గురువారం 04 మార్చి 2021
Hyderabad - Jan 22, 2021 , 07:58:34

సిమ్‌ స్వాపింగ్‌.. ఖాతాలు లూటీ

సిమ్‌ స్వాపింగ్‌.. ఖాతాలు లూటీ

  • ఆ వివరాలతో కొత్త సిమ్‌లు..
  • నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా అసలు యజమానుల ఖాతాలు ఖాళీ
  • 2011 నుంచి నేరాలు..
  • ఐదుగురు అరెస్ట్‌... పరారీలో మరో ఇద్దరు

నైజీరియాకు చెందిన సైబర్‌ నేరగాడు ఫిషింగ్‌ మెయిల్స్‌తో కంపెనీలు, యజమానుల డాటాను తస్కరించి..ముంబైలో ఉండే ముఠా సభ్యులకు చేరవేసేవాడు.. ఈ ముఠా సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడి యజమానుల బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులు కాజేశారు... ఇలా.. 2011 నుంచి సిమ్‌ స్వాపింగ్‌లకు పాల్పడుతూ లక్షలకు లక్షలు కొల్లగొట్టారు.. ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో వారి గుట్టును సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం బయటపెట్టారు. ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌ చేయగా... నైజీరియాకు చెందిన ప్రధాన సూత్రధారితోపాటు ముంబైకి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

 గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌ కేసు వివరాలు వెల్లడించారు..  నైజీరియాకు చెందిన జేమ్స్‌.. ముంబైకి చెందిన చంద్రకాంత్‌ సిద్ధాంత్‌ కాంబ్లే, జమీర్‌ అహ్మద్‌, షోయబ్‌ షేక్‌, ఆదిల్‌ హాసన్‌ అలీ సయ్యద్‌, జునైద్‌ అహ్మద్‌ షేక్‌, అశ్విన్‌ నారాయణ షేర్‌గార్‌తో ముఠాను ఏర్పాటు చేశాడు. ముందుగా.. జేమ్స్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేరు మీద ఫిషింగ్‌ మెయిల్స్‌ సృష్టించి .. వాటిని కంపెనీలు, సంస్థలకు పంపిస్తాడు. వాటిలోని లింక్‌ క్లిక్‌ చేయగానే అందులో ఉండే మాల్‌వేర్స్‌ వారి కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రవేశించి మొత్తం సమాచారం జేమ్స్‌ కు వస్తుంది. ఇలా.. జేమ్స్‌  ఆయా సంస్థల నెట్‌ బ్యాంక్‌ వివరాలతో పాటు వాటి రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్ల వివరాలను తన ముఠాకు పంపిస్తాడు. 

ఆ ముఠా సభ్యులు.. వాటికి సంబంధించిన ఇతర వివరాలను సేకరించి.. వాటి జిరాక్స్‌ పత్రాల ద్వారా.. అసలు యజమాని, సంస్థల ఫోన్‌ను డియాక్టివేట్‌ చేసి.. వారి నెట్‌బ్యాంకింగ్‌లకు రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్ల మీద కొత్త సిమ్‌లను తీసుకుంటారు.. ఈ కొత్త సిమ్‌లతో వివిధ సంస్థ లు, కంపెనీల నెట్‌బ్యాంకింగ్‌లకు రిజిస్టర్‌ చేసుకుని ఖాతాలను యాక్టివేట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత అసలు యజమానికి తెలియకుండా నెట్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయి పాస్‌వర్డు, యూజర్‌ ఐడీని మార్చేసి.. వాటి ఓటీపీలు, పిన్‌ నంబర్లు వారికి వచ్చేలా మార్చుకుని వారాంతపు శనివారం సాయంత్రం, ఆదివారం ఆ బ్యాంకు ఖాతాల నుంచి  ఆన్‌లైన్‌లో కొల్లగొడుతారు. ఈ రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో డ్రాచేసిన డబ్బంతా.. తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు. అనంతరం బిట్‌ కాయిన్స్‌, హవాలా మా ర్గం లో జేమ్స్‌కు అతడి వాటాను పంపిస్తారు. ఇలా.. ఈ ముఠా 2011 నుంచి సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో తేలిం ది. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్‌ చేయగా ప్రధాన సూత్రధారి జేమ్స్‌, ముంబైకి చెందిన షోయబ్‌ షేక్‌ పరారీలో ఉన్నారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం అదనపు డీసీపీ ఇందిర, ఇన్‌స్పెక్టర్‌లు శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌వర్ధన్‌ పాల్గొన్నారు. నిందితుల నుంచి భారీ ఎత్తు నకిలీ ధ్రువీకరణ పత్రాలు, మొబైల్‌ ఫోన్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

బయటపడింది ఇలా...

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ వ్యాపా రి.. గత ఏడాది జూన్‌లో జియో సిమ్‌ తీసుకున్నాడు. అయితే.. ఈ సిమ్‌ ద్వారా కేవలం ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ మాత్రమే వెళ్తుండగా..ఇన్‌కమింగ్‌ రావడం లేదు. దీని కోసం జియో కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకున్నాడు. ఆ తర్వాత తన ఇంటర్నెట్‌ బ్యాం కింగ్‌ కోసం లాగిన్‌కు యత్నించగా కాలేదు.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని మార్చేశారని గుర్తించి.. మళ్లీ తన డెబిట్‌ కార్డు వివరాలతో లాగిన్‌ అయ్యాడు.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తనిఖీ చేయగా.. ఖాతా నుంచి 3 లావాదేవీల్లో 4.25 లక్షలు డ్రా అయ్యాయని గుర్తించి.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

నగరానికి చెందిన ఓ వ్యాపారి ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చిం ది. అందులో తన నంబర్‌ నుంచి కొత్త సిమ్‌ కోసం విజ్ఞప్తి వచ్చిందని ఉంది.. అయితే ఈ సిమ్‌ యాక్టివేట్‌ కావడానికి 4 రోజుల సమయం పడుతుంది.. అప్పటి వరకు జియో యాప్‌ లేదా WWW.JIO/GETMYJIO క్లిక్‌ చేయాలని ఉంది.. ఆ తర్వాత .. మరో మెసేజ్‌ వచ్చింది.. మీ విజ్ఞప్తి మేరకు జియో సిమ్‌ నాలుగు రోజుల్లో రెడీగా ఉంటుంది.. అప్పటి వరకు మీ పాత సిమ్‌ బ్లాక్‌లో ఉంటుందని మెసేజ్‌లో పేర్కొన్నారు. సిమ్‌ బ్లాక్‌ విషయంపై జియో స్టోర్‌ లో సంప్రదించి.. కొత్త సిమ్‌ కావాలని కోరాడు. ఆ సమయంలో సిమ్‌లు లేకపోవడంతో తర్వాత తీసుకుందామనుకున్నాడు. ఇంతలో అతడి ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చా యి. తన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి రూ.6.75 లక్షలు గుర్తు తెలియని ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా.. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టును బయటపెట్టారు. 


VIDEOS

logo