సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:18:55

మెట్రో, ఆర్టీసీ బంపర్‌ ఆఫర్స్‌

మెట్రో, ఆర్టీసీ బంపర్‌ ఆఫర్స్‌

హైదరాబాద్‌ : కొవిడ్‌ -19 విజృంభణతో బస్‌పాస్‌ హోల్డర్లు నష్టపోయిన రోజులను తిరిగి వినియోగించుకునే అవకాశాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ టీఎస్‌ ఆర్టీసీ కల్పించింది. లాక్‌ డౌన్‌ సమయంలో బస్సు పాస్‌ను వినియోగించుకోలేకపోయిన జనరల్‌ బస్‌ పాస్‌ వినియోగదారులు (ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌, ఎయిర్‌ పోర్ట్‌ పుష్పక్‌ ఏసీ బస్‌ పాస్‌) పాత బస్‌పాస్‌(ఐడీ కార్డు, టిక్‌ట్‌)ను ఆయా కౌంటర్‌లో అందజేస్తే కొత్తవి ఇస్తామని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. నవంబర్‌ 30 వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.

 రేపటి నుంచి(ఆదివారం) మెట్రో బంపర్‌ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగుల దృష్ట్యా ప్రయాణికుల కోసం మెట్రో ఇటీవల నాలుగు సరికొత్త ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో రెండు ఆఫర్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా మరో రెండు ఆఫర్లు స్టోర్‌ వాల్యూ కార్డ్‌ రీచార్జ్‌ ఆఫర్‌, టీ-సవారీ ట్రిప్‌ ఆఫర్‌లు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్టోర్‌ వాల్యూ కార్డ్‌ ఆఫర్‌లో రూ.400 నుంచి రూ.800 వరకు ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ కార్డ్‌ రీచార్జ్‌ చేయిస్తే అందులో 50 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ 75 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక టీ-సవారీ యాప్‌లో ఎన్ని ట్రిప్పులకైతే డబ్బులు చెల్లిస్తామో అదనంగా మరికొన్ని ట్రిప్పులు పొందే అవకాశం ఉంటుంది. 14 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 20 ట్రిప్పులు పొందొచ్చు. 30 ట్రిప్పులు చార్జీ చెల్లిస్తే అదనంగా 15 ట్రిప్పులు యాడ్‌ వుతాయి. కాగా ఇప్పటికే అందుబాటులో ఉన్న మెట్రో సువర్ణ ఆఫర్‌, స్మార్ట్‌ కార్డు ట్రిప్‌ ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రతి మెట్రో స్టేషన్లలో ఆఫర్ల వివరాలు ఉంటాయని వివరించారు.