ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 02, 2020 , 23:40:26

లాక్‌డౌన్‌.. డ్రోన్‌ పట్రోలింగ్‌

లాక్‌డౌన్‌.. డ్రోన్‌ పట్రోలింగ్‌

  • 400 అడుగుల ఎత్తు నుంచి దృశ్యాలు చిత్రీకరణ
  • సైబరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీ
  • పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రయోగం
  • రాచకొండలో కంట్రోల్‌ రూం నుంచి నిఘా
  • సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ గస్తీని సమర్థవంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్‌ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మొదటి సారిగా హైదరాబాద్‌లో సైబరాబాద్‌ పోలీసులు లాక్‌డౌన్‌ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు గురువారం ఉపయోగించారు. ఈ నేపధ్యంలో సైబరాబాద్‌ పోలీసులు నిజాంపేట్‌, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన డ్రోన్‌ కెమెరాను ఉపయోగించుకుని డ్రోన్‌ గస్తీని నిర్వహించారు. ఈ డ్రోన్‌ కెమెరాకు సైరన్‌ పలికే అవకాశం ఉండడంతో గల్లీలలో లాక్‌డౌన్‌ పాటించకుండా గుంపులు...గుంపులుగా ఒక దగ్గరకు చేరి మాట్లాడుకుంటు కరోనా వ్యాప్తికి అస్కారం కల్పిస్తున్నారు. 

దీనిని అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీసులు డ్రోన్‌ కెమెరాలకు విడియో, సైరన్‌ను ఉపయోగించి కాలనీ, బస్తీ గల్లీలలోకి పంపి గుంపులు గుంపులుగా ఉన్న వారిని పరుగులు పెట్టించారు. అయితే దీనికి ఆడియో రికార్డర్‌ను కూడా జోడించి అనౌన్స్‌మెంట్‌ చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఈ డ్రోన్‌ గస్తీతో లాక్‌డౌన్‌ను సైబరాబాద్‌లో మరింతగా పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ డ్రోన్‌ అందే చిత్రాల ద్వారా పోలీసులు నిబంధనలను ఉల్లంఘించే వారిని సులభంగా గుర్తించి వారి పై చర్యలు తీసుకోనున్నారు.  ఈ డ్రోన్‌ కెమెరా దాదాపు అనుమతి ఉన్న ప్రకారం 400 అడుగుల ఎత్తు వరకు ఎగిరి అక్కడి నుంచి దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరించనుంది. గురువారం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ మూడు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఉన్న వారిని గుర్తించి వారిని ఇండ్లలోకి పంపించారు.

కరోనా నియంత్రణలో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. సైబరాబాద్‌ పోలీసులు సైయెంట్‌ కంపెనీ రూపొందించిన డ్రోన్‌ టెక్నాలజీ కెమెరాల ద్వారా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, విధుల్లో ఉన్న వారికి థర్మల్‌ టెస్టింగ్‌తో వారి శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. ఎవరైనా కరోనా అనుమానితులు ఉన్నారా అనే విషయాన్ని ఈ టెక్నాలజీ ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది.


రాచకొండలో...

ప్రజలు కరోనా బారిన పడకుండా రాచకొండ పోలీసులుఅన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24/7 ప్రతి దృశ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. వీటి ద్వారా ఒక ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, మరో 30 మంది సిబ్బందితో కలిసి ఈ కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద జనాలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు గుమిగూడితే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు, పోలీస్‌స్టేషన్‌కు, పెట్రోలింగ్‌ సిబ్బందికి తెలియజేస్తారు. దాదాపు వెయ్యి కూడళ్ల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.  కరోనా వ్యాప్తి జరగకుండా రాచకొండ పోలీసులు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 


logo