గురువారం 28 జనవరి 2021
Hyderabad - Oct 30, 2020 , 07:44:36

స్వశక్తితో ముందుకు...

స్వశక్తితో ముందుకు...

  • విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నా.. హైదరాబాద్‌లో నివాసం
  • అవరోధాలు అధిగమించి.. పలువురికి దారి చూపించి
  • సృజనాత్మకతతో 30 మందికి ఉపాధి
  • ఆదర్శంగా నిలుస్తున్న రాధిక

అది కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్‌ల వ్యాపారం. చిన్న తేడా వచ్చినా భారీ నష్టం. అందులోనూ ఓ మహిళ. ‘చాలా మంది నీకవసరమా?’ అంటూ ప్రశ్నించారు. వెనక్కిలాగే ప్రయత్నమూ చేశారు. అయినా ఆమె బెదరలేదు. 12 ఏండ్లుగా ఆమె సాగించిన వ్యాపార ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. అడుగడుగునా అవరోధాలను అధిగమిస్తూ వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఆమె రాధిక మన్నె. డైమండ్‌ జ్యువెల్లరీ వ్యాపారంలో రాణిస్తూ.. బెస్ట్‌ ఎంట్రప్రెన్యూర్‌గా నిలిచారు. నగరంలోని సెలబ్రిటీలు, పొలిటికల్‌ ఫ్యామిలీల ఫంక్షన్లు, ఇతర ఈవెంట్స్‌, ఫ్యాషన్‌ షోలలో ఆమె డిజైన్‌ చేసిన జ్యువెల్లరీ తళుక్కుమనాల్సిందే. అంతలా ఆమె క్రియేటివిటీ ప్రదర్శిస్తారు. మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

అమెరికాలో చదువుకున్న రాధిక అక్కడే సెటిల్‌ అ య్యే అవకాశం ఉన్నా.. స్వదేశానికి వచ్చింది. డైమండ్‌కు సంబంధించిన అంశాలపై ఆమె విదేశాల్లో అధ్యయనం చేశారు. తనకున్న వ్యాపార ఆలోచనకు నగరంలో బీజం పడింది. డైమండ్‌ జ్యువెల్లరీ ప్రారంభించాలనుకుంది. అందులో భాగంగా ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో డైమండ్‌ వ్యాపార విశేషాలను తెలుసుకున్నారు. ఆ రంగంలో రాణించేందుకు తొలుత ఆమె మా ర్కెటింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ చేశారు. అనంతరం నగరంలో రాధిక డైమండ్‌ జ్యువెల్లరీని ఏర్పాటు చేశారు. అప్పటికీ డైమండ్‌పై అతికొద్ది మందికి మాత్రమే అవగాహన ఉండేది. ఎన్ని రకాల డైమండ్లు ఉంటాయి? వాటి ని ఎలా ఎంచుకోవాలి? కొంతమంది కస్టమర్లను ఎలా మోసం చేస్తారు? ఏ కలర్‌ ఎలాంటి డైమండ్‌? తదితర అంశాలను కస్టమర్లకు వివరించి నాణ్యమైన జ్యువెల్లరీని ఇవ్వడమే రాధిక స్పెషాలిటీ. అందుకే రాధిక పేరు నగరంలో మార్మోగుతుంది. వ్యాపార ప్రారంభంలో బస్సు ల్లో, ఆటోల్లో డైమండ్స్‌ను తీసుకొని ఆర్డర్స్‌ డెలివరీ చేసేది. లక్షల విలువ చేసే డైమండ్స్‌తో రాత్రుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చేదని.. మహిళగా కొంత భయం వేసినా ధైర్యంగా ముందుకెళ్లానని చెబుతున్నారు రాధిక . 

పోటీకి ఎదురొడ్డి..

ప్రస్తుతం జ్యువెల్లరీ వ్యాపారంలో దిగ్గజాలు ఉన్నారు. మార్కెట్లో పోటీని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఒక మహిళ ఈ రంగంలో రాణిస్తున్నారు. సౌత్‌ ఇండియాలో డైమండ్‌ వ్యాపారంలో నిలబడినవారు ఈమె ఒక్కరే కావడం విశేషం. చౌకర్స్‌, జుంకీస్‌, హారాలు, డిజైనర్‌ నెక్లెస్‌, బ్యాంగిల్స్‌, బ్రెస్‌లేట్స్‌, నోస్‌ పిన్స్‌ తదితర జ్యువెల్లరీలో తనదైన శైలీని ప్రదర్శించి డిజైన్‌ చేస్తున్నారు. వివాహ కలెక్షన్స్‌కు రాధిక డైమండ్స్‌ ప్రత్యేకం. పది వేల నుంచి కోట్ల వరకు డిజైన్‌లు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతారు. బెల్జియం, ముంబై నుంచి వజ్రాలను దిగుమతి చేసుకొని కస్టమర్లకు అనుగుణంగా డిజైన్‌ చేసి అందిస్తారు. ఇతర రాష్ర్టాల నుంచి సైతం రాధికకు ఆర్డర్స్‌ వస్తాయి. వజ్రాల జ్యువెల్లరీతో ఆమె 30 మందికి ఉపాధినిస్తున్నారు. కరోనా సమయంలో చాలా వరకు ఆర్డర్స్‌ లేనప్పటికీ ఇప్పుడు మళ్లీ జోరందుకోవడంతో ప్రత్యేక డిజైన్లను తయారు చేస్తున్నారు.

డైమండ్‌ మతలబు తెలుసుకోవాలి

నగరంలో వజ్రాల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాటిని ధరించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. వజ్రాల కలర్స్‌ను బట్టీ ధరలు ఉంటాయి. అవగాహన ఉంటే గానీ వాటిని గుర్తించలేం. బంగారం ఎక్కడ కొనుగోలు చేసినా పర్లేదు..కానీ డైమండ్‌ జ్యువెల్లరీ మాత్రం తెలిసిన వారి దగ్గరే కొనుగోలు చేయాలి. కలర్‌ లేకుండా ఉండేది బెస్ట్‌ డైమండ్‌. బ్రౌన్‌, యెల్లో కలర్స్‌ ఉంటే కొంత ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు డీ, ఈ, ఎఫ్‌ ఇలా కలర్స్‌ డివైడ్‌ చేసి ఉంటాయి. అయితే ఈ విషయాలు కస్టమర్లకు తెలియదు. అందుకే ఈజీగా మోసపోతున్నారు. అన్ని పరిశీలించాకే కొనుగోలు చేయాలి. వ్యాపారం ఏదైనా కష్టాన్ని నమ్ముకుంటే విజయం దక్కుతుంది.  - మన్నె రాధిక, డైమండ్‌ జ్యువెల్లరీ వ్యాపారి


logo