ఆదివారం 31 మే 2020
Hyderabad - May 20, 2020 , 01:21:25

సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కూలీల విముఖత

సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కూలీల విముఖత

 హైదరాబాద్ :  తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలను తమ సొంత రాష్ర్టాలకు తరలించేందుకు మంగళవారం నగరం నుంచి 12 రైళ్లను ఏర్పాటు చేసింది. నగర శివారు ప్రాంతాల్లోని లింగంపల్లి, బొల్లారం, ఘట్‌కేసర్‌,శంషాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ రైళ్లు దేశంలోని పలు రాష్ర్టాలకు తరలివెళ్లాయి. ఒక్కో రైళ్లో 1200 నుంచి 1600 మంది కార్మికులను తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేయగా, వలస కూలీల జాబితాను స్థానిక పోలీసులు తయారు చేశారు. 

కానీ సీఎం కేసీఆర్‌ ప్రకటనకు ముందు పోలీస్‌స్టేషన్ల వద్ద తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బారులు తీరిన వలస కార్మికులు ముఖ్యమంత్రి మీడియా సమావేశం తర్వాత సొంతూళ్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఆయా పోలీస్‌స్టేషన్ల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఫలానా రైల్వే స్టేషన్‌లో రైలు సిద్ధంగా ఉందని ఫోన్‌ చేస్తే తాము ఇప్పుడు వెళ్లడం లేదని వలస కార్మికులు సమాధానం ఇస్తున్నట్లు ఓ స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్‌ వెల్లడించారు.ఇదేమిటని ప్రశ్నిస్తే.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలించడంతో ఇక్కడే ఉండి పనిచేసుకుంటామని వారు సమాధానం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

క్వారంటైన్‌ భయం..

 వ్యయప్రయాసలకు గురై ఒకవేళ సొంత గ్రామాలకు వెళ్లినా.. అక్కడ తిరిగి 14 రోజులు( ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు) క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వలస కార్మికులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ వల్ల దాదాపు రెండునెలల పాటు నగరంలోనే  ఉన్నామని, ఇన్నాళ్లు ఉపాధి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, ఖర్చులకు రూ.500 ల చొప్పున రెండు సార్లు ఇచ్చిందని, లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినందున కొంతకాలం పనులు చేసుకొని వెళితే బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. ఇంతకాలం పనిలేక పోవడంతో చేతిలో చిల్లి గవ్వలేదని, ఇప్పుడు సొంత ఊళ్లకు వెళ్లినా మనుగడ కష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో వలస కూలీల వలసలకు బ్రేకులు పడ్డ మాట వాస్తవమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సికింద్రాబాద్‌ సర్కిల్‌లో వలస కార్మికులకు ఉద్యోగాలు

సికింద్రాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వారు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు, కంపెనీలు తెరుచుకుంటుండడంతో వలస కార్మికులకు డిమాండ్‌ పెరుగుతున్నది. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌  సర్కిల్‌ పరిధిలో 500 మంది వలస కార్మికులు ఉండగా ఇందులో దాదాపు 95 మంది సొంత రాష్ర్టాలకు వెళ్లారు. మిగిలిన వారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 273 మందికి పలు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించగా, మంగళవారం మేడ్చల్‌లో ఓ కంపెనీలో మరో 15 మంది కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇంకా 117 మంది జీహెచ్‌ఎంసీ కల్పించిన షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.త్వరలో మిగతా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.logo