారు. మీరు తెలంగాణకు ఏం ఇవ్వలేదు.. తెలంగాణే మీకు ఇచ్చింది.. కానీ తెలంగాణకు మీరు ఇచ్చింది ఏమీ లేదు. మా పైసలతో పాట్నాలో, వారాణాసీలో, అహ్మాదాబాద్‌లో రోడ్లు వేసుకున్నరు. కిషనన్న, లక్ష్మన్‌ అన్న ఏం చెప్పినా బోగసే.. ఇది తప్పంటే దేనికైనా సిద్దమే.  

డిసెంబర్‌ 4 తర్వాత అందరికీ వరద సాయం... 

హైదరాబాద్‌ ప్రజలకు కష్ట కాలంలో అండగా ఉన్నాం.. కరోనా వచ్చినా, వరదొల్చినా వారికి తోడున్నాం. మరి వాళ్లు ఎక్కడున్నారోచెప్పాలి.  వరద సాయం కింద పేదలకు రూ.10వేలు ఇస్తే అడ్డుపడిన బీజేపీ వాళ్లు ఇప్పుడు రూ.25వేలు ఇస్తామని దొంగ మాటలు చెపుతున్నారు. ఇస్తామంటే ఎవరు వద్దన్నరు. వాళ్లు ఇచ్చేది లేదు సచ్చేది లేదు.. నిజంగా మీకు సాయం చేయదలుచుకుంటే మేం సాయం చేసిన 6.50 లక్షల మంది జాబితాను నీకు ఇస్తా. మోడీతో చెప్పి వారిందరికీ రూ. 25వేలు ఇప్పించు. అప్పుడు మీరు ఎట్లా చెప్పితే అట్లా చేస్తాం. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇప్పటికే ఆరున్నర లక్షల మందికి రూ.650కోట్లు ఇచ్చింది.. సాయం అందని వారికి అర్హులందరికీ డిసెంబర్‌ 4 తరువాత ఇస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. అందరికీ వరద సాయం ఇచ్చి తీరుతాం. ఈసారి ఇటు బీజేపీని, అటు ఎంఐఎంను ఇద్దర్ని మడతపెట్టి కొడుదాం.. బోలక్‌పూర్‌ కూడా గెలిపిస్తే అప్పుడు వారికి తెలిసొస్తది అన్నారు. 

హైదరాబాద్‌కు మీరు చేసిందేమిటి?

రోడ్లు బాగున్నయి. రోడ్లు, నీళ్లు, కరెంటు వసతి మంచిగైంది. కేసీఆర్‌ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో సంబంధం లేకుండా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, కాన్పు అయితే కేసీఆర్‌ కిట్టు, మగబిడ్డ పుడితే రూ. 12వేలు , ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు. 4.50 లక్షల ఎల్‌ఈడీ లైట్లు, అన్నపూర్ణ క్యాంటీన్లు, బస్తీ దవాఖానాలు పెట్టారు. ఈ విధంగా ఐదేళ్లలో మేం ఏం చేసినమో చెబుతాం..  మరి మా మీద పోటీ చేసొటోళ్లు చెప్పాలే కదా..? కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇదే పార్లమెంటు నుంచి కిషనన్నని అడుగుతున్నా.. ఆరేండ్లలో ఏం చేశారో చెప్పు... నేనేం చేసిన్నో చూపిస్తా..మీ ప్రభుత్వం ఏం చేసిందో చూపించు. అరవై ఏండ్ల గబ్బు ఆరేండ్లలో పోతది. వారు సక్కగా చేసుంటే ఇంత కష్టం ఉండేది కాదు.

 అంబర్‌పేట్‌ చౌరస్తా నుంచి నేను సవాల్‌చేస్తున్నా కిషన్‌రెడ్డి.. రాజ్యాంగబద్దంగా తెలంగాణకు ఇచ్చేదానికంటే ఒక్కరూపాయి అయినా ఎక్కువ ఇచ్చిండ్రా..దమ్ముంటే సమాధానం చెప్పు.. మొన్న వరదలు వచ్చినప్పుడు నేను గల్లీగల్లీ మోకాలు లోతు నీళ్లలో తిరిగిన. వరద సాయం కోసం మేం రూ.10వేలు ఇస్తే ఆపినరు. మళ్లా రూ.25వేలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా?. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అని ప్రధానమంత్రి చెపుతున్నరు..నేను అదే చెబుతున్న మాది పక్కా లోకల్‌ పార్టీ టీఆర్‌ఎస్‌. వాళ్లు(బీజేపీవాళ్లు) ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు. మీకు హైదరాబాద్‌లో..గుజరాత్‌ గులాంలు కావాలా?..హైదరాబాద్‌ గులాబీలు కావాల్నా ఆలోచించండి.