గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Nov 21, 2020 , 06:48:53

బీజేపీ బోగస్‌మాటలు ప్రజలు నమ్మరు

బీజేపీ బోగస్‌మాటలు ప్రజలు నమ్మరు

ఉప్పల్‌: ఆరేండ్లలో కేంద్రం నుంచి హైదరాబాద్‌ అభివృద్ధికి బీజేపీ నేతలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెలి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. గతంలో దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నారనీ, ప్రస్తుతం కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. హబ్సిగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భేతి స్వప్నారెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ నేతలు చేస్తున్న బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని, అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టలేరని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని చెప్పారు. ‘బీజేపీ వారికి చేతులెత్తి మొక్కుతున్న.. మత ఘర్షణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు.. మత ఘర్షణలతో ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నం చేయొద్దు’ అన్నారు. కొందరు నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఈ ఆట దుబ్బాకలో సాగిందని, హైదరాబాద్‌ ఎన్నికల్లో సాగదన్నారు. బీజేపీ అబద్ధాలను మీడియా రాయకపోవడంతో, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారని తెలిపారు. నగర ప్రజలు చైతన్యవంతులని, బీజేపీని చిత్తుగా ఓడిస్తారని అన్నారు.

బీజేపీ నేతలు వరద సాయంపై ఈసీకి ఫిర్యాదు చేసి పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఉన్నది తన సంతకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ బృందం వెళ్లి ఈసీని కలిసింది నిజమా..? కాదా..? తేల్చాలని డిమాండ్‌ చేశారు. తమకు సంబంధం లేదని, తాము ఆపలేదని బండి సంజయ్‌ పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, వరదలు వచ్చినా హైదరాబాద్‌ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదని,  గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌కు సహాయం చేసిందని వివరించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, హబ్సిగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి భేతి స్వప్నారెడ్డి, బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, పల్లె నర్సింగ్‌రావు, ఏదుల్ల కొండల్‌రెడ్డి, వీబీ నర్సింహా, పాల్గొన్నారు.

గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధీమా


మారేడ్‌పల్లి: గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు సాధించడం ఖాయమని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఆయా డివిజన్ల అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు వేసేందుకు వచ్చిన సందర్భంగా మంత్రి తలసాని వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కోట్ల రూపాయాల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి కైవసం చేసుకోవడం ఖాయమని తెలిపారు.