ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Aug 28, 2020 , 00:55:19

కి‘లేడీ’ క్రిమినల్స్‌

కి‘లేడీ’ క్రిమినల్స్‌

ఫ్రెండ్స్‌గా చాటింగ్‌.. ప్రైవేట్‌గా మీటింగ్‌

ఆన్‌లైన్‌లో నగ్న నృత్యాలు

రికార్డు చేసి బెదిరింపులు

అయితే వసూళ్లు.. లేదంటే పోస్టులు

భరత్‌పూర్‌ సైబర్‌ గ్యాంగ్‌ల కొత్త నేరాలు

నెలరోజుల్లో 50కి పైగా ఫిర్యాదులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వారు బీఏలూ, ఎంఏలూ చదువుకున్న పట్టభద్రులు కాదు. టెక్నికల్‌ కోర్సులేమీ చదువలేదు. ఇంటర్నెట్‌ గురించి తెలిసింది అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు వారు ఆన్‌లైన్‌లో ఆరితేరిపోయారు. తాము ఎవరో తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా పక్కాగా క్రైమ్స్‌ చేసే తెలివిని మాత్రం సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు కిడ్నాప్స్‌, మర్డర్స్‌, దొంగతనాలకు పెట్టింది పేరుగా ఉన్న రాజస్థాన్‌ భరత్‌పూర్‌ గ్యాంగ్‌లు ఇప్పుడు సైబర్‌ క్రైమ్స్‌కు అలవాటు పడ్డాయి. వీరి వలలో చిక్కుతున్న వారు చాలా మంది పరువు పోతుందనే మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలా టార్చర్‌ పెడుతున్న గ్యాంగ్‌ల బారిన పడుతున్న వారి సంఖ్య నెల రోజుల్లో 50కి పైగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.

మోసాలు ఇలా...

కొందరు మహిళా సైబర్‌ క్రిమినల్స్‌ అందమైన ప్రొఫైల్‌ పిక్స్‌తో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తారు. మెస్సేజ్‌లతో తమ వలలో వేసుకొని.. ఆ తర్వాత వాట్సాప్‌ నంబర్లు తీసుకుంటారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అసభ్య పదజాలంతో చాటింగ్‌ మొదలు పెట్టి.. అకస్మాత్తుగా ఒకరోజు నగ్నంగా కనిపిస్తారు. ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతారు. నువ్వు కూడా నాలాగే చాటింగ్‌ చేయు అంటూ రెచ్చగొడతారు. లైంగిక వాంఛను ఆసరాగా చేసుకొని ఆ తతంగాన్నంతా రికార్డు చేస్తున్న సదరు కిలాడీ లేడీస్‌.. తర్వాత రోజు వాటిని వాట్సాప్‌లో పంపించి బెదిరింపులకు దిగుతారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఫేస్‌బుక్‌లో సదరు వీడియోలను పోస్ట్‌ చేస్తామని టార్చర్‌ పెడుతారు. దీంతో పరువు పోతుందన్న భయంతో కొందరు అడిగినంతా ఇచ్చేస్తుండగా.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళ్తున్నారు.

ఆత్మహత్యకు సిద్ధమైన వ్యాపారి...

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ వ్యాపారి ఇటీవల ఓ మహిళ వలలో పడ్డాడు. డబ్బు ఇవ్వకపోవడంతో సదరు వ్యాపారి వీడియోలను సైబర్‌ క్రిమినల్స్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. పరువు పోయిందన్న బాధలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ.. కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి సదరు వీడియోలను డిలీట్‌ చేయించుకున్నాడు. ఇలా చాలా మంది ఇలాంటి వారిన పడి లోలోపల కుమిలిపోతున్నారు. కొందరు మాత్రం ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చి.. వీడియోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించుకుంటున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో నెల రోజుల్లోనే ఇలాంటి కేసులు 50 వరకు వచ్చినట్లు సమాచారం.

మహిళల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లపై జాగ్రత్త...

గుర్తు తెలియని మహిళలు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే బోల్తా పడొద్దని పోలీస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. అశ్లీలానికి బానిసలుగా మారి.. ఆ వ్యామోహంలో క్రిమినల్స్‌ చెప్పిన ట్లు చేస్తే ఇబ్బందుల్లో పడుతారని సూచిస్తున్నారు. ఇలాంటి బెదిరింపుల బారిన పడిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. వారిని డిప్రెషన్‌లో నుంచి బయటికి తీసుకువస్తున్నారు. 


logo