ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 26, 2020 , 08:37:48

దత్తత తీసుకుంటున్నా.. ప్రతి సమస్యను పరిష్కరిస్తా

 దత్తత తీసుకుంటున్నా.. ప్రతి సమస్యను పరిష్కరిస్తా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ డివిజన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.సమస్యలు విలయతాండవం చేసేవి. ప్రజలకు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం అయ్యేవి కావు.. కాని స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి. గడిచిన ఐదేండ్ల కాలంలో మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌ రూపురేఖలే మార్చేశాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.110కోట్లు వెచ్చించి దశాబ్ద కాలంగా వేదిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపాం. ఎంతటి విపత్తు ఎదురైనా మరో 25ఏండ్ల వరకు పనిచేసే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించాం. రిజర్వాయర్ల ఏర్పాటుతో డివిజన్‌ వాసుల దాహం తీర్చాం. ముంపు సమస్య లేకుండా కోట్లాది రూపాయల వ్యయంతో స్టామ్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మిస్తున్నాం.. ఇన్ని చేశాం.. ఇంకా చేస్తాం.. ప్రచారం ముగియగానే వెళ్లిపోతాడు అనుకోవద్దు.. వస్తూనే ఉంటా.. ఇక్కడి ప్రజల గుండెల్లో స్థానం పొందుతా.. అందుకే డివిజన్‌ను దత్తత తీసుకుంటున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.100కోట్లపై చిలుకు నిధులు తీసుకువచ్చి డివిజన్‌లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తా. మళ్లీ బల్దియా ఎన్నికల అప్పుడు నేనే వస్తా.. ప్రచారం నేనే నిర్వహిస్తా.. ఇప్పుడు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరకున్నా.. నన్ను నిలదీయండి. అని ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 

మల్లాపూర్‌ : మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌ను దత్తత తీసుకొని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, డివిజన్‌ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  మంత్రి బుధవారం పార్టీ అభ్యర్థి ప్రభుదాస్‌, సిట్టింగ్‌ కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య, మాజీ కార్పొరేటర్‌,డివిజన్‌ అధ్యక్షుడు జి. శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఫేస్‌-1 ఫేస్‌-2, వెంకటేశ్వరనగర్‌ కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుదాస్‌తో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాలనీల ఓటర్లతో మమేకమైన మంత్రి దయాకర్‌రావు ప్రతీ ఒక్కరితో ఫొటో దిగుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం లాండ్రీ షాపులో ఇస్త్రీ చేస్తూ, టిఫిన్‌ సెంటర్‌ వద్ద దోశలు వేస్తూ మంత్రి, అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు,సీఎం కేసీఆర్‌ హామీలతో ముద్రించిన కరపత్రాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు.logo