ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 06:45:47

అగ్గిపెట్టెలు కావు.. అద్దాల మేడలు

అగ్గిపెట్టెలు కావు.. అద్దాల మేడలు

  • అక్కడే బస్తీ దవాఖానలు, అంగన్‌వాడీ కేంద్రాలు 
  • నగరంలో 111 చోట్ల 9,714 కోట్ల వ్యయంతో లక్ష ఇండ్లు
  • తుదిదశకు చేరుకుంటున్న నిర్మాణాలు 
  • నెలవారీ నిర్వహణకు అనుకూలంగా కొంత స్థలం దుకాణాలకు కేటాయింపు
  • గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా తీర్చిదిద్దుతున్న వైనం 
  • సోమవారం 1,150 ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

చిన్న బస్తీలు.. ఇరుకిరుకు దారులు.. పాడుబడ్డ పెంకుటిండ్లు.. స్నేహితులో, బంధువులో ఇంటికొస్తే కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేనంత చిన్న గదులు. ఒకరు నడుస్తుంటే ఇంకొరు దూరలేని ఇరుకైన సందులు. తమ దారిద్య్రాన్ని తిట్టుకుంటూ రోజూ నిట్టూరుస్తూ ఏండ్లకేండ్లు గడిపేస్తూ సాగదీసే బడుగు జీవితాలు. ఇలాంటి జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. ‘ఇది నా ఇల్లు’ అని తలెత్తుకొని తిరిగేలా చక్కటి సౌధాలను నిర్మిస్తున్నది. వాటి కోసం రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇచ్చిన మాట తప్పకుండా లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నది. సమైక్య ప్రభుత్వాల కాలంలో ఎండమావుల్లా మిగిలిపోయిన ఇండ్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తున్నది. తూతూమంత్రంలా అగ్గిపెట్టెల్లా కట్టి చేయి విదిలించుకునే వ్యవహారంలా కాకుండా సొంతింటి కార్యక్రమంలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నది. పాత ప్రభుత్వాలు కేవలం 260 చదరపు అడుగుల వైశాల్యంలో మాత్రమే ఇల్లు ఇస్తే.. ఇప్పుడు మాత్రం 560 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌ రూం నిర్మించి ఇస్తున్నది. నగరంలో 111 చోట్ల 9714 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లక్ష ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నల్లా కనెక్షన్‌ కోసం జలమండలి చుట్టూ తిరగలేదు. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఎలక్ట్రిసిటీ అధికారుల కోసం పడిగాపులు పడలేదు. పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల కోసం వెతకాల్సిన పనిలేదు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. నల్లా తిప్పగానే నీళ్లు వస్తున్నాయి. స్విచ్‌ ఆన్‌ చేయగానే.. బల్బులు వెలుగుతున్నాయి. ఆట స్థలం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా విస్తారంగా రోడ్లు వేశారు. సరిపడా వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్‌ స్థలం ఉంచారు. ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చటి తివాచీలు పరిచినట్టు చెట్లు పెంచారు. మనకు కావాల్సినవన్నీ మనకు అందుబాటులోనే ఉండేలా ఆత్మగౌరవ సౌధాలను నిర్మించారు. పైసా కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగానే పేదలు తలెత్తుకొని బతికేలా నిర్మించారు. ఇదంతా తెలంగాణ సర్కారు నిర్మించి ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కాలనీల ప్రత్యేకతలు. సోమవారం నగరంలోని గోడే కీ ఖబర్‌, జియాగూడ, కట్టెలమండిల్లో మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీలు పలువురు లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందజేశారు.

సకల వసతులు..

పేదలకు సొంతిండ్లు అంటే నాటి సమైక్య ప్రభుత్వంలో హాస్యాస్పద విషయాలుగా ఉండేవి. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం, కొందరు నేతలు వాటాలు పంచుకోవడం కోసం, నాలుగు గోడలు పెట్టి డబ్బా ఇండ్లను పేదలకు విదిల్చేవారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. చాలా సందర్భాల్లో అవి నిజమని నిరూపణ కూడా జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టిన తర్వాత లబ్ధిదారుకు అగ్గిపెట్టెలాంటి ఇండ్లు అప్పగించేవారని సర్వత్రా విమర్శలు వచ్చాయి. పిట్టగూడు లాంటి ఇండ్లు.. కూర్చోవడానికి, కాళ్లు చాచుకొని పడుకొనేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. గుక్కెడు నీళ్లకూ ఇబ్బందయ్యేది. కరెండు ఉండేది కాదు. ఉతికిన బట్టలు ఆరేసుకోవాలంటే చీకటి గదుల్లో తాళ్లు కట్టి వేలాడేసుకోవాల్సిందే. ముక్కుపుటాలదిరే దుర్వాసనను రోజూ భరించాల్సిందే. పెళ్లో, ఏ ఇతర ఫంక్షన్‌ చేయాలన్నా రోడ్డెక్కాల్సిందే. రోడ్లు బంద్‌ పెట్టాల్సిందే. ఇది నగరంలోని బస్తీలో నిత్యకృత్యమయ్యే వ్యవహారం. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కారు కట్టిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కాలనీలు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా నిలుస్తున్నాయి. బస్తీ దవాఖాన, మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాలు, అంగన్‌వాడీ కేంద్రాలను కాలనీల్లోనే నెలకొల్పుతున్నారు. పార్కింగ్‌ వసతులు, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.

దుకాణాల అద్దెలతో నిర్వహణ..

సాధారణంగా అపార్టుమెంట్లు అంటేనే నెలనెలా తప్పనిసరిగా నిర్వహణ వ్యయం ఉంటుంది. వాటర్‌ బిల్లు, సెక్యూరిటీ, పారిశుధ్యం తదితర ఖర్చులను అదనంగా భరించాల్సిందే. ఇలా ఒక్కోచోట రూ. వెయ్యి నుంచి 1500 వరకు చెల్లించుకోవాల్సిందే. అయితే డబుల్‌ కాలనీల్లోని వారిపై భారం పడకుండా ఉండేందుకు గాను తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచనను చేసింది. డబుల్‌ కాలనీల్లోనే ఇండ్లతో పాటు, కొన్ని దుకాణాలను నిర్మించింది. ఈ దుకాణాలను అద్దెకిచ్చి, వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని అపార్ట్‌మెంట్ల నిర్వహణ కోసం వెచ్చించుకునే వెసులుబాటును కల్పించింది. దీంతో పేదవర్గాలకు చెందిన వారిపై నిర్వహణ ఖర్చుల భారం లేకుండా ఏర్పాట్లుచేశారు.

పాత ప్రభుత్వాల హయాంలో 260 చదరపు అడుగులే..

ఇల్లు కట్టుకోవడం అంత సులువైన విషయమేమీ కాదని అందరికీ తెలిసిందే. నిర్మాణ సమయంలో సవాలక్ష సమస్యలు ఎదురొస్తాయి. అనుమతులు.. మంజూరీలు.. స్థానికంగా అభ్యంతరాలు. ఇలా నగరంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీకావు. కాని ఇవన్నీ లేకుండా, పైసా ఖర్చుచేయకుండా రూ.9 లక్షల విలువైన ఇల్లు లబ్ధిదారుల సొంతమైతే ఆ ఆనందానికి అవధులుండవు. రూ.7.5 లక్షలతో ఇంటి నిర్మాణం. మరో 1.5 లక్షలతో విద్యుత్‌, నల్లా కనెక్షన్లు తదితరాలకు ప్రభుత్వం వెచ్చించింది. గత ప్రభుత్వాలు 260 చదరపు అడుగుల్ల్లో ఒకే ఒక్క గది ఉన్న ఇండ్లను ఇవ్వగా, తెలంగాణ సర్కారు 560 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియాలో ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. దీంట్లోనే ఒక హాలు, కిచెన్‌, రెండు పడకగదులు, రెండు బాత్రూమ్‌లను నిర్మించి ఇస్తున్నారు.

లోన్ల బాధ లేకుండా.. ప్రభుత్వమే కట్టిచ్చింది

సొంతిల్లు కట్టుకొని తీరాలని జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అప్పో సప్పో చేసి కాసింత గూడును కట్టుకోవాలన్నది ఆకాంక్షిస్తారు. అందుకే చాలా మంది తమ వద్ద సరిపడా డబ్బులు లేకున్నా ధైర్యం చేసి అప్పు తీసుకునేందుకు కూడా వెనకాడరు. బ్యాంక్‌లోన్లు తీసుకుని వడ్డీలను భరించి కూడా ఓ గూడును సిద్ధం చేసుకుంటారు. ఈఎంఐలు, వాయిదాలు, వడ్డీలతో ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలిసినా భరిస్తారు. ఇలా బ్యాంక్‌ లోన్ల బాధలకు ఆస్కారం లేకుండా తెలంగాణ సర్కారు లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తున్నది. ఒక్కపైసా కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నది. 

పట్టా రావడం అనందంగా ఉంది

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు చాలా బాగున్నాయి. పట్టా రావడంతో అనందంగా ఉంది. మంత్రి కేటీఆర్‌ మా ఇంటికి వచ్చి పట్టా అందజేశారు. రెండు బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు సైతం ఎంతో బాగున్నాయి. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - మిథిలేష్‌ కుమార్‌, దివ్యజ్యోతి, ఇంద్రని

విశాలంగా ఉన్నాయి

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు విశాలంగా బాగున్నాయి. సొంతంగా కట్టుకున్నట్లున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ త్వరాత ఎంతో అభివృద్ధి జరుగుతోంది. ప్రభుత్వం ప్రజల బాధలను అర్థం చేసుకొని త్వరగా ఇండ్లు అందజేస్తోంది. - అనురాధ, జియాగూడ

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం 

గత 40 ఏండ్లు పాత మున్సిపల్‌ క్వార్టర్స్‌లో బిక్కుబిక్కుమంటూ బతికాం. కొత్త డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించినందుకు సీఏం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎప్పుడు కూలుతా యో తెలియని ఇండ్ల స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించి ఇచ్చారు. ప్రజల బాధలను అర్థం చేసుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుంటుంది. - కే.రాణి, జియాగూడ

