సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 18, 2020 , 09:41:38

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం... నిందితుడు అరెస్ట్‌

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం... నిందితుడు అరెస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన నిందితుడిని ఢిల్లీలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి.. శనివారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు పంపారు. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి వివరాల ప్రకారం..నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి తాము నౌకరీ డాట్‌ కామ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. మీ విద్యార్హతలకు మా వద్ద భారీ వేతనంతో కూడిన ఉద్యోగం ఉంది .. చేరాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు ఇతర ప్రక్రియలకు డబ్బు పంపాలని కోరారు. ఇలా అతడి నుంచి మొత్తం రూ.96,563  వాలెట్‌ ద్వారా తీసుకున్నా రు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. దీంతో తాను మోసపోయాన ని బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు మోసానికి పాల్పడ్డ సచిన్‌ యాదవ్‌ను ఢిల్లీలో పట్టుకున్నారు. నిందితుడు నుంచి ల్యాప్‌టాప్‌,8 మొబైల్‌ ఫోన్‌లు, రెండు డెబిట్‌ కార్డులు, 6 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.నిందితులు వివిధ వెబ్‌సైట్‌ల నుంచి నిరుద్యోగుల డాటాను తీసుకుని వారికి ఫోన్‌లు చేసి భారీ జీతంతో కూడిన ఉద్యోగాన్ని కల్పిస్తున్నామని నమ్మించి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌  చేస్తుంటారు.