శుక్రవారం 15 జనవరి 2021
Hyderabad - Dec 02, 2020 , 06:36:35

పట్టించుకోని పాతబస్తీ

పట్టించుకోని పాతబస్తీ

  • రాజకీయ పార్టీలపై ఓటరు అనాసక్తి
  • భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం
  • ఆటోలు పెట్టినా ఫలించని పతంగి వ్యూహం

హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పోలింగ్‌లో రాజకీయ పార్టీలపై పాతబస్తీ ఓటరు అనాసక్తి కనబరిచాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మందకొడిగానే సాగిన ఓటింగ్‌ ఆ తరువాత కొంత వేగవంతమైనప్పటికీ ఆనవాయితీ కంటే కూడా ఓటింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. పాతబస్తీ వాసులు ఓటింగ్‌కు దూరంగా ఉండి నాయకులపై తమకున్న ఉన్న అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తపరిచారు. ఏ రాజకీయపార్టీపై కూడా వారు పెద్దగా  మొగ్గుచూపలేదు. ఎవరు గెలిచినా తమకు ఒరిగేదేమి లేదనే భావన పాతబస్తీ ఓటర్ల నోట వినబడింది. గెలిచిన వారు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ఉన్నవారు తమ అనునాయులకే పరిమితం కావడం, ఏదైనా పనికోసం వెళ్లిన స్థానిక ప్రజలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, కొంత మంది పనులు చేయడానికి డబ్బులు ఆశించడం తదితర వాటితో పాతబస్తీ ఓటర్లు నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

అంతే కాకుండా ఇటీవల వచ్చిన వరదలు కూడా రాజకీయ పార్టీల కొంపముంచినట్లు చెప్పుకోవచ్చు. పాతబస్తీలోని ఏ ప్రాంతవాసులను కదిలించినా వరదలొచ్చి, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని అలాంటప్పుడు మేమెందుకు వెళ్లి వారికి ఓటు వేయాలని బాహటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాతబస్తీ ఓటరు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ లేడు. వారి దృష్టిలో అన్ని పార్టీలు ఒకే కోవకు చెందినవనే భావన మంగళవారం నాటి పోలింగ్‌తో అవగతమవుతోంది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా పాతబస్తీలో ఓటింగ్‌ శాతం తగ్గడంతో పలు రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా చార్మినార్‌, బహుదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాల్లో ఉన్న దాదాపు డివిజన్లు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా  ఈ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్‌ వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుగా అధిక శాతం ఓటింగ్‌ నమోదవుతుంది. కానీ ఈసారి ఓటర్లు ఓటు వేసేందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని డివిజన్లలో ఓ రాజకీయ పార్టీ ఆటోలను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఓటర్లు విముఖత చూపడంతో సదరు పార్టీ కంగుతిన్నది.  

వెంటాడిన కరోనా భయం 

ఓటర్ల మనోగతం అటుంచితే చాలా మందిని కరోనా భయం వెంటాడింది. ఈ మధ్యకాలంలో దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలు, నగరంలో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు లేకపోలేదనే హెచ్చరికల నేపథ్యంలో నగర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వచ్చేందుకు సాహసించలేదు. అనవసరంగా రిస్క్‌ తీసుకోవడం ఎందుకని ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.