బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 01:24:22

సర్వాంగ సుందరంగా.. ఎంజీబీఎస్‌

సర్వాంగ సుందరంగా.. ఎంజీబీఎస్‌

సుల్తాన్‌బజార్‌, : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో అధికారులు పరిశుభ్రతా చర్యలతో పాటు పెయింటింగ్‌, ప్లాట్‌ఫారంలకు మార్కింగ్‌ పనులను పూర్తి చేస్తున్నారు. మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. కాగా లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి ఎంజీబీఎస్‌ నుంచి బస్సులు యథావిధిగా నడువనుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న సమయంలో ఎంజీబీఎస్‌ను తీర్చిదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే ఎంజీబీఎస్‌ లాక్‌డౌన్‌ కారణంగా బోసిపోయింది. సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో ఎంజీబీఎస్‌లోని కారిడార్‌తో పాటు గాంధీ విగ్రహం, 1వ ప్లాట్‌ ఫారం నుంచి 67వ ప్లాట్‌ ఫారం వరకు పిచికారీ చేయించి శుభ్రపరిచారు. శిథిలావస్థకు చేరుకున్న ప్లాట్‌ ఫారంలకు మరమ్మతులు చేయించి పెయింటింగ్‌లతో మార్కింగ్‌ వేసే పనులను చేపడుతున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ సడలింపులో ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్‌, అప్పా జంక్షన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, హయత్‌నగర్‌, ఆరాంఘర్‌ చౌరస్తాల వరకు బస్సుల రాకపోకలను కొనసాగించడంతో నాల్గో విడత లాక్‌డౌన్‌ పూర్తయిన అనంతరం ఎంజీబీఎస్‌ నుంచి ఇంటర్‌స్టేట్‌, సిటీ బస్సులను నడుపవచ్చనే యోచనలో అధికారులు పరిశుభ్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని పరిమిత స్థాయిలో బస్సులను నడుపుతామని రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎం వరప్రసాద్‌ పేర్కొన్నారు.

 ఎంజీబీఎస్‌కు మహర్దశ..

 నిత్యం ప్రయాణికులతో, బస్సుల రాకపోకలతో ఉండే  ఎంజీబీఎస్‌  ప్రస్తుతం బోసిపోయింది. గత 50 రోజులకు పైగా ఖాళీగా ఉన్న ఎంజీబీఎస్‌ను అధికారులు సోడియం హైపో క్లోరైట్‌తో అణువణువు శానిటైజ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రధాన మార్గంలోని వంతెనపై మరమ్మతులతో పాటు పెయింటింగ్‌ చేపడుతున్నారు. ప్లాట్‌ ఫారంలపై మార్కింగ్‌ పనులను పూర్తి చేస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్లాట్‌ఫారంలపై ఏర్పాటు చేసిన కుర్చీలు, దుకాణాలకు శానిటైజన్‌ చేశారు. కారిడార్‌లలోని ఫ్లోర్‌లను యంత్రాలతో శుభ్రపరుస్తున్నారు.

బస్సులకు శానిటైజ్‌..

  ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సు లోపలి భాగంలో  సీట్లు, రాడ్స్‌ను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరుస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. ప్రతి రోజు బస్సులను శుభ్ర పరిచిన అనంతరమే డిపో నుంచి బస్సులు కదులుతాయని పేర్కొన్నారు.   logo