సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:57:56

ప్రైమరీ నుంచి.. ప్రాథమికోన్నతకు.!

ప్రైమరీ నుంచి.. ప్రాథమికోన్నతకు.!

  • మేకలమండి ప్రైమరీ స్కూల్‌ ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ 
  • మంత్రి తలసానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

బన్సీలాల్‌పేట్‌: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని సర్కారు బడులను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. భోలక్‌పూర్‌లోని మేకలమండి ఆంగ్ల మాద్యమ ప్రాథమిక పాఠశాలను ఇకపై ప్రాథమికోన్నత పాఠశాలగా మారుస్తూ హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి అప్‌గ్రేడేషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, హైస్కూల్‌ సాధన సమితి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు కలిసి శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతులమీదుగా ఉత్తర్వుల కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మేకలమండి పాఠశాలను హైస్కూల్‌గా మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని, వారి కోరిక మేరకు ప్రస్తుతం అరు, ఏడో తరగతి పెంచడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం 480మంది విద్యార్థులు ఉన్న మేకలమండి పాఠశాలలో ఐదవ తరగతి వరకు మాత్రమే ఉన్నదని, అందులో చదువు పూర్తి చేసుకున్న 70మంది విద్యార్థులు ఆరవ తరగతి చదవడానికి చాలా దూరం వెళ్లవలసి వస్తున్నదని గుర్తించామన్నారు. నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు. బన్సీలాల్‌పేట్‌ కార్పొరేటర్‌ కుర్మ హేమలత లక్ష్మీపతి, ‘ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాధన సమితి’ కన్వీనర్లు చంద్రశేఖర్‌, కో-కన్వీనర్‌లు నర్సింగ్‌రావు, వీజే.శేషగిరి రావు, పాఠశాల హెచ్‌ఎం. మల్లికార్జున్‌ రెడ్డి, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ పుల్లారావు, వైస్‌ చైర్మన్‌ వరలక్ష్మి, సభ్యులు రజిత, పృధ్విరాజ్‌, కృష్ణవేణి, గౌరి, లక్ష్మి, అనురాధ, ఎల్లేశ్‌, సుజాత, లలిత, మహేశ్వరి, మంజుల, మల్లేశ్‌ పాల్గొన్నారు.