e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home హైదరాబాద్‌ కోకాపేట.. కాసుల మూట

కోకాపేట.. కాసుల మూట

కోకాపేట.. కాసుల మూట
  • రియల్‌ హైదరాబాద్‌ అని మరోసారి రుజువు
  • ఫలించిన తెలంగాణ ప్రభుత్వ వ్యూహం
  • రూ.300 కోట్లతో లేఅవుట్‌ అభివృద్ధి
  • రికార్డు ధరలతో కేక పుట్టించిన భూములు
  • ఇతర మెట్రోల్లో ఎకరాకు రూ.45 కోట్లే!

దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగానికి హైదరాబాదే రాజధాని అని మరోసారి రుజువైంది. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన కోకాపేట భూములు ఈ-వేలంలో కేక పుట్టించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధికంగా ధర పలికి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాయి. ఫలితంగా ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల విక్రయం వల్ల భారీగా నిధులు సమకూరాయి. గురువారం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల ఆన్‌లైన్‌ వేలానికి అద్భుతమైన స్పందన లభించింది. 8 ప్లాట్లకు 60 మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పోటీపడి భూములను సొంతం చేసుకున్నారు. ఒక ఎకరాకు ఏకంగా రూ.60.2 కోట్లను వెచ్చించారు. దీంతో హైదరాబాద్‌లోని భూముల సత్తా ఏమిటో దేశానికి చాటి చెప్పింది.

ఊపునిచ్చిన విశ్వనగర విజన్‌…

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో సర్కారు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మరిన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా సత్తా చాటుతూ సుస్థిర పాలనను అందించడంతో పాటు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది.

పరాధీనం కాదు.. పెట్టుబడులకు కేరాఫ్‌!

- Advertisement -

పరాధీనం అవుతాయన్న భూములను పెట్టుబడులకు కేరాఫ్‌గా మలచడంతో ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. సుప్రీం కోర్టులో కోకాపేట భూములపై న్యాయపోరాటం చేసి ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడేలా భూముల్ని దక్కించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కోకాపేట భూములకు వేలం నిర్వహించిన సమయంలో అల్లుకున్న న్యాయ పరమైన చిక్కుల కారణంగా ఆ వేలం ప్రక్రియ నిర్వీర్యమైంది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందుచూపుతో వ్యవహరించింది. ఈ భూముల చుట్టూ ఉన్న న్యాయ పరమైన చిక్కులపై సుదీర్ఘ పోరాటం చేపట్టింది. సమర్థవంతమైన వాదనలతో తిరిగి దక్కించుకుంది. ఆ భూముల్లో లే అవుట్‌ అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా మౌలిక వసతులు, అనుమతుల విధానాలను రూపకల్పన చేసింది. ఆ తర్వాతనే ఈ-వేలం నిర్వహించడంతో అంతర్జాతీయ సంస్థలు ఆకర్షితమయ్యాయి. ఫలితంగా కోకాపేట భూములు ఎవరూ ఊహించని ధరలు పలికాయి.

అవే ప్రత్యేక ఆకర్షణలు…

కోకాపేటను అనుకొని ఒకవైపు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌, దాంతో పాటు ఔటర్‌ రింగు రోడ్డు ఉండడంతో మౌలికవసతుల పరంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే కోకాపేటలో 58 అంతస్థుల్లో పలు సంస్థలు భవనాలను నిర్మిస్తున్నాయి. అల్ట్రా లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులతో, హైరైజ్‌ భవనాలు కోకాపేటలో పదుల సంఖ్యలో ఉండడంతో ఈ ప్రాంతానికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. దీంతో నగరానికి చెందిన బిల్డర్లతో పాటు ఇతర మెట్రో నగరాలకు చెందిన బిల్డర్లు సైతం కోకాపేటలో భూములను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ముఖ్యంగా కోకాపేటను అనుకొని ఓఆర్‌ఆర్‌ నుంచి లేఅవుట్‌ వరకు వచ్చేందుకు వీలుగా కొత్తగా అత్యున్నత ప్రమాణాలతో ట్రంపెట్‌ను హెచ్‌ఎండీఏ నిర్మిస్తోంది. దీని వల్ల ఔటర్‌ మీదుగా నేరుగా లేఅవుట్‌లోకి రాకపోకలు సాగిచేందుకు విశాలమైన 120,150 అడుగుల విస్తీర్ణంతో రోడ్లను నిర్మిస్తున్నారు. ఇవన్నీ భూముల విలువను పెంచేలా చేశాయన్నది రియల్‌ నిపుణుల వాదన.

దేశంలోనే ది బెస్ట్‌…

దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో జరిగిన ప్రభుత్వ భూముల వేలంతో పోలిస్తే… తాజా కోకాపేట ఈ-వేలంలో ఊహించని క్రేజ్‌ వచ్చిందని రియల్‌ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ మొదలు బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తదితర నగరాలను పరిశీలిస్తే గరిష్ఠంగా ఎకరా ధర రూ.45 కోట్లకు మించలేదని రియల్‌ నిపుణులు ఒకరు తెలిపారు. ఇతర నగరాలకు భిన్నంగా ఇక్కడ ప్రభుత్వం కోకాపేట భూముల్లో సమీకృత అభివృద్ధికి అవకాశం కల్పించింది. పరిశ్రమలు మినహా నివాస, వ్యాపార, వినోద తదితర రంగాల్లో ఈ భూములను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. మిగతా నగరాల్లో ఎకరాకు రెండు, మూడింతల మేర మాత్రమే నిర్మాణ ప్రదేశం (బిల్డప్‌ ఏరియా) సాధ్యం కాగా… తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సరళీకృత విధానాల్లో ఎకరాకు ఐదింతల వరకు బిల్డప్‌ ఏరియా రానుంది. అందుకే అంతర్జాతీయ సంస్థలు కోకాపేట భూములకు విపరీతంగా పోటీపడ్డాయని నిపుణులు వివరిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోకాపేట.. కాసుల మూట
కోకాపేట.. కాసుల మూట
కోకాపేట.. కాసుల మూట

ట్రెండింగ్‌

Advertisement