e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home హైదరాబాద్‌ బోనమెత్తిన లష్కర్‌

బోనమెత్తిన లష్కర్‌

  • భక్తజన సంద్రంగా సికింద్రాబాద్‌ పరిసరాలు
  • ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం
  • సమర్పించిన మంత్రి తలసాని
  • పట్టువస్ర్తాలు, ఒడిబియ్యం
  • సమర్పించిన సీఎం సతీమణి
  • అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
  • పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చిన భక్తులు.. ఆకట్టుకున్న పలహారపు
  • బండ్లు, తొట్టెల ఊరేగింపు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోతరాజుల విన్యాసాలు

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను నగర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మూడు వారాలుగా అత్యంత వైభవంగా నిర్వహించారు. మొన్న గోల్కొండ, నిన్న బల్కంపేట ఉత్సవాలు ఘనంగా జరుగగా.. ఆదివారం లష్కర్‌ భక్తులు బోనమెత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో సికింద్రాబాద్‌ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రులు, సీఎం సతీమణి పట్టువస్ర్తాలు, బోనం, ఒడిబియ్యం సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమష్టి కృషితో చర్యలు చేపట్టారు.

బేగంపేట్‌, జూలై 25: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి పట్టు వస్ర్తాలు, బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటల నుంచి భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరిగింది.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

- Advertisement -

మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, సాయన్న, ముఠా గోపాల్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, హైకోర్టు జడ్జి అమర్‌నాథ్‌గౌడ్‌, అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ సునీతాలక్ష్మారెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

పటిష్టంగా ఏర్పాట్లు

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బందోబస్తును పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టారు. జలమండలి ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీరు అందజేశారు. ప్రధానంగా జాతరలో పోతరాజుల విన్యాసాలు, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దక్కన్‌మానవ సేవా సమితి, ఆర్య సమాజ్‌, ఎన్‌సీసీ వలంటీర్లు భక్తులకు మంచినీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు.

నేడు రంగం

అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం వేడుకలు నిర్వహించనున్నారు. బోనాల పండుగ మరుసటిరోజు అమ్మవారి ఆలయంలో బలిపూజ (గావు పట్టడం)నిర్వహిస్తారు. తర్వాత ఆలయంలోని మాతాంగేశ్వరి దేవాలయం ఎదుట జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. అనంతరం అమ్మవారిని అంబారీపై దేవాలయం చుట్టూ ఊరేగించి మెట్టుగూడలోని దేవాలయానికి సాగనంపుతారు.

అమ్మవారిని దర్శించుకున్న సీఎం సతీమణి

మధ్యాహ్నం 12:25గంటలకు సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్ర్తాలు, బోనం, ఒడి బియ్యం సమర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దగ్గరుండి పూజలు చేయించారు. అదేవిధంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

అన్ని పండుగలకు గుర్తింపు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో అన్ని పండుగలకు గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం ప్రత్యేకంగా బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు కేటాయించింది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి అశీస్సులు ఉండాలి.

సమష్టి కృషితో ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

బోనాల జాతరకు వచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. రెండు ప్రత్యేక క్యూలైన్‌ల ద్వారా భక్తులను ఆలయంలోకి పంపించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాల సమర్పణ జరిగింది. భక్తుల తాకిడి మధ్యాహ్నం 12గంటల తర్వాత అధికమైంది. సమష్టి కృషితో జాతరను ప్రశాంతంగా నిర్వహించాం.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా.

స్వరాష్ట్రంలోనే గౌరవం దక్కింది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

స్వరాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం దక్కింది. రాష్ట్రం ఏర్పాటు జరుగాలని ఒకప్పుడు సీఎం కేసీఆర్‌ మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొక్కులన్నీ తీర్చారు. అందరిక్షేమం కోరుకునే కేసీఆర్‌ మరో పది కాలాల పాటు సీఎంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా.

ముత్యాలమ్మను దర్శించుకున్న సీఎం సతీమణి

సికింద్రాబాద్‌, జూలై 25 : సికింద్రాబాద్‌ మోండామార్కెట్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మోండామార్కెట్‌ టకారబస్తీ, న్యూ అశోక్‌నగర్‌లో పద్మారావు గౌడ్‌ నిర్మించిన ముత్యాలమ్మ దేవాలయంలో ఆయన కుమార్తె తీగుళ్ల మౌనికాగౌడ్‌ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారికి బోనాలు సమర్పించారు. సీఎం కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ, ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పద్మారావు గౌడ్‌ నివాసంలో విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ సతీమణి తీగుళ్ల స్వరూపగౌడ్‌, యువనేతలు కిశోర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌ గౌడ్‌, రామేశ్వర్‌గౌడ్‌, త్రినేత్రగౌడ్‌ పాల్గొన్నారు.

గోల్కొండ కోటలో ఐదో బోనం

మెహిదీపట్నం, జూలై 25 : గోల్కొండ కోటలో ఐదవ పూజ ఘనంగా జరిగింది. ఆదివారం వేలాది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మహంకాళి ఆలయంలో కులవృత్తుల సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana