శనివారం 08 ఆగస్టు 2020
Hyderabad - Aug 02, 2020 , 00:49:47

ఆ ‘ఇరుకు’ బాధలు తప్పేలా..

 ఆ ‘ఇరుకు’ బాధలు తప్పేలా..

త్వరలో మౌలాలి కమాన్‌ రోడ్డు విస్తరణ పనులు

భూసేకరణకు రూ. 3.54 కోట్ల నిధులు మంజూరు

14 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత

మల్కాజిగిరి : చారిత్రాత్మక కట్టడమైన మౌలాలి కమాన్‌ విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కమాన్‌ మధ్య నుంచి ఇరువైపులా 50 ఫీట్ల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. ఆస్తినష్టం జరిగిన 14మంది లబ్ధిదారులకు  రూ. 3 కోట్ల 54లక్షల పరిహారాన్ని ఆగస్టు 15 వరకు చెక్కులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. నష్టపరిహారం అందించిన వెంటనే విస్తరణ పనులను చేపట్టే ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. 

10 ఏండ్ల సమస్యకు పరిష్కారం..

దశాబ్ద కాలంగా నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనున్నది. విస్తరణ పనుల సమస్యలను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం నిధులను మంజూరు చేయించారు. 

భారీ వాహనాలకు అనుమతి...

కమాన్‌ విస్తరణ పనులు పూర్తయితే భారీ వాహనాలకు అనుమతితో పాటు సిటీ బస్సులను తిరిగి పునరుద్ధరించనున్నారు. దీంతో ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా మారనున్నది. ఈసీఐఎల్‌, కుషాయిగూడ, కాప్రా ప్రజలు మౌలాలి మీదుగా మల్కాజిగిరి, తార్నాక, సికింద్రాబాద్‌ వెళ్లేందుకు దూరం తగ్గనుంది. 

మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు

మౌలాలి కమాన్‌ విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వం భూ సేకరణకు రూ. 3 కోట్ల 54లక్షల నిధులను మంజూరు చేసింది. 14 మంది లబ్ధిదారులకు త్వరలోనే నష్ట పరిహార చెక్కులను అందజేస్తాం. పనులను వెంటనే ప్రారంభిస్తాం. సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.

- ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 


logo