సిటీ బ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకోవాలని కలలు కనే ఔత్సాహికులను ప్రోత్సహించి.. 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ సంస్థ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిల్మ్ మేకింగ్‌పై ఆన్లైన్ విధానంలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ఏడువారాలుగా కొనసాగుతున్నది. ఆణిముత్యాల్లాంటి యువ కళాకారులను కళా ప్రపంచానికి అందజేసేందుకు ఆయా విభాగాల్లో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి.. వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ సంస్థ అధ్యక్షుడు ఖాజాపాషా తెలిపారు. తెలంగాణ చరిత్ర, వాగ్గేయకారులు, సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ విభిన్న కళలు, కళారూపాలు, మహోన్నత వ్యక్తుల గురించి భవిష్యత్తరాలకు తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఫిల్మ్ మేకింగ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన అంశాలను ఈ శిక్షణలో వివరిస్తున్నారు.. ఓ కెమెరామెన్‌కు డైరెక్టర్ షాట్ ఎలా చెప్పాలి.? ఆర్ట్ డైరెక్టర్‌తో ఎట్లా మాట్లాడాలి. ?మేకప్ ఎలాంటిది కావాలి..? ఆర్టిస్టుల ఎంపిక ఎలా..? వాళ్లతో నటింప చేయించడం.. ఎలా.. ఏ స్క్రిప్ట్‌నకు ఎలాంటి డైలాగ్స్ రాయించాలి? ఎడిటింగ్, డబ్బింగ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ విధానాలు, ప్రీ ప్రొడక్షన్లో కథను, ఆర్టిస్టుల ఎంపిక, మిగతా టెక్నీషియన్లను ఎంచుకునే పద్ధతులు, ప్రొడక్షన్లో షూటింగ్ ఎలా చేయాలి? ఏ కథకు ఎంత బడ్జెట్ ఉండాలి… వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎఫ్టీఐ.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, పుణె.. ఎస్ఆర్ఎఫ్టీ సత్యజిత్‌రే ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ప్రొఫెసర్లు, మన వద్ద ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సీనియర్ సినీ దర్శకుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు.