ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 08:00:15

నడ్డా.. వరదలప్పుడు ఏ అడ్డాలో ఉన్నావ్‌!

నడ్డా.. వరదలప్పుడు ఏ అడ్డాలో ఉన్నావ్‌!

ఆర్కేపురం: హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఏ అడ్డాలో ఉన్నారో తేల్చాలని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బెంగళూరులో వరదలు వస్తే రూ. 600 కోట్లు ఇచ్చి హైదరాబాద్‌కు మొండి చేయి చూపారని మండిపడ్డారు. శుక్రవారం కొత్తపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సరూర్‌నగర్‌ డివిజన్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరదల్లో హైదరాబాద్‌కు రూ. 1100 కోట్ల నష్టం వాటిల్లిందని లేఖ రాస్తే సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు.  వరదల సమయంలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, మేయర్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

గతంలో ఎల్బీనగర్‌ అంటే ట్రాఫిక్‌ భయం ఉండేదని, అటువంటి ప్రాంతాన్ని సిగ్నల్‌ ఫ్రీ జోన్‌గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందంతా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందని మంత్రి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఉండగా హైదరాబాద్‌లో ఏ ఒక్కరు పూచిక పుల్లను కూడా కదిలించలేరని అన్నారు. కార్యక్రమంలో సరూర్‌నగర్‌ అభ్యర్ధి పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, మహేందర్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.


logo