శనివారం 11 జూలై 2020
Hyderabad - Jun 06, 2020 , 02:26:33

పిల్లల కోసం అడ్డదారులొద్దు..!

పిల్లల కోసం అడ్డదారులొద్దు..!

ఆస్తిపాస్తులు ఉన్నా.. లేకున్నా.. సంతానం ఉండాలి.. పిల్లలు ఉంటే జీవితం హాయ్‌గా ఉంటుంది.. ముసలి తనంలో అండగా ఉంటారు.. తమ వంశ వృక్షం కలకాలం అలాగే ఉంటుంది..పిల్లలు లేకపోతే తమ తరం.. తమతోపాటే నశిస్తుందేమోనని మదన పడుతుంటారు. కానీ... కొందరు దంపతులకు సంతానం భాగ్యం కలుగదు... సంతానం కోసం వారు చేయని ప్రయత్నమంటూ ఉండదు.. పూజలు, దవాఖానలవెంటా తిరిగినా ఫలితం దక్కదు... చివరకు అడ్డదారులు తొక్కుతున్నారు.. ఈ క్రమంలో కొందరు దత్తత కోసం ప్రయత్నిస్తుండగా.. మరికొందరు కిడ్నాప్‌నకు పాల్పడుతూ..ఇంకొందరు దళారులనుఆశ్రయించి పిల్లలను కొంటున్నారు. ఇలా సంతానంలేని దంపతులు.. తప్పటడుగులు వేస్తూ కటకటాలపాలవుతున్నారు.

పాతబస్తీలోని తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఇబ్రహీం కుటుంబం కొడుకు పుట్టాలని ప్రార్థనలు చేసినా ఫలితం దక్కలేదు. వరుసగా నలుగురు కూతుళ్లు పుట్టారు. కొడుకు ఉంటే ముసలి వయస్సులో అండగా ఉంటాడని ఇబ్రహీం భావించాడు. ఏడాదిన్నర బాబుతో కలిసి భిక్షాటన చేస్తున్న ఓ మహిళ నుంచి బాబును కిడ్నాప్‌ చేశాడు.

పాతనగరంలోని దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన సమ్రీన్‌.. తన కూతురుకు 9 ఏండ్ల క్రితం వివాహం చేసింది. పెండ్లి అయి సంవత్సరాలవుతున్నా పిల్లలు పుట్టడంలేదు. ఎలాగైనా కూతురు జీవితంలో వెలుగు నింపాలనుకున్నది. ఈ క్రమంలో చికిత్స కోసం తల్లిదండ్రులతో కలిసి దవాఖానకు వచ్చిన నాలుగేండ్ల బాలుడిని సమ్రీన్‌ కిడ్నాప్‌ చేసింది. ఇక ఈ బాబు నీ కొడుకే అంటూ కూతురుకు ఇచ్చింది.

మహబూబాబాద్‌కు చెందిన దేవి దంపతులు.. సంతానం కోసం విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో మధ్యవర్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లమ్మబండకు చెందిన కొందరు దేవిని సంప్రదించారు. రూ.22వేలకు బాలుడిని తీసుకొస్తామని ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. 2 నెలల బాబును తీసుకొచ్చి దేవికి అప్పగించారు.   ఇలా.. సంతానం లేని దంపతులు పిల్లల కోసం విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు కిడ్నాప్‌నకు పాల్పడుతున్నారు.  ఇంకొందరు..మధ్యవర్తుల మాటలు విని మోసపోతున్నారు. పిల్లలను తీసుకెళ్లిన ఘటనల్లో పోలీసులు అరెస్ట్‌చేసిన ఘటనలు ఉన్నాయి.  చట్టబద్ధతలేని చిన్నారుల దత్తత  ప్రమాదమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చిన్నారుల దత్తతకు ప్రభుత్వాల సహకారం

సంతానంలేని వారికి అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో కొన్ని సంస్థలు చేయూతనందిస్తున్నాయి. ఏ వయస్సులోని పిల్లలను పెంచుకోవాలనుకుంటున్నారో.. ఆ విషయాలను తెలియజేస్తూ సంబంధిత అధికారులకు దరఖాస్తు అందిస్తే చాలు.. చిన్నారులను దత్తత చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ  ఆధ్వర్యంలో కొనసాగే సంస్థలో పిల్లలను దత్తత తీసుకునేవారికి అవకాశం కల్పిస్తున్నారు. దత్తత తీసుకొనేవారు పూర్తి వివరాలతోపాటు దంపతుల ఒప్పందం మేరకు చిన్నారులను దత్తతకు అంగీకరిస్తున్నారు. 

దళారులను నమ్మొద్దు

న్యాయ సమ్మతం కాని దత్తత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దు. సంతానం లేని వారు ప్రభుత్వ పరంగా నిర్వహించే పలు సంస్థల నుంచి దత్తత పొందవచ్చు. స్థానికంగా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. దళారులు కమీషన్‌ల కోసం పాకులాడుతూ ఎంతో మందికి కన్నీటి కష్టాలను మిగిల్చారు. అలాంటి చేదు జ్ఞాపకాలు జీవితంలోకి రానీయకుండా ప్రభుత్వ సంస్థల నుంచి దత్తత తీసుకోవడమే శ్రేయస్కారం .  - రాఘవేంద్ర, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌


logo