బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 07:40:25

పెండ్లి చేసుకుంటానని నమ్మించి...

పెండ్లి చేసుకుంటానని నమ్మించి...

ఖైరతాబాద్‌  :  ప్రేమించి.. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు..గర్భవతిని చేసి అబార్షన్‌ కూడా చేయించాడు.. యువతి పెండ్లి మాట ఎత్తేసరికి దాటవేసి.. మరో యువతితో పెండ్లికి సిద్ధమయ్యాడు.. విషయం తెలుసుకున్న బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ నిరంజన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం, చిన్నముప్పారం గ్రామానికి చెందిన పి. గురువయ్య (30) కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌కు చెందిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

రెండేండ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా ముమిపేట మండలం, మల్‌రెడ్డిగూడెంకు చెందిన యువతి (24)తో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. సదరు యువతి మలక్‌పేటలోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్‌ విద్యనభ్యసిస్తుంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారగా, ఇద్దరు కలిసి తిరిగారు. పంజాగుట్టలోని ఓ లాడ్జిలో సైతం ఇద్దరు గడిపారు. ఫలితంగా గర్భం దాల్చింది. విషయం ప్రియుడికి చెప్పగా.. సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో  అబార్షన్‌ కోసం యత్నించగా వైద్యులు నిరాకరించారు. దీంతో గురువయ్య..అబార్షన్‌ టాబ్లెట్‌ తీసుకువచ్చి ఇవ్వగా, ఆమెకు గర్భస్రావం జరిగింది. అనంతరం పెండ్లి చేసుకోమని యువతి కోరగా.. అతను దూరం పెట్టాడు. ఇటీవల అతనికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 8న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా.. బుధవారం నిందితుడు గురువయ్య పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, చూపించిన సాక్ష్యాలతో అతనిపై సెక్షన్‌ 376, 312, 420 కింద కేసు నమోదు చేశారు.


logo