సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 14, 2020 , 00:11:33

ఇంట్లో ఉండి జయిద్దాం..

ఇంట్లో ఉండి జయిద్దాం..

హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌లు పంపిణీ

ఇప్పటికే పదిహేను వేల వరకూ అందజేత

సిద్ధంగా మరో ఐదు వేలు 

ఎంతమందికైనా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

బల్దియా వెబ్‌సైట్‌లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సమాచారం

కరోనా పాజిటివ్‌ వచ్చినా.. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇంటికే ఐసొలేషన్‌ కిట్‌లు పంపిస్తున్నారు. అందులోని మందులు సమయానికి వేసుకుని, పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాధిని జయించవచ్చు. ఇప్పటికే 15 వేల మందికి కిట్‌లు పంపిణీ చేయగా, మరో ఐదు వేలు సిద్ధంగా ఉన్నాయి. అవసరం మేరకు  ఎన్ని కిట్లు పంపిణీ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటికి వెళ్లి బల్దియా సిబ్బందే వీటిని అందజేస్తున్నారు.     -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారికి సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. హోం ఐసొలేషన్‌ కిట్లను ఉచితంగా అందజేస్తున్నది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.

ఇంటికే వెళ్లి... 

పాజిటివ్‌ వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేస్తున్నది బల్దియా. ఇప్పటికే 15వేల మందికి పంపిణీ చేయగా, మరో ఐదు వేలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు వైద్యశాఖ లెక్కల ప్రకారం.. ఇంకా 12వేల మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. కాగా, అవసరాల మేరకు ఎన్ని కిట్లు అయినా పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వారి ఇండ్లకు వెళ్లి సిబ్బందే వీటిని అందిస్తున్నారని చెప్పారు.

కిట్‌లో ఏమి  ఉన్నాయంటే...

ఈ కిట్‌లో  విటమిన్‌-సీ టాబ్లెట్స్‌ -34, జింక్‌ మాత్రలు-17, బీ-కాంప్లెక్స్‌ మాత్రలు-17, క్లాత్‌ మాస్కులు-6, శానిటైజర్‌-1, డెటాల్‌ లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌- 1,  గ్లోవ్స్‌ - రెండు జతలు, సోడియం హైపోక్లోరైట్‌ ద్రవం బాటిల్‌

-1, హోం  ఐసొలేషన్‌ నియమాలతో కూడిన బ్రోచర్‌ ఉన్నాయి. కిట్‌ కవర్‌పై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను  స్కాన్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌-19 నియంత్రణ కోసం సూచించిన సలహాలు, సూచనలు లభిస్తాయి. కాగా కరోనా పాజిటివ్‌ నమోదైన వారికి ఆరోగ్య సిబ్బంది ద్వారా కిట్లను నేరుగా ఇంటికి వెళ్లి అందజేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆయా ప్రాంతాల వైద్యాధికారుల పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. 

పాజిటివ్‌ కేసుల సమాచారం...

 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. రోగి ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిసే విధంగా వార్డు, సర్కిల్‌, జోన్‌ సమాచారాన్ని పొందుపర్చినట్లు పేర్కొన్నారు. వాటిని రోజువారీగా అప్‌డేట్‌ చేయనున్నట్లు చెప్పారు. 


logo