ఎంతో బాగున్నాయి

జియాగూడ పాత మున్సిపల్‌ క్వార్టర్స్‌లో పాత ఇండ్లను కూల్చేసినప్పుడు చాలా బాధ పడ్డాం. మళ్లీ ఇండ్లు కడుతారో లేదోనని భయపడ్డాం. కానీ సీఏం కేసీఆర్‌ ప్రభుత్వం తొందరగా ఇండ్లు నిర్మించి అందజేసింది. అప్పటి ఇండ్ల కంటే ఇవి ఎంతో పెద్దగా సౌకర్యంగా ఉన్నాయి.- సల్మాబేగం, జియాగూడ

చాలా ఆనందంగా ఉంది

మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. బస్తీలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకెళ్లదీసే మా లాంటోళ్లకు ఇంత మంచి ఇల్లు దక్కుతదని కలలో కూడా అనుకోలేదు. మా జీవితం నిలబెట్టిన గవర్నమెంటుకు రుణపడి ఉంటం. - ఎస్‌. లక్ష్మీ బాయి

చాలా సంతోషంగా ఉంది 

మావి చాలీచాలని ఇండ్లు. ఇరుకిరుకు ఉంటయి. ఎవరన్న వస్తే పండుకోనీకే కూడా జాగ లేకుండె. ఇంతకు ముందు ఏ గవర్నమెంటు కూడా ఇట్ల మా గురించి ఆలోచించలేదు. సీఎం కేసీఆర్‌ మా కష్టాలను అర్థం చేసుకున్నడు. మమ్మల్ని గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. - మోహన్‌కుమార్‌

పండుగనాడే ఇంట్లకు పోయినం

పండుగ నాడే ఇంట్లకు పోయినం. చాలా మంచిగనిపించింది. నాలాంటి చేత కాని ముసలోళ్ల ఆరోగ్యం చూసుకునేటందుకు మా దగ్గరనే ఓ బస్తీ దవాఖానను కూడా పెట్టిండ్రు. చిన్న పిల్లల కోసం అంగన్‌ వాడీ కూడా ఉంది. ఇంతకు మించి సౌలత్‌లు ఇంకెక్కడ ఉంటయి. నిజంగానే ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం కష్టపడుతున్నది  - పి. నర్సమ్మ

రూంలు విశాలంగ ఉన్నయి

ఇన్ని రోజులు రెండు చిన్న రూంలలో ఉండెటోళ్లం. అటువంటిది ప్రభుత్వం విశాలంగా ఉండేటట్లు రూంలు కట్టించింది. ఇంతకు ముందు ఇరుకిరుకు ఉంటుండె. ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చిన ఇండ్లు పెద్దగనే ఉన్నయి. పండుగ నాడు ఇంట్ల పాలు పొంగపెట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. -పుష్పలత

గవర్నమెంటే ఆదుకున్నది

పేదింటి బిడ్డకు డబుల్‌బెడ్‌ రూం నిర్మించి దసరా కానుకగా అందించడం ఎంతో ఆనందంగా ఉంది. మురికి వాడలైన బస్తీలలోని ఇరుకు ఇండ్లలో నివసించి ఎన్నో కష్టాలు పడ్డాం. ప్రభుత్వం బస్తీలను గుర్తించి డబుల్‌బెడ్‌రూం నిర్మించి ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. - రేణుక 

దసరా కానుక ఇది

పండుగ నాడు మా కల నెరవేరింది. సొంతిల్లు మా చేతికొచ్చింది. ఇన్నేండ్లు బస్తీల ఇరుకు ఇంట్ల ఉంటిమి. ప్రభుత్వమే ముందుకొచ్చి మాకు ఇల్లు కట్టించి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు జీవితంలో మరిచిపోలేది దసరా పండుగ కానుక - గౌరీలక్ష్మీబాయికిరాయి 

కట్టలేక పరేషానైనం

చిన్న ఇంట్ల ఉండేటోళ్లం. చాన్నాళ్ల  నుంచి కిరాయి ఇంట్లనే ఉంటున్నం. ఠంచనుగ ఇవ్వడానికి చేతిలో పైసలు లేకుంటుండె. మా లాంటి పేదవాళ్ల కోసం ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వడం ఆనందంగా ఉంది. మమ్మల్ని ఇబ్బందుల నుంచి తప్పించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు షుక్రియా. - షమీన్‌

ఇల్లొస్తదని ఏనాడూ అనుకోలేదు

భవంతుల్లో నివసించాలని ఎవరికైనా కోరిక ఉంటది. మాలాంటి పేదోళ్లకు అది తీరని కల. కానీ అది ఈ గవర్నమెంటోళ్లు నిజం చేసిండ్రు. ఇన్ని ప్రభుత్వాలు చూసినం. అందరు మాటలు చెప్పినోళ్లే. కానీ ఇచ్చిన మాట తప్పకుండా మాకు ఇల్లిచ్చింది మాత్రం కేసీఆర్‌ గవర్నమెంటే  - కె.రత్నమ్మ