సోమవారం 25 మే 2020
Hyderabad - May 24, 2020 , 01:54:32

వ్యాపారి నెట్‌బ్యాంకింగ్‌ హ్యాక్‌.. రూ.36 లక్షలు మాయం

వ్యాపారి నెట్‌బ్యాంకింగ్‌ హ్యాక్‌.. రూ.36 లక్షలు మాయం

హైదరాబాద్ : ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు ఓ వ్యాపారికి చెందిన మూడు ఖాతాల నుంచి రూ. 36 లక్షలు స్వాహా చేశారు. ఈ మూడు ఖాతాలకు ఒకే ఈ మెయిల్‌ ఐడీ ఉండడంతో హ్యాకర్లు.. ఓటీపీ రాకుండా సెల్‌ఫోన్లను కూడా పనిచేయకుండా చేశారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన వినయ్‌ అగర్వాల్‌ వృత్తిరీత్యా వ్యాపారి. ఆయనతో పాటు ఆయన భార్య, కొడుకు పేరుతో మూడు కరెంట్‌ ఖాతాలు డీసీబీ బ్యాంకులో ఉన్నాయి. ఇందులో రెండు ఖాతాలకు ఒకే ఫోన్‌ నంబర్‌ ఉండగా, మూడు ఖాతాలకు ఒకే ఈ మెయిల్‌ ఐడీని అందులో పొందుపరిచారు. వినయ్‌ అగర్వాల్‌ తరుచూ ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరుపుతుంటారు. ఈ క్రమంలో ఈ నెల 20,21,22 తేదీలలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. మూడు ఖాతాలలోని బెనిఫిషియరీ లిస్ట్‌లో ఐదు మందిని కొత్తగా చేర్చారు. ఆ తరువాత ఆ ఖాతాలకు దఫదఫాలుగా రూ.36 లక్షలు బదిలీ చేసుకున్నారు. 22వ తేదీ సాయంత్రం నెట్‌ బ్యాంకింగ్‌ ఓపెన్‌ చేసి చూడగా బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బు  కన్పించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

ఓటీపీలు రాకుండా..!

డీసీబీలోని ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌కు మూడంచెల భద్రత ఉన్నా.. తన సెల్‌ఫోన్లకు ఒక్క మేసేజ్‌ కూడా రాలేదని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లో నగదు లావాదేవీలు జరిగిన సమయంలో తమ సెల్‌ఫోన్లు పనిచేయలేదని, అది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదంటూ బాధితుడు పోలీసులకు తెలిపారు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లో ఖాతా తెరవడంతో పాటు ప్రతి లావాదేవీకి ట్రాన్జాక్షన్‌ పాస్‌వర్డ్‌ అడుగుతుంది.. బెనిఫిషియరీని కొత్తగా లిస్ట్‌లో జతచేయాలన్నా ఓటీపీ అడుగుతుంది. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఆర్థిక లావాదేవీలు స్తంభింపజేసి, వెంటనే కాల్‌సెంటర్‌ నుంచి ఖాతాదారుడికి ఫోన్‌ చేస్తుంటారు. ఇలా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లో ఇన్ని సెక్యూరిటీ సదుపాయాలున్నా.. ఎక్కడ కూడా అలాంటివి పనిచేయకపోవడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కూడా ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. దీంతో ముందుగా ఖాతాదారుడికి సెల్‌ఫోన్‌కు వచ్చే మేసేజీలు, ఈ మెయిల్స్‌పై ఆరా తీస్తున్నారు, బాధితుడి ఖాతాలలోని డబ్బంతా కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇలా జరిగేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు  ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.


logo