e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఎయిర్‌పోర్టు వరకూ.. మెట్రో కారిడార్‌

ఎయిర్‌పోర్టు వరకూ.. మెట్రో కారిడార్‌

ఎయిర్‌పోర్టు వరకూ.. మెట్రో కారిడార్‌
  • ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్‌ సిద్ధం
  • భవిష్యత్‌ ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా నిర్మాణం
  • బిజినెస్‌ డిస్ట్రిక్‌గా శంషాబాద్‌
  • త్వరలోనే గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు
  • 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం
  • సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో రూ.వెయ్యి కోట్లు కేటాయింపు
  • రెండేండ్లలోనే పరుగులు పెట్టించేందుకు అధికారుల కసరత్తు
  • విమానాశ్రయం లోపల 1500 ఎకరాల్లో ‘ఏరో సిటీ’
  • చుట్టూరా.. భిన్న రంగాల వ్యాపార, వాణిజ్య కేంద్రాలు
  • జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వెల్లువలా వేల కోట్ల పెట్టుడులు
  • విమాన, రైలు, రోడ్డు మార్గాలు ఉండటమే కారణం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యం. దానికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. మెట్రో రెండో దశలో భాగంగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి గచ్చిబౌలి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు సుమారు 31కి.మీ పొడవునా మెట్రో కారిడార్‌ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ఉంచారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు ఒకేసారి రూ.1000 కోట్లు కేటాయించడంతో ఇక మెట్రో అధికారులు రెండో దశ మెట్రోపై కసరత్తు మొదలు పెట్టారు.

శంషాబాద్‌ అంటే ఇప్పటి వరకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర బిందువు మాత్రమే. ఇక నుంచి విమానయాన రంగంలోనే కాదు విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సైతం కేంద్రంగా మారనున్నది. త్వరలోనే గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించగా ఈ పనులను ప్రారంభించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శంషాబాద్‌ విమానాశ్రయంలో కొత్తగా 1500ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ‘ఏరో సిటీ’.. నూతన వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేంద్రంగా మారనున్నది. ఇవన్నీ ప్రారంభమై.. కార్యకలాపాలు మొదలుపెడితే ఐటీ, ఐటీ అధారిత సేవలకు కేంద్రంగా మారిన గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ తరహాలోనే శంషాబాద్‌ మరో బిజినెస్‌ డిస్ట్రిక్‌ కేంద్రంగా మారనున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.

మొదటి దశలో మూడు కారిడార్‌లలో 69 కి.మీ మేర మెట్రో రైలు పరుగులు పెడుతుండగా, రెండో దశలో మరో 80 కి.మీ మేర మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. కాగా ఇందులో అత్యంత కీలకమైన కారిడార్‌గా ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ మార్గానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఇందుకోసం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్‌ మెట్రో రైలుతో పాటు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), టీఎస్‌ఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు వంటి సంస్థలతో కలిసి ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. నాలుగు సంస్థలతో కలిసి చేపట్టే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడం ద్వారా నగరం నుంచి విమానాశ్రయం వరకు మెరుగైన, అత్యంత ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

భూ సేకరణ అవసరం లేదు

31కి.మీ మేర ఉండే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌లో భూ సేకరణ అవసరం లేకపోవడంతో ఈ ప్రాజెక్టును ఎంతో వేగంగా పూర్తి చేయడమే కాకుండా సుమారు రూ.4వేల కోట్ల నిధులు వెచ్చిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని మెట్రో అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించగా, ప్రాజెక్టు ప్రారంభమైతే హెచ్‌ఎండీఏతో పాటు టీఎస్‌ఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సంస్థలు సైతం కొంత మొత్తాన్ని ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

దీనికి తోడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ద్వారా రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ప్రణాళికలను మెట్రో అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ పనులను క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిధులకు లోటు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ నిర్మాణంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా సీఎం కేసీఆర్‌ అనుకుంటున్న లక్ష్యం త్వరగానే నెరవేర్చే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

కాలుష్యరహితంగా…

హైదరాబాద్‌ మహానగరంలో వాహన కాలుష్యంతీవ్రంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో ఇప్పటికీ ఆర్టీసీ బస్సులే కీలకంగా ఉన్నాయి. ఆ తర్వాతే మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ వంటివి ఉన్నాయి. కాగా నగర శివారులోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆర్టీసీ బస్సులు 100కు పైగానే నడుస్తున్నాయి. అయితే మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిచే అవకాశం లేదు. అదే సమయంలో ప్రైవేటు వాహనాలు, క్యాబ్‌లు వేల సంఖ్యలోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వాహనాలతో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు కారిడార్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు తగ్గి కాలుష్యం తీవ్రత కొంత మేర తగ్గుతుంది. అదే సమయంలో మెట్రో రైలు అంటేనే పూర్తిగా కాలుష్య రహితం. అందుకే వీలైనంత త్వరగా విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు కారిడార్‌ను నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది.

సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా..

నగరానికి పడమర ఉన్న ఐటీ కారిడార్‌ శరవేగంగా విస్తరిస్తున్నట్లుగానే, దక్షిణాన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో నగరం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను కల్పించాలని సీఎం కేసీఆర్‌ కొన్నేండ్ల కిందటే నిర్ణయించారు. శంషాబాద్‌ కేంద్రంగా విమానయాన రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన రకరకాల కార్యకలాపాలకు అవకాశం ఉండటంతో మొదటి ప్రాధాన్యత కింద శంషాబాద్‌ వరకు మెట్రో రైలు తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్‌ మెట్రో అధికారులకు సూచించారు.

దానికి అనుగుణంగా రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌, అక్కడి ఔటర్‌ రింగు రోడ్డుకు లోపలి వైపు ఉన్న రైల్వే కారిడార్‌ కోసం సేకరించిన భూముల్లో మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించారు. తాజాగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసే పనిలో మెట్రో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

Advertisement
ఎయిర్‌పోర్టు వరకూ.. మెట్రో కారిడార్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement