ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 06:53:37

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

నేరేడ్‌మెట్‌: గ్రేటర్‌లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని మహాబోధి ఫంక్షన్‌హాల్లో కార్యకర్తల సమావేశం జరిగింది.  నేరేడ్‌మెట్‌ ఇంచార్జి పుట్టా మధు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యూకే అడ్వైజర్‌ సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరదలతో నష్టపోయిన వారికి సాయం అందేలా చర్యలు తీసుకున్నామని, నష్టపరిహారం అందని వారికి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో నాయకులు రావుల అంజయ్య, చెన్నారెడ్డి, ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తంకుమార్‌ రెడ్డి, నారాయణరెడ్డి, జాన్‌, మహేశ్‌, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

బీజేపీని చిత్తుగా ఓడించాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి


కందుకూరు: ఆర్కేపురం డివిజన్‌లో బీజేపీని చిత్తుగా ఓడించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం డివిజన్‌ పరిధిలోని కందుకూరు మండల టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే తానే ముందుండి అభివృద్ధి చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుల కల్లిబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. బీజేపీ నేతలు హైదరాబాదులో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, వారి ఆటలను సాగనివ్వవద్దని పేర్కొన్నారు. అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని విమర్శించారు.