గురువారం 28 మే 2020
Hyderabad - May 21, 2020 , 01:15:17

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ నేడు ప్రారంభం

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ నేడు  ప్రారంభం

హైదరాబాద్  : బయోడైవర్సిటీ జంక్షన్‌లో నిర్మిస్తున్న ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను గురువారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభిస్తారని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు. దీంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు.  జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ విలేకరులతో మాట్లాడుతూ, బయోడైవర్సిటీ లెవల్‌-1 ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.30.26కోట్లు ఖర్చు అయిందని, దీని పొడవు 690 మీటర్లు, వెడల్పు 11.50 మీటర్లని, ఇది మూడు లేన్ల ఫ్లైఓవర్‌ అని చెప్పారు. 

ఈ ఫ్లైఓవర్‌ పూర్తికావడంతో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379కోట్ల అంచనా వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయినట్లవుతుందని తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్‌, మైండ్‌స్పేస్‌ ఫ్లైఓవర్‌, అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్‌, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌ లెవెల్‌-2 ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ లెవల్‌-1 ఫ్లైఓవర్‌ తదితర ఆరు ప్రాజెక్టులు చేపట్టగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమైనట్లు మేయర్‌ వివరించారు.


logo