గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 06:27:06

భాగ్యనగరంపై బాంబులు వేస్తారా?

భాగ్యనగరంపై బాంబులు వేస్తారా?

ఎల్బీనగర్‌: బీజేపీకీ ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులు వేస్తరా..?  అని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కొత్తపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీజీ సాగర్‌రెడ్డికి మద్దతుగా భరత్‌నగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, శివమ్మనగర్‌ తదితర ప్రాంతాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ కన్నతల్లిలా ప్రపంచదేశాల ప్రజలను అక్కున చేర్చుకుంటున్న హైదరాబాద్‌పై అంత అక్కసు ఎందుకన్నారు. నగరంపై సర్జికల్‌ స్ట్రైక్‌లు అంటూ కమలనాథులు అవాకులు, చవాకులు పేలుతున్నారని మంత్రి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలనే విషయాన్ని మరిచి సర్జికల్‌ స్ర్టైక్‌ అంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సురక్షిత నగరంగా మార్చారని పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాలు, షీ టీమ్స్‌తో ప్రజలకు అంతర్జాతీయ స్థాయి భద్రత లభిస్తున్నదని వివరించారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతల కుట్రలను తిప్పికొట్టి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. కొత్తపేట డివిజన్‌ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాగర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కొత్తపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవీ సాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు లింగాల రాహుల్‌గౌడ్‌, మహేశ్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

వనస్థలిపురం: సర్జికల్‌ స్ట్రైక్‌లతో బాంబులు వేసి కల్లోలం చేసే హైదరాబాద్‌ మనకొద్దని, కేసీఆర్‌ నాయకత్వంలో కలలు సాకారం చేసుకొనే నగరం కావాలని  మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.  బీఎన్‌రెడ్డినగర్‌, సచివాలయనగర్‌, వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్‌ నంబర్‌వన్‌గా ఉన్నదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి లక్ష్మీప్రసన్నను, వనస్థలిపురం నుంచి జిట్టా రాజశేఖర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో, వరదలు వచ్చినప్పుడు ఎంపీ రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు.  ప్రచారంలో నల్గొండ జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్‌ కే వాసుదేవరెడ్డి, బేవరేజస్‌ కార్పొరేటర్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మాధవరం నర్సింహారావు, చంద్రశేఖర్‌రెడ్డి, కూర్మారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మేయర్‌ పీఠం మాదే.. ప్రజలకు మాపై పూర్తి నమ్మకం ఉంది: హోంమంత్రి

చాదర్‌ఘాట్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అమలుకు సాధ్యం కానీ వాగ్దానాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మ్యానిఫెస్టోలో మోసపూరిత హామీలు పొందుపర్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దు య్యబట్టారు.  బుధవా రం ఆజంపురాలోని పార్టీ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని తేల్చి చెప్పారు. ప్రజా సేవే పరమావధిగా భావించే డైనవిక్‌ లీడర్‌ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని కొనియాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తే మహానగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే మతసామరస్యం, శాంతి భద్రతలు ప్రశాంత వాతావరణం నెలకొంటుందని మహమూద్‌ అలీ పేర్కొన్నారు.


logo