e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ కట్టడికి కట్టుబడి

కట్టడికి కట్టుబడి

కట్టడికి కట్టుబడి

స్వచ్ఛందంగా సహకరించిన జనం
జయహో జనతా
లాక్‌డౌన్‌కు ప్రజల సంపూర్ణ మద్దతు
ఇండ్ల నుంచి బయటకు రాని జనం
కరోనా నియంత్రణకు సహకారం
నాలుగుగంటల్లోనే ఊపందుకున్న కొనుగోళ్లు
ఉదయం 10 గంటలకు దుకాణాల మూత
యథావిధిగా ప్రభుత్వ సేవలు, బ్యాంకులు
అత్యవసర సేవలకు మినహాయింపు

కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న పోరుకు సకలజనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. అంతా ఒక్కటై వైరస్‌ను పారదోలేందుకు సమాయత్తమైంది. మహమ్మారి నియంత్రణకు సర్కారు విధించిన లాక్‌డౌన్‌ తొలిరోజు బుధవారం విజయవంతమైంది. నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆ నాలుగు గంటలే దుకాణాలు తెరిచి, ఆ తర్వాత స్వచ్ఛందంగా మూసివేశారు. 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయగా, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగసంస్థలు నిర్ణీత సమయంలో సేవలందించాయి. అత్యవసర సేవలు, టీకాలు, కరోనా నిర్ధారణ పరీక్షలకు మాత్రం అనుమతిచ్చారు. గ్రేటర్‌వ్యాప్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ బోసిపోగా, అరకొరగా వచ్చిన వాహనాల వివరాలను అడిగి తెలుకున్నారు. నిరుడు లాక్‌డౌన్‌తో పోల్చితే ఈ లాక్‌డౌన్‌లో ప్రజల్లో క్రమశిక్షణ బాగా పెరిగిందని పోలీసు ఉన్నతాధికారులే వ్యాఖ్యానించారు. అత్యవసర వాహనాల కోసం జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లోని పెట్రోల్‌ బంకులను తెరిచే ఉంచారు.

బ్యాంకు వేళల్లో స్వల్ప మార్పు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల పనివేళల్లో స్వల్ప మార్పు చేశారు. గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయనున్నాయి. రొటేషన్‌ పద్ధతిలో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఏటీఎంలు, డిపాజిట్‌ మిషన్లు 24 గంటలపాటు పనిచేయనున్నాయి.

ప్రజల నుంచి ఈసారి సంపూర్ణ మద్దతు నగర సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. నిరుడు లాక్‌డౌన్‌కు, ఇప్పటి లాక్‌డౌన్‌కు తేడా కన్పిస్తున్నదని, ప్రజలు అనవసరంగా బయట తిరగకపోవడంతో మొదటిరోజు బుధవారం కేసులు రాసే అవసరం రాలేదని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో భౌతికదూరం పాటించాలని, అవసరం లేకుండా రోడ్లపై తిరగవద్దని సూచించారు. కాగా నమాజ్‌ను ఇండ్లలోనే చేసుకోవాలని, మసీదుల్లో నిబంధనలు పాటిస్తూ నలుగురు ప్రార్థన చేసుకోవచ్చని నగర సీపీ సూచించారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి

లాక్‌డౌన్‌కు ప్రజల మద్దతు అభినందనీయం. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందలేదు. నిబంధనలు పాటిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూం 9490617440 ను సంప్రదించవచ్చు. -సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ

నిబంధనలను విస్మరించలేదు

లాక్‌డౌన్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిచ్చారు. నిబంధనలు విస్మరించి ఎవరూ రోడ్లపైకి రాలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు 10 గంటలకల్లా మూతబడ్డాయి. అత్యవసర సేవలకు అనుమతించాం. పోలీస్‌ సహాయానికి రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ రూం 9490617234 లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయొచ్చు. -మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌

అప్పటి వరకు ఉరుకులు, పరుగులు ..బస్తీలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో వాహనాల రాకపోకలతో సందడే సందడి…. సూపర్‌మార్కెట్లు, కిరాణాషాపులు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు…ఇలా అన్ని వ్యాపార కేంద్రాల్లో జనసందోహమే.. సమయం ఉదయం 10 గంటలు….హడావుడిగా దుకాణాల మూత.. రహదారులన్నీ నిర్మానుష్యం…నాలుగు గంటల పాటు జన సంచారంతో కిటకిటలాడిన రోడ్లన్నీ బోసిపోయాయి. తెరిచిన షాపులన్నీ మూతబడ్డాయి. బస్సులు డిపోలకు తరలిపోయాయి. ఇలా తొలి రోజు లాక్‌డౌన్‌ నగరవ్యాప్తంగా కఠినంగా అమలైంది. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. స్వీయ నిర్బంధం పాటించి.. మహమ్మారిపై కలిసికట్టుగా రణభేరి మోగించారు. నిబంధనలను అనుసరించి.. నిర్దేశించిన సమయం తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఇంటిల్లిపాది కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు.

అత్యవసర సేవలకు అనుమతి

పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెటింగ్‌, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అనవసరంగా ఎవరూ రహదారులపై తిరగకుండా చూశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా, అత్యవసర సేవలకు అధికారులు అనుమతించారు. వైద్యశాలలు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌, కేబుల్‌, ఐటీ, పెట్రోల్‌, గ్యాస్‌ బంకులు, విద్యుత్‌ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య విభాగం తదితర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.

కొనసాగిన ప్రభుత్వ సేవలు

గ్రేటర్‌ వ్యాప్తంగా 33 శాతం ఉద్యోగులతో ప్రభుత్వ సేవలు కొనసాగాయి. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి ఆర్టీఏ సేవలు అందాయి. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లను పది రోజుల పాటు నిలిపివేయడంతో సంబంధిత కార్యాలయాల్లో సందర్శకుల తాకిడి నిలిచిపోయింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కట్టడికి కట్టుబడి

ట్రెండింగ్‌

Advertisement