సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. వందలో 95 మంది కుడిచేతికి పనిచెబితే.. మిగిలిన వాళ్లంతా ఎడమచేతితోనే పనులు చేస్తారు. అరుదుగా కనిపించే లెఫ్ట్ హ్యాండర్స్‌లో ప్రధానంగా విద్యార్థులే ఉంటారు. ఎందరో ప్రముఖులు, దేశాధ్యక్షులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే, అందుబాటులో ఉన్న స్టేషనరీ సహాయంతో వీరు కుడి చేతితో రాసినంత సులభంగా ఎడమచేతితో రాయలేరు. ఇబ్బంది పడుతుంటారు. వీరి ఇబ్బందులను ఓ సంస్థ దూరం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెన్ను, పెన్సిల్, కత్తెర, స్కేలు వంటి స్టేషనరీని సందీప్‌సింగ్, పవిత్తర్ సింగ్ దంపతులు అందిస్తూ తగిన పరిష్కారం చూపుతున్నారు . ఎడమ చేతి వాటం వారు ఉపయోగించే వస్తువులను ప్రత్యేకంగా ‘లెఫ్ట్ హ్యాండ్ షాప్’ అనే స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. తమ పిల్లాడి ఇబ్బందికి పరిష్కారం చూపే ప్రయత్నంలో ఎంతో మంది విద్యార్థులకు సామగ్రిని అందించగలుగుతున్నారీ దంపతులు.
సాధారణంగా కుడి చేతివాటం గల వారు ఉపయోగించే స్కేలు మీద.. 1నుంచి15 సెం.మీ. వరకు మార్కింగ్ ఉంటుంది. అదే ఎడమ చేతి వాటం వారి కోసం ఇక్కడ లభించే స్కేలు పైన రివర్స్‌లో 15 నుంచి 1 వరకు సెం.మీ. మార్కింగ్ డిజైన్ చేశారు. ప్రత్యేకంగా ప్లేయింగ్ కార్డులు, పెన్ను గ్రిప్, కత్తెర గ్రిప్, షార్ప్‌నర్ బ్లేడ్లు వేరుగా అపోజిట్ డైరెక్షన్లో తయారు చేస్తారు. పెన్సిల్‌ను ఫార్వర్డ్ డైరెక్షన్లో.. చెక్కాల్సి ఉంటుంది. ఎడమ చేతితో రాసే విద్యార్థులకు అనుకూలంగా ఉండే పెన్ను, పెన్సిల్, రూలర్, స్కేళ్లు, కట్టర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్, కత్తెర, ఇతర స్టేషనరీ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఎడమచేతి వాటం పిల్లల కోసం ఆన్లైన్ విధానంలో ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన స్టేషనరీ సామగ్రిని కొనుక్కోవచ్చు.
నా చిన్న వయసులోనే పెన్నుతో రాయడం, పేపర్ కట్ చేయడం, పెన్సిల్ చెక్కడానికి ఇబ్బంది పడ్డాను. అది సరిగ్గా రాకపోయేది. నాకు జెల్ పెన్ వాడే అలవాటు. ఆ పెన్నుతో రాస్తే చేతికి ఇంక్ అంటేది. అది కాస్తా పేపర్‌పై అంటుకునేది. నా ఇబ్బందిని చూసి గ్రిప్ వచ్చే విధంగా ఉండే వస్తువులను కొనిచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ప్రత్యేకంగా లెఫ్ట్ హ్యాండర్స్ వినియోగించే వస్తువులు అందుబాటులో ఉన్నా యి. ఏ ఇబ్బంది లేకుండా కత్తిరించడం, రాయడం, పెన్సిల్ చెక్కడం, లైన్లు గీయడం వంటివి చేయగలుగుతున్నాను. – గురిందర్ సింగ్, విద్యార్థి
మా అబ్బాయి నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పెన్‌తో రాయడానికి ఇబ్బంది పడటం కనిపించింది. హోం వర్క్ చేయడం ఆలస్యమవుతుంది. రాయడం ఆపేవాడు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌పై కూడా ఆసక్తి ఉండేది. అయితే, ఎడమ చేతితో రాయడం, కత్తిరించడం కోసం పడుతున్న ఇబ్బందిని చూసి బాధపడ్డాం. ఇది దృష్టిలో ఉంచుకొని స్టేషనరీ సామగ్రి ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందని ఇంటర్ నెట్లో, ఇతర విధానాల ద్వారా తెలుసుకున్నాం. అలా మా అబ్బాయి కోసం చేసిన ప్రయత్నం ఇతర పిల్లలకు కూడా ఉపయోగపడుతున్నది. – పవిత్తర్సింగ్
లెఫ్ట్ హ్యాండర్స్ ఉపయోగించే స్టేషనరీ సామగ్రిని తక్కువ ధరకు అందిస్తున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే.. విదేశీ సుంకం, డెలివరీ చార్జీలు అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఒక షార్ప్‌నర్ రూ.600 పడుతుంది. ఇక్కడ అంత ధరకు కొనలేరు. అందుకే ఫ్రాన్స్‌కు చెందిన మేప్డ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని, విడి భాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ విధంగా ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ అనే స్టార్టప్‌ను 2017లో ప్రారంభించి, ఆన్లైన్ షాపింగ్ విధానంతో అందిస్తున్నాం. సందీప్‌సింగ్