బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 07:36:27

ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇటీవల కురిసిన వానలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలుండటంతో ముందుజాగ్రత్త చర్యగా వైద్య, ఆరోగ్యశాఖ గ్రేటర్‌ వ్యాప్తంగా 208 ఫ్లడ్స్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంపుల ద్వారా ఇప్పటికే వందలాదిమంది బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ పరిధిలో 153, రంగారెడ్డి పరిధిలో 35, మల్కాజిగిరి-మేడ్చల్‌ పరిధిలో 20చొప్పున ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు ఈ శిబిరాలను ఆయా ప్రాంతాల్లో కొనసాగించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వైద్యశిబిరాలతో పాటు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానలు, బస్తీ దవాఖానల్లో కూడా వైద్యసేవలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రత్యేక వైద్యశిబిరాలలో సాధారణ వైద్యసేవలతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పండుగల సీజన్‌ కావడంతో కొవిడ్‌ నియమాలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.