బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 00:56:36

లక్ష లీటర్ల తాగునీరు వృథా

లక్ష లీటర్ల తాగునీరు వృథా

  • ట్యాంకులో పసుపు కలిపిన బీజేపీ నాయకులు
  • ఆందోళన చేసిన కాలనీవాసులు
  • జలమండలి అధికారులు, పోలీసులకు ఫిర్యాదు

ముషీరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమ్మవారి పూనకం వచ్చిన ఓ మహిళ కరోనా తగ్గాలంటే నీటిలో పసుపు వేసుకొని తాగాలని సూచించడంతో ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకులు నీటి ట్యాంకులో పసుపు కలపడం వివాదానికి దారితీసింది. పసుపు కలిపిన నీరు తాగబోమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండు బస్తీలకు చెందిన వారు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు లక్ష లీటర్ల నీటిని రోడ్డుపైకి వదలాల్సి వచ్చింది. ఈ ఘటన రాంనగర్‌ డివిజన్‌ హరినగర్‌లో జరిగింది. దొడ్డిదారిన వెళ్లి తాగునీటిలో పసుపు కలిపి నీటి వృథాకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు, జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి తాగే నీటిలో పసుపు కలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి రాంనగర్‌ డివిజన్‌ శివస్తాన్‌ పూర్‌లోని అమ్మవారి దేవాలయం వద్ద ఓ మహిళకు పూనకం వచ్చింది. కరోనా తగ్గాలంటే నీటిలో పసుపు వేసుకొని తాగాలని ఆమె సూచించింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు హరినగర్‌ నీటి ట్యాంక్‌లో పసుపు కలపడానికి వెళ్లగా, వాచ్‌మన్‌ వారిని అడ్డుకున్నాడు. దాదాపు 30 మంది బీజేపీ నాయకులు, యువకులు వాచ్‌మన్‌ను నెట్టేసి గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి నీటిలో పసుపు కలిపారు.

ఈ విషయం తెలుసుకున్న బస్తీవాసులు నీటిలో పసుపు ఎందుకు కలిపారని వారితో వాగ్వాదానికి దిగారు. సోమవారం ఉదయం ట్యాంకు వద్ద బస్తీవాసులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు బస్తీవాసులు పసుపు కలిపిన నీటిని తాగమంటూ ఫిర్యాదు చేయడంతో జలమండలి అధికారులు లక్ష లీటర్ల నీటిని బయటకు వదిలారు. పోలీసులు విచారణ చేపట్టి నీటిలో పసుపు కలిపిన వారిని అరెస్టు చేయాలని, మరోమారు ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సూచించారు.


logo