బంజారాహిల్స్, జూలై 11: పెండ్లి చేసుకుంటానని నమ్మించి సినీనటిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(25) సినిమాల్లో నటించేందుకు ఆరునెలల కిందట నగరానికి వచ్చింది. నల్లకుంటలోని బంధువు ఇంట్లో ఉంటూ ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నది. అదే సినిమాలో నటిస్తున్న మాలపాటి రామకృష్ణ(24)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి రహ్మత్‌నగర్‌లోని తన గదికి తీసుకువెళ్లి, పెండ్లి పేరుతో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.
సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి.. ఇప్పుడే పిల్లలు వద్దు.. అంటూ ఆమెకు అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత యువతిని అనుమానిస్తూ వేధించసాగాడు. నల్లకుంటలోని తన గదిలో ఉండగా అక్కడికి వచ్చిన రామకృష్ణ ఆమెపై దాడికి దిగడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. పెండ్లి చేసుకునేది లేదంటూ వేరొకరితో సంబంధాన్ని అంటగట్టాడు. పెండ్లి పేరుతో మోసం చేసి, లైంగికదాడికి పాల్పడిన రామకృష్ణపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376(2) (ఎన్), 452, 312, 417, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.