శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 16, 2021 , 04:52:48

టీకా.. వేశాక అరగంట అక్కడే

టీకా.. వేశాక అరగంట అక్కడే

  • దుష్ఫలితాలు వస్తే సత్వరమే చికిత్స 
  • అంబులెన్స్‌లు, ఐసీయూలు సిద్ధం 
  • నేడు ‘గాంధీ’లో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా 
  • ప్రారంభించనున్న వైద్యశాఖ మంత్రి ఈటల

కరోనా కోరలు విరిచే రోజు రానే వచ్చింది.. పదినెలలుగా అతలాకుతలం చేసిన వైరస్‌ను పారదోలే వ్యాక్సిన్‌(టీకా) ఎట్టకేలకు సిద్ధమైంది. తొలి టీకాకు ప్రతిష్టాత్మక గాంధీ దవాఖాన వేదికైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం వ్యాక్సిన్‌ను ప్రారంభించనుండగా..ఇక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికుడికి మొదటి టీకా ఇవ్వనున్నారు. గాంధీ దవాఖానలో తొలి టీకాతోపాటు వైద్యులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో కలెక్టర్‌ శ్వేతామహంతి ఏర్పాట్లు పరిశీలించారు. టీకా ఇచ్చిన తర్వాత అర్ధగంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఎలాంటి దుష్ఫలితాలు వచ్చినా సత్వరమే వైద్యమందించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్‌లు, ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ యోధులు, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికే తొలి టీకా ఇవ్వనుండగా, మూడు జిల్లాల పరిధిలో 33 కేంద్రాలను సిద్ధం చేశారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 

హైదరాబాద్‌:  కరోనా వ్యాక్సినేషన్‌ను నగరంలోని గాంధీ దవాఖాన నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. అంతకు ముందు శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో కరోనా టీకాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం గాంధీలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో తొలి టీకాను దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడికి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీకా వేసేందుకు గ్రేటర్‌ పరిధిలో మొత్తం 1,08,925 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య కార్యకర్తలను గుర్తించారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 78,226 మంది.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 26,078, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 12,247 మంది ఉన్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 260 టీకా కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 142, రంగారెడ్డి జిల్లాలో 59, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో 59 ఉన్నాయి. అయితే తొలి రోజైన శనివారం గ్రేటర్‌వ్యాప్తంగా 33 కేంద్రాల్లో మాత్రమే టీకా పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ పరిధిలో 13 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 9, మేడ్చల్‌ పరిధిలో 11 కేంద్రాల్లో కేవలం ప్రభుత్వ రంగ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే టీకా వేయనున్నారు. తొలిరోజు కావడంతో ప్రతి కేంద్రంలో 30 మందికి చొప్పున మాత్రమే టీకా వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

పర్యవేక్షణకు ప్రత్యేక ఐసీయూలు.. 

కరోనా టీకా తీసుకున్న వారిని అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే మెరుగైన చికిత్స అందించేందుకు నగరంలోని అన్ని ట్రెజరీ దవాఖానాల్లో ప్రత్యేక ఐసీయూ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  ప్రత్యేక అంబులెన్స్‌లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. ఇదిలా ఉంటే కో-విన్‌ యాప్‌లో రిజిస్ట్రర్‌ అయిన వారికే టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. టైమ్‌స్లాట్‌ మెసేజ్‌ వచ్చిన వారు మాత్రమే శనివారం  టీకా కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు.  

ఏర్పాట్లు పరిశీలన..

 గ్రేటర్‌ పరిధిలో టీకా పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధీలో తొలి టీకాతో పాటు ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులతో మాట్లాడనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి శుక్రవారం గాంధీ దవాఖానలో ఏర్పాట్లను పరిశీలించారు. నార్సింగి యూపీహెచ్‌సీని రంగారెడ్డి జిల్లా అధికారులు పరిశీలించారు. 

హైదరాబాద్‌ జిల్లాలో: 

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 78,226వేల మందికి మొదటి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో ప్రభుత్వ వైద్యరంగంలో 18,911మంది.. ప్రైవేటు రంగంలో 59,315 మందిని గుర్తించినట్లు వివరించారు. నగరంలో మొత్తం 142 టీకా కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం 13 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నారు. 

రంగారెడ్డి జిల్లా పరిధిలో..  

రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 26,078 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ను గుర్తించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మీ తెలిపారు. వీరిలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేవారు 6079 మంది ఉండగా 19,999 మంది ప్రైవేట్‌ వైద్యరంగంలో పని చేస్తున్నారన్నారు. వీరందరికీ కరోనా టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 59 కేంద్రాలను ఏర్పాటు చేయగా తొలిరోజు 9 కేంద్రాల్లో టీకా పంపిణీ చేయనున్నారు. 

మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో.. 

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 12,247మందిని గుర్తించినట్లు జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రామ్‌కుమార్‌ తెలిపారు. వీరిలో ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్న వారు 2159 మందిని గుర్తించగా ప్రైవేటు రంగంలో 10,088 వేల మందిని గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 59 టీకా కేంద్రాలను ఏర్పాటు చేయగా నేడు 11 కేంద్రాల్లో వైద్యసిబ్బందికి టీకా వేయనున్నట్లు అధికారులు తెలిపారు.  

VIDEOS

logo