మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 05:53:44

కౌన్‌బనేగా మేయర్‌?

కౌన్‌బనేగా మేయర్‌?

  • పీఠాన్ని దక్కించుకోనున్న టీఆర్‌ఎస్‌
  • గులాబీ దళం నుంచి 
  • 31 మంది మహిళల విజయం
  • నిబద్ధత, ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారికే చాన్స్‌ 

బల్దియా ఎన్నికలు పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్‌ ఎన్నికపై పడింది. టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గులాబీ దళం నుంచి ఎవరికి చాన్స్‌ దక్కనుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంతో పలువురి పేర్లు పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే   అధిష్టానం మాత్రం నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారికే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బల్దియా ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్‌ ఎన్నికపై పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో మేయర్‌ పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడం, వారిలో ఉన్నత చదువులు చదువుకున్నవారు, రాజకీయ నేపథ్యం ఉన్నవారు కూడా అధికంగా ఉండడంతో పలువురు కార్పొరేటర్ల పేర్లు మేయర్‌ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తవుతున్న విషయం విధితమే.

ఆ తరువాతే కొత్త పాలకమండలి కొలువు దీరాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం అత్యధిక సభ్యులు బలపర్చిన అభ్యర్థికే మేయర్‌ పీఠం దక్కుతుంది. 150మంది కార్పొరేటర్లలో నేరేడ్‌మెట్‌సహా 56డివిజన్లు గెలుచుకోగా, 30మందికిపైగా ఎక్స్‌ అఫీషియోల బలం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంది. అంటే 150మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషీయోలు కలుపుకొని మేయర్‌ ఎన్నికల్లో ఇంచుమించు 200మందికి ఓటుహక్కు ఉంటుంది. అందులో టీఆర్‌ఎస్‌కే దాదాపు 90సభ్యుల బలం ఉండగా, మజ్లీస్‌కు 54, బీజేపీకి సుమారు 50మంది సభ్యుల బలం ఉంటుంది. మూడు పార్టీలు మేయర్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలిపితే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగానే మేయర్‌ పీఠాన్ని సునాయాసంగా గెలుచుకునే వీలుంది. 

లేనిపక్షంలో మజ్లీస్‌, బీజేపీల్లో ఏ ఒక్క పార్టీ గైర్హాజరైనా టీఆర్‌ఎస్‌కే లబ్ధి చేకూరుతుంది. కాగా మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 31మంది మహిళలు గెలుపొందారు. ఇందులో పలువురు రెండోసారి విజయం సాధించగా, మరికొందరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. దాదాపు అందరు మహిళా కార్పొరేటర్లు కనీసం గ్రాడ్యుయేట్‌ చదువు పూర్తి చేసుకున్నవారే ఉన్నారు. అందరికీ ఏదో విధంగా మేయర్‌ పదవిని అధిష్టించే అర్హతలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో మేయర్‌ను ఎంపిక చేయడం టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ఎవరికివారు తమ సానుకూలతలను పార్టీకి చెప్పుకుంటూ పదవికోసం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.  

మేయర్‌ రేసులో ఉన్నారంటూ కొందరు మహిళా కార్పొరేటర్ల పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారివారి నేపథ్యాలను పేర్కొంటూ పార్టీ వారిలో ఒకరిని ఎంపికచేసే అవకాశముందని పేర్కొంటున్నారు. అయితే క్రమశిక్షణ, స్వతంత్రంగా పనిచేయగల నేర్పు, పార్టీపట్ల నిబద్ధత, ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారినే టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే ఇందులో కూడా తీవ్ర పోటీ నెలకొనడంతో చివరికి పార్టీ ఎవరిని ఎంపికచేస్తుందో వేచి చూడాల్సిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీ వరకు ప్రస్తుత పాలకమండలికి గడువు ఉండడంతో ఈ తరువాతే మేయర్‌ ఎన్నిక జరిగే ఆస్కారముందని అధికార వర్గాలు  చెబుతున్నాయి.