సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 07:16:45

అందరి దృష్టి.. కోకాపేట వైపే...

అందరి దృష్టి.. కోకాపేట వైపే...

  • కోకాపేట లే అవుట్‌ అభివృద్ధి పనులకు మార్గం సుగమం 
  • 513 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో మౌలిక వసతులు 
  • ఆకాశ హార్మ్యాలకు వీలుగా ఏర్పాట్లు 
  • ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌కు అతి సమీపంలో ఉండటంతో బహుళ జాతి కంపెనీలు, డెవలపర్ల దృష్టి 
  • నార్సింగిలో ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటు.. ముగిసిన టెండర్‌ గడువు 
  • ఆరు బిడ్లు దాఖలు.. త్వరలో పనులు మొదలు 

అంతర్జాతీయ స్థాయి హంగులతో కోకాపేటలో హెచ్‌ఎండీఏ భారీ లే అవుట్‌ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఆకాశ హార్మ్యాల నిర్మాణాలకు నెలవుగా సుమారు 513 ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహుళ జాతీ కంపెనీలు డెవలపర్లను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక హంగులతో విశాలమైన రోడ్లు నీటి వసతి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, స్ట్రీట్‌ లైటింగ్‌ తదితర మౌలిక వసతులతో ఈ లే అవుట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల పనులకు గానూ టెండర్లను ఆహ్వానించగా, ఆరు బిడ్లు దాఖలు చేశారు. సాంకేతిక మూల్యాంకనం (టెండర్‌ టెక్నికల్‌ పరిశీలన) జరుపుతున్న అధికారులు వచ్చే నెల మొదటి వారంలో ఫైనాన్స్‌ బిడ్స్‌ ప్రక్రియను పూర్తిచేసి అర్హత కలిగిన ఏజెన్సీతో పనుల ఒప్పందం కుదుర్చుకొని పనులను చేపట్టనున్నామని పేర్కొన్నారు.

నార్సింగిలో ఇంటర్‌చేంజ్‌

గ్రేటర్‌ మణిహారమైన అవుటర్‌ రింగు రోడ్డులో మరో చోట ఇంటర్‌చేంజ్‌ (కూడలి) ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. 158 కిలోమీటర్ల రహదారిలో మొత్తంలో 19చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. ఔటర్‌ వెంట అభివృద్ధి శరవేగంగా జరుగుతుండటం, వాణిజ్య భవనాలు, భారీ అపార్ట్‌మెంట్లు, విల్లాలతో పాటు బహుళ జాతి కంపెనీలు, ఐటీ కంపెనీలు వెలుస్తున్న నేపథ్యంలో అవుటర్‌ మార్గం నిత్యం రద్ధీగా మారుతున్నది. ఇందులో భాగంగానే నార్సింగి వద్ద ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

హెచ్‌ఎండీఏ కోకాపేట భూములకు ప్రత్యేకత ఉంది. ఈ భూములు గండిపేట జలాశయం తీరంలో, ముఖ్యంగా అవుటర్‌ రింగు రోడ్డుకు కేవలం 400మీటర్ల దూరంలో ఉన్నాయి. మరోవైపు అకాశ హర్మ్యాల (బహుళ అంతస్తుల భవనాలు) నిర్మాణాలకు అనువైన ప్రాంతం. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌కు అతి సమీపంగా ఈ భూములు ఉండటంతో బహుళ జాతి కంపెనీలు, డెవలపర్ల దృష్టి పడింది. ఈ తరుణంలోనే 2006 సంవత్సరంలో నిర్వహించిన వేలం కంటే అత్యధికంగా ఈ సారి డిమాండ్‌ వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాతో లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ లే అవుట్‌లో అకాశాహర్మ్యాలకు వీలుగా 45, 36 మీటర్ల వెడల్పుతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సీవరేజీ సిస్టం, నీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. హై రైజ్‌ బిల్డింగ్‌ (అకాశహర్మ్యాలు), మల్టీపర్పస్‌ భవనాలకు వీలుగా మౌలిక వసతులను సమకూర్చనున్నారు. అంతేకాకుండా ల్యాండ్‌ స్కేపింగ్‌ (పచ్చదనం), సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుట్‌పాత్‌, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ తదితర ఏర్పాటు చేయనున్నారు.