శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 04, 2020 , 02:28:18

ఎన్నికలఫలితాలపై జోరుగా బెట్టింగులు!

ఎన్నికలఫలితాలపై  జోరుగా బెట్టింగులు!

  • ఖరీదైన కార్లు... విదేశీ ప్రయాణాలంటూ ఆఫర్లు
  • లేదంటే ఖరీదైన మద్యం బాటిళ్లు, డబ్బు అంటూ ఒప్పందం
  • కోట్ల రూపాయలు చేతులు మార్చుకుంటున్న టీమ్‌లు

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్థుల జయాపజయాలకోసం జోరుగా బెట్టింగులు కడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని మూడు డివిజన్‌ అభ్యర్థుల విజయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. పోటీలో ఉన్న ఒకపార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని కొందరు, అపజయం పాలవుతారని మరికొందరు బెట్టింగులకు పాల్పడుతున్నారు. తార్నాక, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్‌లలోని రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల తరపున బెట్టింగుల జోరు నడుస్తుంది. ఇందులో ప్రధానపార్టీ అభ్యర్థి  గెలుస్తాడని కొందరు, కాదు.. కాదు.. కొత్తగా ఎదుగుతున్న పార్టీ విజయం సాధిస్తుందని మరికొందరు ధీమాగా చెబుతున్నారు. 

ఖరీదైన కార్లంటూ...

తాము చెప్పిన అభ్యర్థే గెలుస్తాడు.. ఒకవేళ ఓడిపోతే ఫలాన కంపెనీకి చెందిన ఖరీదైన కారు కొనిస్తానని, విజయం సాధిస్తే నువ్వుకూడా అదే కంపెనీ కారు కొనివ్వాలని బెట్టింగులు పెట్టుకుంటున్నారు. కాకపోతే ఎక్స్‌షోరూం  రేటు ఇస్తామని, మిగిలిన ట్యాక్స్‌లు చెల్లించుకోవాల్సి ఉంటుందని నిబంధనలు పెట్టుకుంటున్నారు. మరికొందరు విదేశీ ప్రయాణాలు చేయించాలని, వారం రోజుల పాటు ప్రయాణ ఖర్చులతో పాటు ఆయా దేశాల్లో వచ్చే ఖర్చంతా భరించాలని మాట్లాడుకుంటున్నారు. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం సొంత  ఖర్చులు పెట్టుకోవాలని నిర్ణయానికి వస్తున్నారు. మరికొందరు మాత్రం అంతంత ఖర్చులు భరించలేనివారు ఇక్కడే ఖరీదైన జానీవాకర్‌ లాంటి మద్యం బాటిళ్లు కొనివ్వాలని , మరికొందరు నగదు బెట్టింగులు పెట్టుకుంటున్నారు. ఈమేరకు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు.  ఎన్నికలకు ముందు   రాష్ట్రం దాటి మూడు ముక్కలాట ఆడేవారు .. ఇప్పుడు ఎన్నికల గెలుపోటముల విషయంలో బెట్టింగులు కట్టుకుంటున్నారు. సికింద్రాబాద్‌  నియోజకవర్గంలో ఉన్న ఒక ప్రధాన టీం బెట్టింగ్‌ల విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.


logo