బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 29, 2020 , 08:50:38

నిరుద్యోగ నిర్మూలనకు జాబ్‌ మేళాలు

నిరుద్యోగ నిర్మూలనకు జాబ్‌ మేళాలు

  • డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు 
  • కార్పొరేట్‌, మల్టీ నేషనల్‌ కంపెనీలలో అవకాశం
సికింద్రాబాద్‌ : నియోజకవర్గంలో యువత నిర్వీర్యం కాకుండా విద్యావంతులైన యువతకే కాకుండా కొద్దోగొప్పో చదివిన వారికి కూడా వేల వేల మందికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఉద్యోగాలను ఇప్పించారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు సకాలంలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురై ఇతర మార్గాలను ఆశ్రయిస్తారని వారికి సకాలంలో ఉద్యోగాలను, అంతంత మాత్రంగా చదువుకుకున్న యువకులకు ఉపాధి మార్గాలను చూపించడం ద్వారా యువత నిరుత్సాహంగా ఉండకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన యువత నిరుత్సాహానికి గురైతే వారు తప్పుడు మార్గాలను ఆశ్రయిస్తారని, వారిని గాడిలో పెట్టడం కోసం ఆరు సంవత్సరాలుగా పలు పర్యాయాలు జాబ్‌మేళాలు నిర్వహించారు. యువకుల అర్హతలను బట్టి వారికి ఉద్యోగాలు వచ్చేలా పలు సంస్థల నుంచి వివరాలు సేకరించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇలా క్రమం తప్పకుండా ఉద్యోగ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ సమస్యలను నివారించడం కోసం కృషి చేస్తున్నారు. కొన్ని నెలల కిందట సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగమేళా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు దాదాపు నాలుగువేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించారు.

 ఎంబీఏ, బీటెక్‌, ఎంటెక్‌, డిగ్రీ, ఇంటర్‌ మీడియట్‌, పదవ తరగతి చదివిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు. దాదాపు 25 సంస్థలను  ఒక్కచోటకు రప్పించి అభ్యర్థులకు అప్పటికప్పుడే ఉద్యోగం ఇప్పించారు. కొన్ని రోజుల కిందట అడ్డగుట్టలో కూడా జాబ్‌మేళా ఏర్పాటు చేసి 3500 మందికి, మెట్టుగూడలో ఉద్యోగ మేళా నిర్వహిచి దాదాపు 6వేల మందికి  ఉద్యోగం ఇప్పించారు. సికింద్రాబాద్‌ నియోజకర్గంలో రెండు పర్యాయాలు జాబ్‌మేళా ఏర్పాటు చేసి 10,500 వందల ఉద్యోగాలు కల్పించగా నామాలగుండులోని మంత్రి పద్మారావు కార్యాలయం ద్వారా దాదాపు మరో 6వేల మందికి ఉద్యోగం ఇప్పించారు. ప్రతినిత్యం నామాలగుండులోని మంత్రి  కార్యాలయానికి ఉద్యోగం కావాలని చాలా మంది వస్తుంటారు. వారందరికి ఎక్కడో ఒకచోట తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ను ఆశ్రయిస్తే ఎక్కడో చోట ఉద్యోగం లభిస్తుందని తెలిసినవారు ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నామాలగుండులోని కార్యాలయానికి వస్తుంటారు. 

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మరోమారు ఉద్యోగ మేళా నిర్వహించడం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఎన్నికల నగారా మోగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ఉద్యోగ మేళాలో దాదాపు 6 వేల మందికి  ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏర్పాట్లు జరిపారు. ఉద్యోగమేళాకు సెట్విన్‌ సహకారం తీసుకుంటున్నారు. పలు కార్పొరేట్‌ సంస్థలతోపాటు మల్టీ నేషనల్‌ కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దాదాపు 25 సంస్థలు ఇక్కడ అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించి అప్పటికప్పుడే ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇన్నోవా, హిందుజా, గ్లోబల్‌ సొల్యూషన్స్‌, బిగ్‌సీ, స్విగ్గీ, మ్యాన్‌పవర్‌, అడెక్కో, టీంవీవర్స్‌ మల్టీనేషనల్‌ సంస్థలు ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. పదో తరగతి నుంచి డిగ్రీ చేసినవారు, ఇంటర్‌ మీడియట్‌, ఎంటెక్‌, బీటెక్‌, పాలిటెక్నిక్‌, కంప్యూటర్‌ సైన్స్‌,  ఇతర విద్యార్హతలు ఉన్నవారు కూడా ఇంటర్వూలో హాజరు కావచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు  ఇంటర్వ్యూలు జరిగే  ప్రాంతాలకు చేరుకొని పేర్లను ముందుగా నమోదు చేసుకోవడంతోపాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, జిరాక్స్‌ కాపీలు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.అయితే ఎన్నికలు రావడంతో ఉద్యోగ మేళాకు అటంకం ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత ఉద్యోగమేళా ఉండే అవకాశం ఉంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి  - టి.పద్మారావుగౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన జాబ్‌మేళాలో అర్హతలున్న ప్రతిఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాం. కార్పొరేట్‌ సంస్థలలోపాటు మల్టీనేషన్‌ కంపెనీలలో అవకాశాలిచ్చాం. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నియోజవర్గం యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అటు తరువాత ఇతర ప్రాంతాలలో వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఎంతమందికైనా  ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో ఉన్నాం. యువతను సరైన మార్గంలో పెట్టాలని భావిస్తున్నాం. దారితప్పకుండా ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం.      ఉద్యోగాల కోసం విసుగెత్తిపోయాను - విద్య, సికింద్రాబాద్‌

ప్రతి రోజూ పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసి ఇంటర్వ్యూలకు వెళితే అనుభవం కావాలని, ఇతర అర్హతలు అడిగేవారు. ఇప్పటికే అనేక ఇంటర్వూలకు హాజరయ్యాను. ఎక్కడా ఉద్యోగం రాలేదు. విసుగెత్తిపోయి ఇంటర్వ్యూలకు వెళ్లడం మానేశాను. అదృష్టవశాత్తు జాబ్‌ మేళాకు వచ్చాను. ఉద్యోగం దొరికింది.                      

జాబ్‌ మేళాతో ఉద్యోగం దొరికింది - శ్రావణి, మల్కాజ్‌గిరి

అనేక ప్రాంతాల్లో తిరిగినా ఉద్యోగం రాలేదు. ఇంతకుముందు ఏర్పాటు చేసిన జాబ్‌మేళా వల్ల నాకు ఉద్యోగం దొరికింది. ఇకముందు కూడా ఇలాంటి జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి నాలాంటివారికి ఉద్యోగం ఇప్పించి ఉపాధిని కల్పించాలి. పద్మారావుగారికి కృతజ్ఞతలు.          

ఖర్చు లేకుండానే..: సత్యం, సికింద్రాబాద్‌                                                                            

ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగం కోసం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. దూరదూర ప్రాంతాలకు బస్సులో వెళ్లి రావడం ఖర్చుతో కూడుకున్నది. అయినా అనుభవం లేదని ఉద్యోగం ఇవ్వలేదు. జాబ్‌మేళాలో ఎక్కడికీ వెళ్లకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా పైసా ఖర్చులేకుండానే కార్పన్‌ స్టాఫింగ్‌ సొల్యూషన్‌ సంస్థలో ఉద్యోగం లభించడం ఆనందంగా ఉంది. జాబ్‌మేళా ఏర్పాటు చేసి నాలాంటి వారికి ఉద్యోగం ఇప్పించినందుకు ధన్యవాదాలు.             


logo