బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Jul 15, 2020 , 00:45:52

జలకళ

జలకళ

కోట్లు వెచ్చించి చెరువుల అభివృద్ధి.. 

వర్షం నీటితో నిండుకుండలా.. 

పెరుగుతున్న భూగర్భ జలాలు.. 

ఆహ్లాదం పంచుతున్న చెరువుల పరిసరాలు 

చెరువుల అభివృద్ధి... సుందరీకరణ

నియోజకవర్గంలో ఉప్పల్‌ నల్లచెరువు, రామంతాపూర్‌ పెద్దచెరువు, చిన్నచెరువు, నాచారంలోని హెచ్‌ఎంటీనగర్‌ చెరువు, పటేల్‌కుంట చెరువు, కాప్రా చెరువు, చర్లపల్లి చెరువులు ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. చెరువుల్లో గుర్రపు డెక్కతో పాటు, చెత్తతొలగించి అభివృద్ధి చేస్తున్నారు. చెరువుల వద్ద నిమజ్జన బండ్‌ల నిర్మాణంతో పాటు, మొక్కలు నాటి పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. చెరువులు కబ్జా కాకుండా ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. కాప్రా ఊర చెరువు రూ.9.41 కోట్లు, ఉప్పల్‌ నల్లచెరువు రూ.7.85 కోట్లు, చర్లపల్లి చెరువు రూ.12.28 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. - ఉప్పల్‌

నియోజకవర్గం పరిధిలోని చెరువులకు జలకళ సంతరించుకున్నది. పలు చెరువులను సుందరీకరించడంతో పాటు, అభివృద్ధి చేస్తున్నారు. చెరువుల అభివృద్ధి పనులు కూడా తుదిదశకు చేరుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన చెరువుల్లో వర్షం నీరు చేరి.. కాలనీవాసులకు ఆహ్లాదం పంచడంతో పాటు, భూగర్భజలాలు పెరుగుతున్నాయి. చెరువు పరిసరాల్లో మొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌లు, పచ్చదనం ఏర్పాటు చేస్తుండటంతో ఆహ్లాదం పంచుతున్నాయి. నాడు నిర్జీవంగా మారిన చెరువులు.. నేడు నీటితో నిండుకుండలా మారాయి. 

చెరువులను కాపాడుకుంటాం 

ఉప్పల్‌ నియోజకవర్గంలోని చెరువులను కాపాడుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం చెరువులకు మహర్దశను తీసుకువస్తున్నది. చెరువులను అభివృద్ధి పరిచి, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు, పచ్చదనంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపడుతాం. చెరువులను నీటితో నింపుతాం. 

-  బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే

ప్రభుత్వ చొరవతో చెరువుల అభివృద్ధి 

ఉప్పల్‌-వరంగల్‌ ప్రధాన రహదారిలో ఉన్న నల్లచెరువు గతంలో మురికి కూపంగా ఉండేది. నేడు చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తున్నారు. దీంతో చెరువు ప్రాంతం సుందరంగా మారనుంది. మంత్రి కేటీఆర్‌ చొరవ, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కృషితో చెరువు అభివృద్ధి సాధ్యమైంది. - వేముల సంతోష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు